బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాల్లో భాగంగా ఢిల్లీలోని భారత్ మండపంలో ప్రధాని మోడీ-రష్యా అధ్యక్షుడు పుతిన్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పుతిన్‌కు రష్యన్ భాషలో ఉన్న భగవద్గీతను మోడీ బహుమతిగా ఇచ్చారు. వేదికపై ఇద్దరూ కరచాలనం చేసుకుని అనంతరం ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు.

అనంతరం రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిగాయి. ఇటీవల బిష్కెక్లో జరిగిన షాంఘై సహకార సంస్థ సదస్సు సందర్భంగా ప్రధాని మోడీతో పుతిన్ భేటీ అయ్యారు. కొద్ది రోజుల్లోనే ఇద్దరి మధ్య సమావేశం జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. మోడీ-పుతిన్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన సహకారాన్ని విస్తరించేందుకు ముఖ్యమైన విషయాలపై చర్చించినట్లు తెలుస్తోంది.

పుతిన్ చివరిసారిగా 2025 డిసెంబర్లో జరిగిన భారత్-రష్యా శిఖరాగ్ర సమావేశం కోసం భారతదేశాన్ని సందర్శించారు. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌తో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రష్యా వెలుపల బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో పుతిన్ స్వయంగా పాల్గొనడం ఇదే మొదటిసారి. పుతిన్‌తో పాటు రష్యా బృందం తరలివచ్చింది.




