మాంచెస్టర్ యునైటెడ్ మాజీ మసాజర్ రోడ్ థోర్న్‌లీ సేకరించిన ప్రముఖ ఫుట్‌బాల్ ఆటగాళ్ల జెర్సీలకు సంబంధించిన వేలం పాటలో లియోనెల్ మెస్సీ జెర్సీ సరికొత్త రికార్డు సృష్టించింది. ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో జరిగిన ఈ వేలంలో క్రిస్టియానో రొనాల్డో జెర్సీ కంటే మెస్సీ జెర్సీ ఆరు రెట్లు ఎక్కువ ధరకు అమ్ముడై అందరినీ ఆశ్చర్యపరిచింది. బార్సిలోనా జట్టులో ఉన్నప్పుడు మెస్సీ ధరించిన ఈ ప్రత్యేకమైన జెర్సీ రూ. 56.4 లక్షలు (66,107 అమెరికన్ డాలర్లు) పలకగా, రొనాల్డోకు చెందిన రియల్ మాడ్రిడ్ జెర్సీ రూ. 9.05 లక్షలకు (10,601 డాలర్లు) మాత్రమే అమ్ముడయ్యాయి.
మెస్సీ జెర్సీకి ఇంత భారీ ధర రావడానికి దాని వెనుక ఉన్న ఒక ఆసక్తికరమైన కథే ప్రధాన కారణం. 2012లో బార్సిలోనా జట్టు ఓల్డ్ ట్రాఫోర్డ్ పర్యటనకు రాకముందే, థోర్న్‌లీ తన స్నేహితుడైన బార్సిలోనా డిఫెండర్ గెరార్డ్ పికెకు సందేశం పంపి మెస్సీ జెర్సీ కావాలని కోరారు. మ్యాచ్ ముగిసిన వెంటనే పికె స్వయంగా థోర్న్‌లీని బార్సిలోనా డ్రెస్సింగ్ రూమ్‌కు తీసుకెళ్లారు. ఆ సమయంలో మెస్సీ తాను తొడుక్కున్న జెర్సీని తీసి, దానిపై స్వయంగా సంతకం చేసి థోర్న్‌లీకి అందించారు. మెస్సీ ప్రత్యక్షంగా ధరించిన జెర్సీ కావడంతో పాటు ఆయన సంతకం కూడా ఉండటంతో దీనికి భారీ వేలం ధర లభించింది.
𝙏𝙝𝙚 𝙂𝙊𝘼𝙏𝙨
A match-worn Messi #10 from his 91-goal year, and a Ronaldo Real Madrid shirt signed with a personal message to Rod.
This is the kind of access you get when you’re in the locker room – and masseur Rod Thornley was in Manchester United’s for almost 20… pic.twitter.com/8Ivax1lZJP
— MatchWornShirt (@MatchWornShirt) August 12, 2026
మరోవైపు రొనాల్డో జెర్సీ 2014-15 సీజన్‌కు చెందిన రియల్ మాడ్రిడ్ మ్యాచ్ కోసం సిద్ధం చేసినది అయినప్పటికీ, దానిని ఆయన మ్యాచ్‌లో ధరించలేదు. కేవలం థోర్న్‌లీ కోసం ఒక సందేశంతో సంతకం చేసి ఇవ్వడం వల్ల దీనికి తక్కువ ధర లభించింది. ఈ వేలంలో మాంచెస్టర్ యునైటెడ్ దిగ్గజాల జెర్సీలు కూడా బాగానే ధర పలికాయి. 2002 ఛాంపియన్స్ లీగ్ మ్యాచ్‌కు చెందిన ర్యాన్ గిగ్స్ జెర్సీ రూ. 8.62 లక్షలకు, పాల్ స్కోల్స్ జెర్సీ రూ. 3.91 లక్షలకు, డేవిడ్ బెక్‌హామ్ జెర్సీ రూ. 3.32 లక్షలకు అమ్ముడయ్యాయి. అలాగే నిక్కీ బట్ జెర్సీ రూ. 2.32 లక్షలు, గ్యారీ నెవిల్లే జెర్సీ రూ. 1.50 లక్షల చొప్పున ధర పలికాయి. ఏది ఏమైనా మెస్సీ క్రేజ్ ముందు మిగిలిన దిగ్గజాల జెర్సీల ధరలు వెలవెలబోయాయి.





