KTR : ఎన్నికలకు ముందు ప్రజలకు అనేక ఆశలు చూపి, అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే అన్ని హామీలను నెరవేరుస్తామని చెప్పి ఇప్పుడు ఆ మాటలను రేవంత్ ప్రభుత్వం విస్మరించిందని కేటీఆర్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి తీరును విమర్శిస్తూ.. ఎన్నికల ముందు “దానవీరశూరకర్ణ”లా గొప్పలు చెప్పిన రేవంత్ రెడ్డి, గెలిచిన తర్వాత మాత్రం “కుంభకర్ణుడు”లా నిద్రపోతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో జేమ్స్ బాండ్ తరహాలో బాండ్ పేపర్లపై సంతకాలు చేసి మరీ హామీలు ఇచ్చారని కేటీఆర్ గుర్తు చేశారు. ఇప్పుడు ఆ హామీలు అమలు కాకపోవడంతో, ఆనాడు ఇచ్చిన కార్డులను ప్రజలు ఎక్కడ దాచుకోవాలని ఆయన ప్రశ్నించారు.
కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ముందు కమల్ హాసన్‌ను మించిన నటన ప్రదర్శించారని, తీరా అధికారంలోకి వచ్చాక ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని సెటైర్లు వేశారు. ఆశా వర్కర్లకు నెలకు ₹18,000 ఇస్తామని చెప్పి ఆశ చూపి, ఇప్పుడు వారిని గాలికొదిలేశారని కేటీఆర్ ఆరోపించారు. అలాగే, హామీల అమలుపై ముఖ్యమంత్రి స్పందిస్తూ.. “మూడు నెలల్లో పిల్లలు పుడతారా?” అని చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. 90 రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పినప్పుడు ఈ విషయం గుర్తులేదా అని ముఖ్యమంత్రిని నిలదీశారు. మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పిందని, హామీల అమలులో రేవంత్ రెడ్డి వైఫల్యం చెందారని కేటీఆర్ విమర్శించారు.




