Kalvakuntla Kavitha New Party: కల్వకుంట్ల కవిత ఇటీవల కొత్త పార్టీని ప్రారంభించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ పార్టీకి ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. ఈ మేరకు కవిత సోషల్ మీడియా ప్లాట్‌పామ్‌లో ఓ ప్రకటన విడుదల చేసింది. “తెలంగాణ రక్షణ సేన (TRS)కు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపిందని సమస్త తెలంగాణ సమాజానికి తెలియ చేయడానికి సంతోషిస్తున్నాము. రెండు దశాబ్దాలుగా తెలంగాణ సాంస్కృతిక పరిరక్షణ, పునరుజ్జీవం కోసం నేను చేసిన కృషిని కొనసాగిస్తూ, ఇక ముందు కూడా తెలంగాణ అస్తిత్వ పరిరక్షణే ధ్యేయంగా అంకితభావంతో పని చేస్తానని తెలియజేస్తున్నాను. జనవరి 2026 లో జాతీయ ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా ఐదు పేర్లతో దరఖాస్తు చేసుకున్నాం. అందులో మూడవ ప్రాధాన్యత గా మేము ఇచ్చిన పేరును ఈసీ ఆమోదించడం కేవలం యాదృచ్ఛికం. TRS నాకు రాసిపెట్టుందేమో!!” అంటూ కవిత ఓ పోస్ట్‌లో పేర్కొన్నారు.
ఇక పార్టీ పేరు అంశంపై గతంలోనే కవిత కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. తెలంగాణ ప్రజా జాగృతి, తెలంగాణ జాగృతి, తెలంగాణ రక్షణ సేన, తెలంగాణ రాష్ట్ర జాగృతి, తెలంగాణ ప్రజాశక్తి అనే పేర్లను ఎన్నికల సంఘానికి పంపారు. ఈ పేర్లలో ఒక పేరుతో రాజకీయ పార్టీ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. అప్లికేషన్‌లో మూడో పేరుగా పెట్టిన తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్)కు తాజాగా ఈసీ ఆమోదం తెలిపింది.




