Hanamkonda: హన్మకొండ జిల్లాలో పోలీస్ వ్యవస్థ పరువు తీసేలా ఓ కామ పిశాచి ఉదంతం వెలుగులోకి వచ్చింది. న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన ఓ అభాగ్యురాలిపై కన్నేసిన ఓ ఎస్ఐ.. ఆమెపై నాలుగేళ్లుగా లైంగిక దాడికి పాల్పడిన ఘోర ఘటన వరంగల్ కమిషనరేట్ పరిధిలో తీవ్ర కలకలం రేపింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. సదరు మహిళ తన వ్యక్తిగత సమస్యలతో హనుమకొండ పోలీస్ స్టేషన్‌కు వచ్చిన తరుణంలో అక్కడ ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న గోదారి రాజ్‌కుమార్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. భర్తతో విడిపోయేందుకు చట్టపరంగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తానంటూ ఆ ఎస్సై ఆమెకు నమ్మబలికాడు. ఆ మాయమాటలతో సదరు మహిళను లొంగదీసుకున్నాడు. అనంతరం ఆమె బలహీనతను ఆసరాగా చేసుకుని బ్లాక్‌మెయిల్‌కు దిగాడు. గత నాలుగేళ్లుగా ఎల్కతుర్తి, హనుమకొండ పరిధిలో ఆ మహిళపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు.
ఈ నరకయాతన భరించలేకపోయిన బాధితురాలు చివరకు ధైర్యం చేసి నేరుగా రాష్ట్ర డీజీపీ (DGP) కి ఫిర్యాదు చేసింది. న్యాయం కాపాడాల్సిన అధికారి తనను ఎలా మోసం చేశాడో ఉన్నతాధికారులకు వివరించింది. ఈ ఫిర్యాదుపై తీవ్రంగా స్పందించిన పోలీస్ కమిషనర్ (CP) ఆదేశాల మేరకు.. ప్రస్తుతం సీసీఎస్ (CCS) లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న గోదారి రాజ్‌కుమార్‌పై కేసు నమోదు చేశారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించడమే కాకుండా, బాధ్యతయుతమైన పదవిలో ఉండి మహిళను వేధించిన సదరు ఎస్సై తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.




