తూర్పుగోదావరి జిల్లాలో స్కూల్, కాలేజీ బస్సులపై రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు చేపట్టింది. రవాణా శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 108 బస్సులను అధికారులు పరిశీలించారు. ఈ తనిఖీలలో భద్రతా ప్రమాణాలు, పత్రాల సక్రమత వంటి అంశాలను సమగ్రంగా పరిశీలిస్తున్నారు. తనిఖీల సందర్భంగా లోపాలు గుర్తించిన వాహనాలకు నోటీసులు జారీ చేసిన అధికారులు.. ఫిట్‌నెస్ లేని బస్సులను తక్షణమే మరమ్మతులు చేయించాలని ఆదేశించారు.
ఈ నెల 15లోపు సంబంధిత వాహనాలను తిరిగి ఇన్‌స్పెక్షన్‌కు హాజరుచేసి.. ATS సెంటర్‌లో ఫిట్‌నెస్ సర్టిఫికేట్ పొందడం తప్పనిసరి అని అధికారులు స్పష్టం చేశారు. జిల్లాలో మొత్తం 1705 స్కూల్ బస్సులు ఉండగా.. వాటిలో 1318 బస్సులకు మాత్రమే ఫిట్‌నెస్ సర్టిఫికేట్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మిగిలిన 387 బస్సులు ఫిట్‌నెస్ లేనివిగా గుర్తించారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా అన్ని స్కూల్, కాలేజీ యాజమాన్యాలు బాధ్యతగా వ్యవహరించాలని జిల్లా రవాణా అధికారి ఆర్. సురేష్ సూచించారు. రవాణా శాఖకు పూర్తి సహకారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.




