మీ దగ్గర స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం డెబిట్ కార్డు ఉండి, దాన్ని తరచుగా ఉపయోగించకపోయినా ఛార్జీలు పడే అవకాశం ఉంది. చాలా మంది కార్డును వాడకపోతే ఎలాంటి ఫీజులు ఉండవని భావిస్తుంటారు, కానీ ఇది సరికాదు. ఎస్బీఐ నిబంధనల ప్రకారం డెబిట్ కార్డు తీసుకున్న రెండో సంవత్సరం ప్రారంభం నుంచి వార్షిక మెయింటెన్స్ ఛార్జీలు వర్తిస్తాయి.
ఈ ఛార్జీ ఎంత ఉంటుందనేది మీ కార్డు రకం, వేరియంట్‌పై ఆధారపడి ఉంటుంది. క్లాసిక్, సిల్వర్, గ్లోబల్ వంటి సాధారణ కార్డులకు ఏటా రూ. 200 నుంచి రూ. 250 వరకు జీఎస్టీతో కలిపి ఛార్జీ వసూలు చేస్తారు. అదే ప్లాటినమ్, గ్లోబల్ గోల్డ్, మాస్టర్‌కార్డ్ వరల్డ్ లేదా వీసా ఇన్ఫినిట్ వంటి ప్రీమియం వేరియంట్లైతే ఈ ఫీజు రూ. 300 నుంచి రూ. 800 లేదా అంతకంటే ఎక్కువగా ఉంటుంది.
కేవలం మెయింటెనెన్స్ ఛార్జీలే కాకుండా, కార్డు రీప్లేస్మెంట్ చేసుకోవాలన్నా, విదేశాల్లో లావాదేవీలు నిర్వహించినా, ఏటీఎంలో కేవలం బ్యాలెన్స్ చెక్ చేసుకున్నా కూడా అదనంగా జీఎస్టీతో కూడిన ఛార్జీలు కట్ అవుతాయి.
ఉదాహరణకు అంతర్జాతీయ ఏటీఎంలలో క్యాష్ విత్‌డ్రా చేస్తే కనీస రుసుముతో పాటు లావాదేవీ మొత్తంలో నిర్దిష్ట శాతం ఛార్జీ కింద మినహాయించుకుంటారు. ఎన్జ్-పే, ట్రావెల్ కార్డ్స్‌కు కూడా ప్రత్యేకమైన జారీ, రీలోడింగ్ ఛార్జీలు ఉంటాయి. కాబట్టి ఎస్బీఐ కస్టమర్లు తమ దగ్గర ఏ రకమైన డెబిట్ కార్డు ఉందనేది పరిశీలించుకోవడం చాలా ముఖ్యం. కార్డును రెగ్యులర్‌గా వాడకపోయినా ఖాతా నుంచి ఈ ఛార్జీలు ఆటోమేటిక్‌గా కట్ అయ్యే అవకాశం ఉంది.




