IPL Value: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ప్రపంచ క్రీడా రంగంలో మరో అరుదైన ఘనతను సాధించింది. గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ హౌలిహాన్ లోకీ (Houlihan Lokey) విడుదల చేసిన 2026 IPL Brand Valuation Study ప్రకారం.. ఐపీఎల్ మొత్తం వ్యాపార విలువ (Business Enterprise Value) తొలిసారిగా 20.6 బిలియన్ డాలర్లు (సుమారు రూ.1.97 లక్షల కోట్లు) దాటింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 11.4% వృద్ధి. అలాగే లీగ్ స్టాండ్ అలోన్ బ్రాండ్ విలువ 4.3 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.41,106 కోట్లు) చేరి 10.3% పెరిగింది.
అగ్రస్థానంలో RCB:
ఈ నివేదికలో ఐపీఎల్ ఫ్రాంచైజీల బ్రాండ్ విలువలు వెల్లడయ్యాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) 312 మిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో వరుసగా అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. 300 మిలియన్ డాలర్ల మార్క్‌ను దాటిన తొలి ఐపీఎల్ జట్టుగా RCB చరిత్ర సృష్టించింది. ఇటీవల బ్లాక్‌స్టోన్, బోల్ట్ వెంచర్స్, ఆదిత్య బిర్లా గ్రూప్, టైమ్స్ గ్రూప్ కన్సార్టియం RCBను 1.78 బిలియన్ డాలర్ల విలువతో కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
KKR దూకుడు:
2026 సీజన్‌లో పేలవ ప్రదర్శన చేసినప్పటికీ ఐదు టైటిళ్లు, బలమైన వాణిజ్య భాగస్వామ్యాల కారణంగా ముంబై ఇండియన్స్ 264 మిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో రెండో స్థానంలో బ్రాండ్ విలువను నిలబెట్టుకుంది. ఆ తర్వాత కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) 245 మిలియన్ డాలర్ల విలువతో మూడో స్థానానికి ఎగబాకి, చెన్నై సూపర్ కింగ్స్ (CSK)ను వెనక్కి నెట్టింది. CSK బ్రాండ్ విలువ 244 మిలియన్ డాలర్లుగా నమోదైంది. వరుసగా రెండో సీజన్‌లో ఆశించిన స్థాయిలో రాణించకపోవడం, ఎంఎస్ ధోనీ మైదానంలో పాత్ర తగ్గడం వాణిజ్య ప్రభావంపై ప్రభావం చూపినట్లు నివేదిక పేర్కొంది.
జట్ల ర్యాంకింగ్స్:
మిగతా జట్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ 168 మిలియన్ డాలర్లతో ఐదో స్థానం, రాజస్థాన్ రాయల్స్ 161 మిలియన్ డాలర్లతో ఆరో స్థానం, పంజాబ్ కింగ్స్ 158 మిలియన్ డాలర్లతో ఏడో స్థానం, గుజరాత్ టైటాన్స్ 157 మిలియన్ డాలర్లతో ఎనిమిదో స్థానం దక్కించుకున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ 156 మిలియన్ డాలర్లతో తొమ్మిదో స్థానంలో ఉండగా.. లక్నో సూపర్ జెయింట్స్ 122 మిలియన్ డాలర్లతో చివరి స్థానంలో నిలిచింది.
డిజిటల్ వ్యూయర్‌షిప్:
2026 సీజన్‌లో డిజిటల్ వ్యూయర్‌షిప్ కూడా రికార్డులు సృష్టించింది. మొత్తం 1.06 బిలియన్ స్క్రీన్లకు ఐపీఎల్ చేరుకోగా, గత ఏడాదితో పోలిస్తే వీక్షకుల సంఖ్య 7% పెరిగింది. ముఖ్యంగా Connected TV వీక్షణ 26% పెరగడం, సంప్రదాయ టెలివిజన్ వీక్షణ తగ్గడం డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ఆధిపత్యాన్ని స్పష్టం చేసింది. దీంతో ప్రపంచంలో అత్యంత విలువైన స్పోర్ట్స్ లీగ్‌లలో ఐపీఎల్ తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంది.




