Sports Quota DSC Scam: ఆంధ్రప్రదేశ్లో నిర్వహించిన డీఎస్సీ నియామకాలలో స్పోర్ట్స్ కోటా పేరుతో భారీ అవకతవకలు జరిగాయని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆరోపించారు. ఈ వ్యవహారం సాధారణ అక్రమం కాదని, దీనిపై పూర్తి స్థాయి సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రతిభ, అర్హత ఉన్న క్రీడాకారులకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో స్వర్ణ పతకం సాధించిన దుర్గయ్య అనే క్రీడాకారుడికి ఉద్యోగం ఇవ్వకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. అనేక క్రీడా విజయాలు సాధించిన వ్యక్తిని పక్కనపెట్టి, ఇతరులకు ఉద్యోగాలు ఇవ్వడం వెనుక కారణాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. నిజంగా ప్రతిభ ఉన్న క్రీడాకారులు నష్టపోయారని జగన్ ఆరోపించారు.
స్పోర్ట్స్ కోటా నియామకాల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 4, జీవో నంబర్ 47ల ద్వారా అక్రమాలకు మార్గం సుగమం చేశారని వైఎస్ జగన్ విమర్శించారు. గతంలో స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు కూడా డీఎస్సీ పరీక్షలో అర్హత సాధించాల్సి ఉండేదని, కానీ ఆ నిబంధనలను తొలగించి కొత్త జీవోలను తీసుకువచ్చారని అన్నారు. స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్ను 2 శాతం నుంచి 3 శాతానికి పెంచడంతో పాటు కొన్ని పోస్టులకు రాత పరీక్ష అవసరం లేకుండా చేశారని ఆరోపించారు. కొన్ని ఉద్యోగాలకు డిగ్రీ అర్హత కూడా లేకపోయినా, ఐదేళ్లలో డిగ్రీ పూర్తి చేస్తే సరిపోతుందని నిబంధనలు పెట్టారని మాజీ సీఎం జగన్ పేర్కొన్నారు.
క్రీడల్లో పాల్గొన్నట్లు సర్టిఫికెట్లు ఉంటే చాలు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చారని వైఎస్ జగన్ ఆరోపించారు. ఇంటర్ కాలేజీ, యూనివర్సిటీ లేదా జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొన్న వారికి కూడా ఉద్యోగాలు ఇచ్చారన్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, సర్టిఫికెట్లు ఇచ్చే సంస్థలు, వాటిని ధృవీకరించే వ్యవస్థలు, ఉద్యోగాలు కల్పించే ప్రక్రియ అన్నీ ఒకే వర్గానికి అనుకూలంగా పనిచేశాయని విమర్శించారు. ఈ వ్యవహారంలో సాఫ్ట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు కూన రవికుమార్, జూడో అసోసియేషన్ అధ్యక్షుడు, విశాఖ ఎంపీ భరత్ పేర్లను జగన్ ప్రస్తావించారు. జాతీయ స్థాయిలో స్వర్ణ పతకం సాధించిన క్రీడాకారుడికి ఉద్యోగం రాకపోగా, ఇతరులకు అవకాశాలు కల్పించారని ఆయన ఆరోపించారు.
పార్టిసిపేషన్ సర్టిఫికెట్ల ఆధారంగా 270 మందికి టీచర్ ఉద్యోగాలు ఇచ్చారని వైఎస్ జగన్ పేర్కొన్నారు. వీరిలో చాలామంది పెద్ద టోర్నమెంట్లలో పాల్గొనలేదని ఆరోపించారు. కొన్ని విశ్వవిద్యాలయాల్లో కూడా తమకు అనుకూలమైన వారినే కీలక పదవుల్లో నియమించి, అక్కడి నుంచి సర్టిఫికెట్లు పొందేలా వ్యవస్థను ఉపయోగించుకున్నారని విమర్శించారు. స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల కోసం ఒక్కో పోస్టుకు రూ.15 లక్షల వరకు బేరసారాలు జరిగాయని ఆరోపించిన జగన్.. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చినా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదన్నారు. ఏపీ ప్రభుత్వ లోగోను డీపీగా పెట్టుకుని ఉద్యోగాల పేరుతో డీల్స్ జరిగాయని అన్నారు. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత కేవలం నామమాత్రపు కేసు నమోదు చేసి, సంబంధిత వ్యక్తులకు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారని ఆరోపించారు. వీడియో కాల్లు, ఫోన్ నంబర్లు స్పష్టంగా ఉన్నప్పటికీ.. ఎఫ్ఐఆర్లో వాటి వివరాలు పొందుపరచలేదని విమర్శించారు.
డీఎస్సీ, స్పోర్ట్స్ కోటా నియామకాలపై తమ వద్ద పలు ఆధారాలు ఉన్నాయని వైఎస్ జగన్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే విచారణపై నమ్మకం లేదని, విద్యాశాఖ మంత్రి లోకేష్ పదవిలో ఉన్నందున స్వతంత్ర దర్యాప్తు అవసరమని అన్నారు. అందుకే సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ అభ్యర్థులకు న్యాయపోరాటంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చిన జగన్.. తాము మళ్లీ అధికారంలోకి వస్తే ఈ అంశంపై ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రభుత్వ హామీలు అమలు కాలేదని, డీఎస్సీ అవకతవకలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా నిరసన ర్యాలీలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు జగన్ పిలుపునిచ్చారు. దగా పడ్డ ప్రతి వర్గాన్ని కలుపుకుని ఉద్యమాన్ని మరింత బలంగా కొనసాగిస్తామని స్పష్టం చేశారు. తాము లేవనెత్తిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పకుండా ఎదురుదాడికి దిగుతోందని ఆరోపించిన జగన్.. డీఎస్సీ, స్పోర్ట్స్ కోటా నియామకాలపై పూర్తి నిజాలు వెలుగులోకి రావాల్సిన అవసరం ఉందన్నారు.




