ఏపీ డీఎస్సీ 2025 నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. డీఎస్సీ పరీక్ష రాయకుండానే స్పోర్ట్స్ కోటాలో 372 మందికి ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం జారీ చేసిన జీవోలు, అనంతరం తీసుకున్న నిర్ణయాలపై అనేక అనుమానాలు ఉన్నాయని పేర్కొంటూ.. మొత్తం వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా జీవోలు జారీ చేసిందని, పరీక్ష రాయాల్సిన అవసరం లేదని ప్రభుత్వం అసెంబ్లీలో చెప్పిందన్నారు. పీవీ సింధు వంటి క్రీడాకారులకు గతంలో అనుసరించిన విధానాన్నే ఇక్కడ కూడా అమలు చేశామని ప్రభుత్వం చెబుతోందని జగన్ విమర్శించారు.
‘పీవీ సింధు వంటి క్రీడాకారులకు గతంలో అనుసరించిన విధానాన్నే ఇక్కడ కూడా అమలు చేశామని ప్రభుత్వం చెబుతోంది. సింధు ప్రత్యేకమైన క్రీడాకారిణి. ఒలింపిక్స్లో పతకాలు సాధించి దేశానికి పేరు తీసుకొచ్చిన ఆమెను డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందిన 372 మందితో పోల్చడం సరికాదు. స్పోర్ట్స్ కోటా పేరుతో జీవో నంబర్ 4, 47 తీసుకొచ్చి తమకు కావాల్సిన వారికి టీచర్ ఉద్యోగాలు ఇచ్చేందుకు మార్గం సుగమం చేశారు. ఆ తర్వాత జీవో నంబర్ 23, 56 ద్వారా నిబంధనల్లో మార్పులు చేసి.. ముందుగా పరీక్షతో సంబంధం లేదని చెప్పి, అనంతరం పరీక్ష రాసి అర్హత సాధించాలనే నిబంధనలు తీసుకొచ్చారు. ఇలా నిబంధనలను మార్చడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటో తేలాల్సిన అవసరం ఉంది’ అని వైఎస్ జగన్ అన్నారు.
‘జాతీయ స్థాయిలో ఆర్చరీలో గోల్డ్ మెడల్ సాధించిన దుర్గయ్యకు కాల్ లెటర్ పంపినప్పటికీ ఉద్యోగం ఇవ్వలేదు. సాఫ్ట్బాల్, జూడో అసోసియేషన్లు ఇచ్చిన పార్టిసిపేషన్ సర్టిఫికెట్ల ఆధారంగా కొందరికి ఉద్యోగాలు ఇచ్చారు. ఇంటర్ కాలేజీ స్థాయి పార్టిసిపేషన్ సర్టిఫికెట్లతోనే ఉద్యోగాలు ఇచ్చినట్లు చెబుతున్నారు. డీఎస్సీ చరిత్రలో పరీక్ష రాయకుండానే ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు ఇవ్వడం ఇదే తొలిసారి. ఈ వ్యవహారంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. మంత్రి పదవికి రాజీనామా చేయాలి. డీఎస్సీ నియామకాల్లో లీకేజీ నుంచి స్పోర్ట్స్ కోటా వరకు అనేక అంశాలపై అనుమానాలు ఉన్నందున సమగ్ర దర్యాప్తు అవసరం. ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలా? లేదా? అనే విషయాన్ని ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలి’ అని జగన్ డిమాండ్ చేశారు.
‘డీఎస్సీ పోస్టుల విషయంలో బేరసారాలకు సంబంధించిన ఆడియోలు, వీడియోలు బయటకు వచ్చినట్లు ప్రభుత్వం కూడా అంగీకరించింది. వీడియోలో కనిపించిన వ్యక్తి ఫోన్ నంబర్ కూడా అందుబాటులో ఉన్నప్పటికీ, కేసు దర్యాప్తు తీరు అనుమానాస్పదంగా ఉంది. ఎఫ్ఐఆర్లో నిందితుడిని కేవలం అనుమానితుడిగా పేర్కొని స్టేషన్ బెయిల్పై పంపించారు. సీసీటీఎన్ఎస్ రికార్డుల్లోనూ నిందితుడి పేరు నమోదు చేయలేదు. ఈ కేసును ఎందుకు నీరుగార్చారో ప్రభుత్వం స్పష్టం చేయాలి. ఒంగోలులోనూ డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం ఇప్పిస్తామని మోసం చేశారు. ఉద్యోగం కోసం రూ.14 లక్షలకు పైగా చెల్లించినట్లు బ్యాంక్ స్టేట్మెంట్లు ఉన్నాయి. ఎవరికి డబ్బులు ఇచ్చారనే వివరాలు కూడా ఉన్నాయి. అయితే ఎఫ్ఐఆర్లో డీఎస్సీ ఉద్యోగాల కోసం బేరసారాలు జరిగినట్లు కాకుండా ఏపీ టూరిజం అంశంగా పేర్కొన్నారు. గత ఏడాది నవంబర్లో కేసు నమోదైనా ఇప్పటివరకు అరెస్టులు ఎందుకు జరగలేదు’ అని మాజీ సీఎం జగన్ ప్రశ్నించారు.
ఏపీపీఎస్సీ గ్రూప్-1 నియామకాలపై ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలపైనా జగన్ స్పందించారు. 2018లో చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం మెయిన్స్ పరీక్షను నిర్వహించామని చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలో పేపర్ లీకేజీ జరగలేదని, ఔట్సోర్సింగ్ ఉద్యోగికి ర్యాంకులు రాలేదని, పరీక్షలు రాయకుండానే ఎవరికీ ఉద్యోగాలు ఇవ్వలేదని జగన్ స్పష్టం చేశారు. కోవిడ్ పరిస్థితుల కారణంగానే అప్పటి ఏపీపీఎస్సీ డిజిటల్ అవాల్యుయేషన్ విధానాన్ని పరిశీలించిందని వివరించారు. అభ్యర్థుల ఆన్సర్ షీట్లను స్కాన్ చేసి మూల్యాంకనం చేసేందుకు పంపించే విధానాన్ని అనుసరించాలని భావించినప్పటికీ, హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో చివరకు మాన్యువల్ అవాల్యుయేషన్ చేపట్టినట్లు తెలిపారు. ఈ ప్రక్రియలో ప్రతి దశ కూడా కోర్టు ఆదేశాలకు అనుగుణంగానే జరిగిందని జగన్ పేర్కొన్నారు. గ్రూప్-1 మూల్యాంకనంపై వచ్చిన ఆరోపణలను కూడా ఆయన ఖండించారు. నాలుగేళ్లుగా 165 మంది ఉద్యోగాలు చేస్తున్నారని, మాన్యువల్ అవాల్యుయేషన్లో ఎలాంటి తప్పులు జరగలేదని 2025 నవంబర్లో చంద్రబాబు ప్రభుత్వమే స్పష్టం చేసిందన్నారు. మొత్తం ప్రక్రియ సీసీటీవీ పర్యవేక్షణలో జరిగిందని తేల్చిన తర్వాత కూడా గ్రూప్-1 అంశాన్ని రాజకీయంగా తెరపైకి తీసుకురావడం సరికాదని జగన్ విమర్శించారు.




