West Bengal: బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం పదవికి రాజీనామా చేయనని భీష్మించుకు కూర్చున్న మమతా బెనర్జీకి గవర్నర్ ఆర్ ఎన్ రవి షాక్ ఇచ్చారు. మమతా బెనర్జీ రాజనీమా చేయకపోవడంతో బెంగాల్ టీఎంసీ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేశారు. బెంగాల్ అసెంబ్లీని రద్దు చేశారు. గవర్నర్ మొత్తం మంత్రివర్గాన్ని రద్దు చేశారు. దీంతో మమతా బెనర్జీ ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగినట్లైంది. రాజ్యాంగం ప్రకారం గవర్నర్ తన విచక్షణాధికారాలను ఉపయోగించారు. ఈ రోజు( మే 7) అర్ధరాత్రితో బెంగాల్ అసెంబ్లీ 5 ఏళ్ల కాలపరిమితి ముగుస్తోంది. మరోవైపు ఓడిపోయినా మమతా బెనర్జీ సీఎం పదవికి రాజీనామా చేయలేదు. ఈ నేపథ్యంలో గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ నిర్ణయంతో మమతా 15 ఏళ్ల పాలనకు తెరపడింది.
Read Also: Tamil Nadu: జంపింగ్ భయం.. పుదుచ్చేరికి అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు తరలింపు
మే 8న బీజేపీ శాననసభా పక్ష నేతను ఎన్నుకోనుంది. మే 9న బెంగాల్‌లో తొలిసారిగా బీజేపీ ప్రభుత్వం కొలువుదీరనుంది. ఇటీవల 294 అసెంబ్లీ నియోజకవర్గాలు జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 207 స్థానాలను కైవసం చేసుకుంది. టీఎంసీ కేవలం 80 సీట్లకు పరిమితమై ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. సీఎం మమతా భవానీపూర్ నియోజకవర్గంలో బీజేపీ నేత సువేందు అధికారి చేతిలో పరాజయం పాలైంది.
ఈ ఓటమి తర్వాత మమతా మాట్లాడుతూ.. బీజేపీ గెలుపును దొంగిలించిందని, వారి గెలుపు అనైతికమని ఆరోపించింది. కేంద్ర బలగాలు, ఈసీ సాయంతో బీజేపీ బెంగాల్‌లో గెలిచిందని దుయ్యబట్టారు. దీని కారణంగా తాను రాజీనామా చేయబోనని తేల్చి చెప్పారు. మరోవైపు, 100 అసెంబ్లీ స్థానాల్లో ఫలితాలను దొంగిలించినట్లు బీజేపీపై ఆరోపణలు గుప్పించారు.




