నాచురల్ స్టార్ నాని హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘ది ప్యారడైజ్’. చెన్నైలో జరిగిన ప్రెస్ మీట్లో నాని ఈ సినిమాకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సెన్సార్ పనులు ఇంకా పూర్తి కాలేదని చెప్పుకొచ్చాడు. అయితే సినిమాలోని బోల్డ్ కంటెంట్, రా అండ్ రస్టిక్ అప్రోచ్ కారణంగా దీనికి ‘ఏ’ (A) సర్టిఫికేట్ వచ్చే అవకాశం ఉందన్నాడు. ఈ రకమైన సర్టిఫికేట్ వల్ల హింసను ఇష్టపడని ప్రేక్షకులను కోల్పోతామన్నారు.
అయినప్పటికీ.. ఒక నటుడిగా ప్రతీ జోనర్‌ను అందరికోసం మాత్రమే కాకుండా, అన్ని రకాల ప్రయోగాత్మక జోనర్లను అన్వేషించాల్సిన బాధ్యత తమపై ఉంటుందని స్పష్టం చేశారు. ఈ చిత్రంలో నాని చేసే పాత్ర చాలా తీవ్రంగా ఉంటుందని, కథ డిమాండ్ చేసే హై పర్ఫార్మెన్స్ కేవలం ఈ తరహా జోనర్‌లోనే సాధ్యపడుతుందని తెలిపారు. అయితే ఈ చిత్రంలో ‘హిట్ 3’ తరహాలో భయంకరమైన హింసకు తావు లేకుండా, సాధారణ కమర్షియల్ చిత్రాల లాగా ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు.
ఈ సినిమాకు సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సంగీతం అందిస్తుండటం విశేషం. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, సాంగ్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచగా, అనిరుధ్ అందించే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్తుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రం సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.




