తమిళనాడులో అధికార పార్టీ డీఎంకే.. జయలలిత రికార్డును సమం చేయాలని చూస్తోంది. అనుభవం ఉన్న నేత స్టాలిన్.. తన పార్టీ సంస్థాగత బలం, పాలన, పథకాలతో గెలుపు ఉట్టి కొట్టాలని డిసైడయ్యారు. తెర ముందు ప్రచారంతో పాటు తెర వెనుక వ్యూహాల్లోనూ స్టాలిన్‌కు తిరుగులేదని డీఎంకే నేతలు చెబుతున్నారు.
తమిళనాడు రాజకీయ చరిత్రను పరిశీలిస్తే.. 1967 వరకు మద్రాస్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆ రాష్ట్ర రాజకీయాలను శాసించింది. అయితే, 1967 నుంచి ప్రాంతీయ ద్రవిడ పార్టీలు పూర్తిస్థాయిలో పట్టు సాధించి అధికారాన్ని చేపట్టాయి. అప్పటి నుంచి డీఎంకే, అన్నా డీఎంకే పార్టీలు తమిళనాడును ఒకదాని తర్వాత ఒకటి పరిపాలిస్తున్నాయి. 1967 నుంచి 2016 వరకు తమిళనాడు ముఖ్యమంత్రి పదవిని అధిష్టించినవారి పేర్లను చూస్తే.. కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత ఈ ముగ్గురు మాత్రమే ముఖ్యమంత్రులుగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ క్రమక్రమంగా తన ఆధిపత్య స్థానాన్ని కోల్పోయింది.
1967 నుంచి తమిళనాడులో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా.. అది మిత్రపక్షాలతో మంత్రి పదవులను పంచుకోవడం చాలా అరుదు. ఈ పకడ్బందీ వ్యూహం తమిళనాడులో బలమైన మూడో రాజకీయ శక్తిని ఎదగకుండా నిరోధించింది. కేంద్రంలో అధికార బీజేపీ, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీల పరిస్థితి కూడా ద్రవిడ పార్టీల ముంగిట నామమాత్రంగా ఉన్నాయి. కాంగ్రెస్ తన ఓట్ల వాటాను సుమారు 8 శాతం వద్ద కొనసాగిస్తోంది. మరోవైపు బీజేపీ క్రమంగా తన ఉనికిని విస్తరిస్తోంది. తీవ్రమైన పోటీదారుగా మారడానికి సుమారు 15 శాతం ఓట్లను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ, ద్రవిడ పార్టీలను అధిగమించి ప్రధాన రాజకీయ పక్షంగా ఎదగటం అంత తేలిక కాదని ఆ పార్టీకి ఇప్పటికే అనుభవంలోకి వచ్చింది.
దశాబ్దాలుగా రెండు ద్రవిడ పార్టీల ఆధిపత్య పోరాటం చూసిన తమిళనాడు ప్రజలు.. ఈసారి ఎన్నికల్లో త్రిముఖ పోటీని చూస్తున్నారు. తద్వారా తమిళ రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలైనట్టే. విజయ్ టీవీకేను మొదట్లో లైట్ తీస్కున్న డీఎంకే, అన్నాడీఎంకే.. రోజులు గడిచేకొద్దీ.. ఆ పార్టీ ప్రభావాన్ని అర్థం చేసుకున్నాయి. కాకపోతే సీఎం స్టాలిన్ రాజకీయాల్లో తలపండిన నేత కావడంతో.. ఆయన వ్యూహాల ముందు ప్రత్యర్థులు తేలిపోయారని డీఎంకే శ్రేణులు ఊదరగొడుతున్నాయి. పలు చిన్న పార్టీలు బరిలో ఉన్న తమిళనాడులో.. ఎక్కువ పార్టీలను తమ కూటమివైపు ఆకర్షించడంతో స్టాలిన్ చాణక్యం బాగా పనిచేసింది. చివరకు కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యం పార్టీని ఎన్నికల బరి నుంచి తప్పించడంలోనూ స్టాలిన్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఓ దశలో విజయ్ ర్యాలీల్లో మరణాలను హైలైట్ చేస్తూ.. ఆయన్ను స్టాలిన్ బాగానే ఇబ్బందిపెట్టారు.
కేవలం ప్రత్యర్థుల బలహీనతలపైనే ఆధారపడని స్టాలిన్.. తన బలాల్ని కూడా పెంచుకోవటానికి కృషి చేశారు. ఐదేళ్ల పాలన చూసి ఓటేయాలని ఓటర్లను కోరుతూనే.. కొత్తగా మరిన్ని పథకాలు ప్రవేశపెట్టి.. జనాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అన్నింటికీ మించి తమిళనాడు వ్యాప్తంగా డీఎంకేకి ఉన్న సంస్థాగత బలం.. ఆ పార్టీకి శ్రీరామ రక్ష అనడంలో సందేహం లేదు. అభ్యర్థుల ఎంపికలోనూ స్టాలిన్ వ్యూహాత్మకంగానే వ్యవహరించారు. ఎవరికి సీటిస్తే.. గెలుపు అవకాశాలు ఎక్కువో.. వారికే పెద్దపీట వేశారు. కొన్నిచోట్ల ప్రత్యర్థులు నిలబెట్టిన అభ్యర్థుల్ని బట్టి టికెట్లు ఇచ్చారు. మూడు దశాబ్దాల్లో జయలలిత మాత్రమే తమిళనాడులో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన రికార్డు దక్కించుకున్నారు. ఇప్పుడు ఆ రికార్డు సమం చేసే అవకాశం తమకూ వచ్చిందని స్టాలిన్ భావిస్తున్నారు. తన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ అక్కడక్కడ చేసిన ఆవేశపూరిత ప్రసంగాలు వివాదాస్పదమైనా.. స్టాలిన్ వెంటనే నష్టనివారణ చర్యలు చేపట్టారు. హిందూ వ్యతిరేక పార్టీగా తనపై బీజేపీ వేసిన ముద్రను.. కేంద్రం తీరుపై చేసిన ఘాటు విమర్శలతో దీటుగా తిప్పికొట్టామనేది డీఎంకే లెక్క.
కొన్నాళ్ల క్రితం అధికార పార్టీ నేతగా తీవ్ర ప్రతికూలతను ఎదుర్కున్న స్టాలిన్.. ఎన్నికలు దగ్గరపడే సమయానికి మళ్లీ ఫేవరెట్‌గా మారిపోయారనే చర్చ జరుగుతోంది. తమిళనాడు సీఎం స్టాలిన్‌పై ఓ దశలో ప్రతిపక్షాలన్నీ కలిసి ముప్పేట దాడి చేశాయి. దీంతో ఒక్కసారిగా ఆయన ఆత్మరక్షణలో పడ్డారు. కానీ తన అనుభవాన్ని రంగరించిన స్టాలిన్.. ఒక్కొక్కటిగా అడ్డుతెరల్ని తొలగించుకుంటూ.. ప్రతిపక్షాలు అంచనా వేయలేని విధంగా తెరవెనుక మంత్రాంగంతో రాజకీయ సమీకరణాలు మార్చేశారనే అభిప్రాయాలున్నాయి. పోల్ మేనేజ్‌మెంట్‌లోనూ తమకు తిరుగులేదని డీఎంకే భావనగా ఉంది. అన్నాడీఎంకే అనుకున్నంత పుంజుకోలేదని, విజయ్‌కు క్రేజ్ ఉన్నా అనుభవం లేకపోవడం అల్టిమేట్‌గా తమకే కలిసొస్తుందని లెక్కేసుకుంటోంది.
తమిళనాడులో ముస్లిం మైనార్టీ ఓటర్ల జనాభా భారీగానే ఉంది. చాలా నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్లు కీలకంగా ఉన్నారు. ఈ తరుణంలో డీఎంకే కూటమికి మద్దతుగా ఓటు వేయాలని తమిళ ఓటర్లను అసదుద్దీన్ ఓవైసీ కోరడం ప్రాధాన్యం సంతరించుకుంది. బెంగాల్, బీహార్ వంటి రాష్ట్రాల్లో పోటీకి దిగడం ద్వారా సెక్యులర్ పార్టీల ఓట్లను చీల్చి బీజేపీ గెలుపుకు దోహదం చేస్తున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్న ఓవైసీ .. తమిళనాడులో మాత్రం బీజేపీ ప్రత్యర్థిగా ఉన్న డీఎంకే నేతృత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ కు మద్దతుగా నిలిచి ట్విస్ట్ ఇచ్చారు.
తమిళనాడులో డీఎంకేకు బలమైన సైద్ధాంతిక పునాదులున్నాయి. మొదట్నుంచీ బీజేపీతో ఎక్కడా రాజీ పడకపోవడం కూడా ఆ పార్టీకి పెద్ద అడ్వాంటేజ్. కరుణానిధి హయాం నుంచీ ద్రవిడవాదానికి బలంగా కట్టుబడ్డ డీఎంకే.. తమిళ ఆత్మాభిమానం విషయంలోనూ అవసరమైతే పోరుకు ఎప్పుడూ రెడీనే. గతంలో హిందీ వ్యతిరేక ఉద్యమమైనా.. ఇప్పుడు కేంద్రం తీరుపైనా గళమెత్తడం అయినా.. ఎక్కడా డీఎంకే తన ప్రత్యేకతను వదులుకోలేదు. ఈ విషయంలో డీఎంకే తమిళ ప్రజల నమ్మకం చూరగొందనడంలో సందేహం లేదు. తమిళ అస్తిత్వానికి తామే బలమైన ప్రతీక అని డీఎంకే ప్రచారం చేసుకుంటోంది. దీనికి ప్రజల నుంచి కూడా సానుకూల స్పందనే వస్తోందని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఈసారి డీఎంకే వారసత్వం విషయంలో కొంత విభేదాలొచ్చినా.. తర్వాత స్టాలిన్ బుజ్జగింపులతో అవీ సర్దుకున్నాయి. సరైన సమయంలో ఉదయనిధి స్టాలిన్ దూకుడు తగ్గటం కూడా తమకు కలిసొచ్చిందని డీఎంకే నేతలు చెబుతున్నారు.
సరిగ్గా అసెంబ్లీ ఎన్నికల ముందు డీలిమిటేషన్ అంశం తెరపైకి రావడంతో.. దాన్ని స్టాలిన్ బాగా క్యాష్ చేసుకున్నారు. జనాభా ప్రకారం డీలిమిటేషన్ అంటే.. దక్షిణాదికి తీవ్ర నష్టం తప్పదని వాదించిన స్టాలిన్.. దక్షిణాది రాష్ట్రాల సీఎంలతో సమావేశం కూడా నిర్వహించారు. ఈ విషయంలో బీజేపీ మిత్రపక్షంగా ఉన్న అన్నాడీఎంకే పెద్దగా స్పందించకపోవడం.. తమకు కలిసొస్తుందని డీఎంకే భావిస్తోంది. డీఎంకేతో రాజకీయ విరోధం ఉన్న కొన్ని ఇతర పార్టీలు కూడా ఈ విషయంలో మాత్రం స్టాలిన్ స్టాండ్‌కు మద్దతు ఇవ్వక తప్పని స్థితి నెలకొంది. ఈ అనుకూలతను వ్యూహాత్మకంగా ప్రచారంలో వాడుకోవటంలోనూ స్టాలిన్ తన అనుభవాన్ని రంగరించారు. అయితే దక్షిణాదికి అన్యాయం జరగబోదని, స్టాలిన్‌ది తప్పుడు ప్రచారమేనని బీజేపీ చెప్పినా.. అది జనంలోకి వెళ్లలేదని డీఎంకే ధీమా వ్యక్తం చేస్తోంది. మొత్తం మీద ఏం చేసినా దక్షిణాదిలో పుంజుకోవాలన్న బీజేపీ ఆశలపై తాము నీళ్లు చల్లుతామని డీఎంకే నేతలు గట్టిగా చెబుతున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చాక కమలనాథులకు తత్వం బోధపడుతుందని అంటోంది.
తమిళనాడులో ఐదేళ్లకోసారి అధికారం మారే ప్రక్రియకు జయలలిత హయాంలో తొలిసారి తెరదించింది అన్నాడీఎంకే. కానీ ఆమె మరణం తర్వాత సరైన నేత లేక.. ఓటర్లను గతంలో మాదిరిగా ఆకర్షించలేకపోతోంది. పళనిస్వామి ఉధృతంగా ప్రచారం చేస్తున్నా.. ఆయన స్టాలిన్‌కు సరితూగే నేత కాదనే సెటైర్లు పడుతున్నాయి. ఇక అన్నాడీఎంకే కూటమిలో ఉన్న బీజేపీ.. స్టాలిన్‌ను గద్దె దించటానికి వ్యూహరచన చేసినా.. ఎంతవరకు వర్కవుట్ అవుతుందనేది చూడాల్సి ఉంది.
2016లో జయలలిత మరణించిన తర్వాత అన్నాడీఎంకేకి మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి నాయకత్వం వహిస్తున్నారు. 2024 పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ, అన్నాడీఎంకే రెండు పార్టీలు విడివిడిగా పోటీచేసి ఎంపీ సీట్లను కోల్పోయాయి. ఇప్పుడు అన్నాడీఎంకే, బీజేపీ కూటమిగా ఏర్పడ్డాయి. కానీ కూటమి గెలిచేస్తుందని మాత్రంగా గట్టిగా చెప్పలేని స్థితి. ప్రముఖ నటుడు విజయ్ ఆకస్మికంగా తమిళనాట రాజకీయరంగ ప్రవేశం చేయడంతో ప్రతిపక్షాల ఓట్లు చీలతాయని అన్నాడీఎంకే బీజేపీ కూటమి భావిస్తోంది. విజయ్ పార్టీ డీఎంకే వ్యతిరేక కూటమిలో చేరకపోతే స్టాలిన్ గెలుపు ఆపడం సులభం కాదనే అంచనాతో.. టీవీకేకు గాలమేసినా.. ఫలితం దక్కలేదు.
అన్నాడీఎంకేకు ఇప్పటికీ బలమైన ఓటుబ్యాంకు ఉంది. గ్రామీణ తమిళనాడులో ఆ పార్టీకి గట్టి మద్దతుంది. ఇక బీజేపీ కూడా కొత్త ఎన్నికల వ్యూహాలతో కూటమికి పుష్ ఇచ్చే ప్రయత్నాల్లో ఉంది. తమ వ్యూహాలకు అన్నాడీఎంకే క్యాడర్ బలం తోడైతే అధికారం అందుకోవడం కష్టం కాదనే అంచనాతో.. కమలం పార్టీ గట్టి ప్రయత్నమే చేస్తోంది. కానీ ఇప్పటిదాకా బీజేపీ పప్పులుడకనివ్వని తమిళులు ఈసారి ఎన్నికల్లో ఏం చేస్తారనేది చూడాల్సి ఉంది.
తమిళనాడును కేవలం రాజకీయంతో గెలవలేమని, సాంస్కృతిక మూలాల విషయంలోనూ ప్రణాళిక తప్పదని బీజేపీ ఆలస్యంగా గ్రహించింది. అందుకే కాశీ తమిళ సంగం లాంటి కార్యక్రమాలతో పాటు.. స్వయంగా ప్రధాని మోడీ బహిరంగ సభల్లో కుదిరినప్పుడల్లా తమిళ సంస్కృతి, సంప్రదాయాలను ప్రశంసిస్తున్నారు. పనిలోపనిగా డీఎంకే తమిళులకు ద్రోహం చేస్తోందని ఎండగడుతున్నారు. కానీ మిత్రపక్షం అన్నాడీఎంకే అనుకున్నంతగా పుంజుకోకపోవడం.. బీజేపీని నిరాశకు గురిచేస్తోందని చెబుతున్నారు. జయలలిత చనిపోయి పదేళ్లైనా ఇప్పటికీ పళనిస్వామి నేతగా కుదురుకోలేకపోయారు. దీంతో ఇంకా ప్రచారంలో ఆమె ఫోటోలు వాడక తప్పని స్థితి నెలకొంది. ఇది చాలదన్నట్టుగా పార్టీలో కీలక నేతగా ఉన్న పన్నీర్ సెల్వం.. డీఎంకే తరపున బరిలోకి దిగటం.. అన్నాడీఎంకేకు నష్టం చేయొచ్చనే అభిప్రాయాలున్నాయి.
స్టాలిన్ పాలనపై విమర్శలు చేయడమే కానీ.. క్షేత్రస్థాయిలో పోరాటాలు చేయడంలో అన్నాడీఎంకే విఫలమైందనే భావన ఉంది. జయలలిత హయాంలో అన్నాడీఎంకే దూకుడికి.. ఇప్పటి పార్టీ తీరుకీ అసలు పోలికే లేదని సొంత పార్టీ క్యాడరే పెదవి విరుస్తోంది. అన్నింటికీ మించి తమిళుల ఆత్మగౌరవాన్ని బీజేపీకి తాకట్టుపెట్టారనే విమర్శలతో అన్నాడీఎంకే ఉక్కిరిబిక్కిరవుతోంది. ఈ విమర్శలను తిప్పికొట్టడానికి పళనిస్వామి కొన్నాళ్లు సొంత నిర్ణయాలు తీసుకుని.. బీజేపీకి దూరం జరిగే ప్రయత్నాలు చేసినా.. అవి పొలిటికల్‌గా వర్కవుట్ కాలేదు. పొత్తు ఉంది కాబట్టి.. సీట్ల పంపిణీలో బీజేపీతో చర్చలు తప్పుకాకపోవచ్చు. కానీ అన్నాడీఎంకే అభ్యర్థులనూ అమిత్‌షానే నిర్ణయిస్తున్నారని డీఎంకే సెటైర్లు వేస్తోంది. వీటిని దీటుగా తిప్పికొట్టడంలో అన్నాడీఎంకే తడబడుతోంది. స్టాలిన్ ప్రచారానికి దీటుగా పళనిస్వామి కూడా ఎక్కువ సభల్లో పాల్గొంటున్నా.. ఆయనకు ప్రజాదరణ లేకపోవడం మైనస్ అవుతోంది. అప్పటికీ అన్నాడీఎంకే డీఎంకేతో పోటాపోటీగా పథకాలు ప్రకటించి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఈ మ్యానిఫెస్టోని తాము అమలు చేస్తామని బీజేపీ కూడా కూటమి తరపున హామీ ఇచ్చింది. స్టాలిన్ తమిళ అస్తిత్వం పేరుతో అవినీతి చేస్తున్నారని మోడీ, అమిత్ షా ప్రచార సభల్లో విరుచుకుపడుతున్నారు. ఉదయనిధి స్టాలిన్‌ను చూపించి.. వారసత్వ రాజకీయం అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ వీరి ప్రచారాన్ని అందిపుచ్చుకునే స్థాయిలో అన్నాడీఎంకే ఉందా.. లేదా అనేది తేలడం లేదు. పోల్ సర్వేలు కూడా ఓ పార్టీకి మొగ్గుచూపడం లేదు. కొన్ని డీఎంకే గెలుస్తుందని, మరికొన్ని అన్నాడీఎంకేదే అధికారమని చెబుతున్నాయి. తద్వారా క్షేత్రస్థాయిలో తమిళ ఓటర్ల నాడి ఎవరికీ చిక్కడం లేదనే విషయం తేటతెల్లమౌతోంది.
మొన్నటిదాకా మరోసారి అధికారం ఖాయమని ధీమాగా ఉన్న స్టాలిన్‌ను.. ఎంతోకొంత కంగారుపెట్టేశామని బీజేపీ తలపోస్తోంది. ఈ కంగారును క్యాష్ చేసుకుంటూ.. మరింతగా గుక్కతిప్పుకోనివ్వని మాటల దాడి చేస్తే.. కాగల కార్యం తమిళ ప్రజలే తీరుస్తారనే ఆలోచనతో ముందుకెళ్తోంది. గతంలో ఏమాత్రం బలం లేని చోట ఇదే వ్యూహంతో విజయం సాధించామని ఇప్పటికే తమిళనాడు బీజేపీ నేతలు ప్రత్యర్థుల్ని బెదరగొడుతున్నారు. అందుకు త్రిపుర, ఒడిషా లాంటి రాష్ట్రాల్ని ఉదహరిస్తున్నారు. ఏదేమైనా ఈసారి అసెంబ్లీ ఎన్నికలు డీఎంకేకు అంత తేలిక కాదనే భావనను ఆ పార్టీ క్యాడర్‌లో కలిగించగలిగామని బీజేపీ నేతలు నమ్ముతున్నారు. ఇందుకు పార్టీ అగ్రనేతల ప్రకటనలతో పాటు.. పార్టీ రాష్ట్ర నేతల ప్రచారం కూడా తోడైందని అనుకుంటున్నారు.
క్షేత్రస్థాయి బలం సంగతి వదిలేసి.. ఎన్నికల సందర్భంగా తమ పార్టీలోనే ఎక్కువ హడావుడి కనిపంచాలనేది బీజేపీ ప్లాన్‌గా ఉంది. తద్వారా ఎన్నికల సన్నద్ధత విషయంలో బీజేపీ అందరి కంటే ముందుందని తమిళ ప్రజలు అనుకోవాలనేది వ్యూహంగా కనిపిస్తోంది. తద్వారా ఎన్ని శాతం ఓట్లు వచ్చినా.. కాషాయ పార్టీ దూకుడు మాత్రం ఒకేలా ఉంటుందనే సంకేతాలిస్తోంది. గత ఐదేళ్లలో తమిళనాడులో బీజేపీ రకరకాల వ్యూహాలు అమలు చేసింది. మొదట గవర్నర్ రవి ద్వారా స్టాలిన్ సర్కారుకు బ్రేకులేసింది. తర్వాత జాతీయ భాష హిందీ అమలు విషయంలో వచ్చిన వివాదాన్ని క్యాష్ చేసుకుని.. డీఎంకేను జాతివ్యతిరేకిగా చూపే ప్రయత్నం చేసింది. ఉదయనిధి రాజకీయ ఎదుగుదలను టార్గెట్ చేసి.. ఏ అర్హతతో ఆయనకు అందలం ఇచ్చారని, కుటుంబ పాలనకు ఇంతకంటే వేరే నిదర్శనం అక్కర్లేదని డీఎంకేని టీజ్ చేసింది. అంతేకాదు జాతీయ రాజకీయాల్లోనూ స్టాలిన్ ఎత్తుగడలకు ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇస్తూ.. అసలు తమ పార్టీ విధానమేంటని డీఎంకే క్యాడర్‌కే సందేహాలు వచ్చేలా చేసింది. ఓవైపు డీఎంకే ద్రవిడ వాదానికి గట్టి కౌంటర్ ఇస్తూనే.. మరోవైపు అసలు ద్రవిడ వాదానికి కూడా డీఎంకే తూట్లు పొడుస్తోందంటూ దాడి చేసింది. ఇటీవలే తిరుప్పరకుండ్రంలో జ్యోతి వివాదం కూడా తమకు కలిసొచ్చిందనేది బీజేపీ లెక్క. జ్యోతి ప్రజ్వలనకు అనుకూలంగా తీర్పిచ్చిన జడ్జిని డీఎంకే తప్పుబట్టడం.. చివరకు ఆ జడ్జి తీర్పుకే సుప్రీం మద్దతు పలకడంతో.. అది డీఎంకేకి ఎదురుదెబ్బేననేది కాషాయ పార్టీ భావన.
నిజానికి తమిళనాడులో 2024కి ముందు వరకు బీజేపీకి పెద్దగా ఓట్లు లేవు. గట్టి ప్రయత్నాల తర్వాత కూడా ఓట్ల శాతం మూడుకి మించలేదు. కానీ ఆ తర్వాత ఓట్ల శాతం రెండంకెలకు పెరిగింది. అలా తమిళనాడులో మూడో ప్రధాన రాజకీయ శక్తిగా బీజేపీ ఎదిగింది. కానీ ఇప్పుడు విజయ్ రాకతో.. తమకు గతంలో వచ్చిన ఓట్ల శాతం పెరగకపోయినా.. కనీసం నిలబెట్టుకోవడం సవాలేనని కాషాయ పార్టీ నేతలు అంతర్గత చర్చల్లో అంగీకరిస్తున్నారు.
దశాబ్దకాలంగా తమిళనాడు రాజకీయాన్ని పరోక్షంగా ప్రభావితం చేస్తోంది బీజేపీ. జయలలిత మరణం తర్వాత కీలక ద్రవిడ పార్టీ అన్నాడీఎంకేని కూడా పరోక్షంగా నియంత్రిస్తోంది. దీనికి తోడు కొత్త రక్తానికి బీజేపీలో మాత్రమే అవకాశం ఉంటుందని తమిళ ప్రజలకు సంకేతాలు పంపింది. డీఎంకే, అన్నాడీఎంకేలో నాయకత్వ మార్పు ఇప్పట్లో కుదరదు. టీవీకేలోనూ అంతా విజయ్ జపమే నడుస్తోంది. మిగతా చిన్నాచితకా పార్టీలతో ప్రయోజనం లేదు. అదే దశాబ్దానికి పైగా కేంద్రంలో అధికారంలో కొనసాగుతున్న బీజేపీ వైపు చూస్తే.. ఫలితం ఉంటుందని రాజకీయాలపై ఆసక్తి చూపే యువత అనుకోవాలనేది బీజేపీ వ్యూహంగా ఉంది. ఎలాగైనా తమిళనాడులో స్టాలిన్‌కు చెక్ పెడితే.. జాతీయ స్థాయిలో ఇండి కూటమి బలహీనపడుతుందని కమలనాథులు లెక్కలేస్తున్నారు.
సినీ నటుడిగా మంచి క్రేజ్ ఉన్న విజయ్ అనూహ్యంగా రాజకీయ అరంగేట్రం చేయడంతో.. ఈసారి తమిళనాడు ఎన్నికలు రసవత్తరంగా మారాయి. హేమాహేమీలైన ప్రత్యర్థులున్నా.. విజయ్ ఎక్కడా తగ్గకుండా దీటైన ప్రచారం చేస్తున్నారు. పార్టీ అభ్యర్థులందర్నీ ఒకేసారి ప్రకటించి.. కలకలం రేపిన విజయ్.. ఇప్పుడు తమిళులకు బహిరంగ లేఖ రాసి.. అధికారంలోకి వచ్చేది టీవీకేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటిదాకా ద్రవిడ పార్టీల చుట్టూ మాత్రమే తిరిగిన తమిళనాడు రాజకీయాల్లో అగ్రనటుడు విజయ్ సరికొత్త వ్యూహంతో సమరశంఖం పూరించారు. దశాబ్దాలుగా ద్రవిడ గడ్డపై కొనసాగుతున్న రాజకీయ ధోరణిని మార్చే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు. తమిళనాడు ప్రజలు ఎప్పుడూ ఒక బలమైన ప్రజాకర్షక నేత వెంటే నడుస్తారనే చారిత్రక సత్యాన్ని విజయ్ తన ప్రచారానికి ప్రధాన అస్త్రంగా మార్చుకున్నారు. ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత వంటి దిగ్గజాల తర్వాత ప్రస్తుతం ఆ స్థాయి ఆకర్షణ ఉన్న నేతగా తనను తాను చూపించుకోవటానికి విజయ్ విశ్వప్రయత్నం చేస్తున్నారు. దీనికి తోడు ప్రస్తుత ఎన్నికల రణక్షేత్రంలో పోటీ కేవలం స్టాలిన్ కు, తనకు మధ్యేనని విజయ్ పదేపదే ప్రకటించడం వెనుక లోతైన రాజకీయ వ్యూహం దాగి ఉంది. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న అన్నాడీఎంకేను రేసు నుండి తప్పించి, అసలైన పోరాటం టీవీకే వర్సెస్ డీఎంకే అన్నట్లుగా మార్చాలని విజయ్ భావిస్తున్నారు. జయలలిత మరణానంతరం అన్నాడీఎంకేలో ఏర్పడిన నాయకత్వ లేమిని ఆయన తనకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నారు. ఎడప్పాడి పళనిస్వామి వంటి నేతలు ఉన్నప్పటికీ, జయలలిత తరహాలో ప్రజలను ఉర్రూతలూగించే నాయకుడు ఆ పార్టీలో లేకపోవడం తనకు ప్లస్ అవుతుందనేది విజయ్
అన్నాడీఎంకే ఉనికిని బలహీనపరచడం ద్వారా ఆ పార్టీ ఓటు బ్యాంకును తనవైపు తిప్పుకోవాలని విజయ్ గట్టి ప్లాన్ వేశారు. డీఎంకేకు ప్రత్యామ్నాయం తామేనని ప్రజలకు నమ్మకం కలిగించగలిగితే, అన్నాడీఎంకే మద్దతుదారులు సహజంగానే టీవీకే వైపు మొగ్గు చూపుతారని ఆయన అంచనా. ఈ క్రమంలోనే స్టాలిన్‌ను నేరుగా లక్ష్యంగా చేసుకుంటూ ఘాటు విమర్శలు చేస్తున్నారు. అధికారాన్ని ఒకే కుటుంబం చేతుల్లో ఉంచడాన్ని నిరసిస్తూ, ప్రజాస్వామ్యబద్ధమైన మార్పు కోసం ప్రజలు తన వైపు రావాలని కోరుతున్నారు. ఈ వ్యూహం వర్కవుట్ అయితే, రాబోయే ఎన్నికల్లో టీవీకే అధికారంలోకి రాకపోయినప్పటికీ, అన్నాడీఎంకేను వెనక్కి నెట్టి రెండో స్థానానికి చేరుకోవడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కితే, భవిష్యత్తులో డీఎంకేకు ప్రధాన ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశం ఉంటుంది. అందుకే అన్నాడీఎంకేను నిర్వీర్యం చేయడం ద్వారా తమిళనాడులో ద్విముఖ పోటీ వాతావరణాన్ని సృష్టించడమే విజయ్ ప్రస్తుత లక్ష్యం. ఈ క్రమంలో ఆయన చేస్తున్న విజయ్ వర్సెస్ స్టాలిన్ ప్రచారం సోషల్ మీడియాలో భారీగా ట్రెండ్ అవుతోంది.
విజయ్ తన పట్టును నిరూపించుకోవాలని చూస్తున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమవుతూనే, మరోవైపు మేనిఫెస్టో కమిటీలు, ప్రచార కమిటీలతో పార్టీని పటిష్టం చేస్తున్నారు. స్టాలిన్ ప్రభుత్వంపై వస్తున్న అవినీతి ఆరోపణలు, పాలనాపరమైన వైఫల్యాలను ఎండగడుతూనే, తనను తాను ఒక స్వచ్ఛమైన శక్తి గా అభివర్ణించుకుంటున్నారు. ఈ క్రమంలో అన్నాడీఎంకే ఎదురుదాడి చేస్తున్నప్పటికీ, విజయ్ మాత్రం తన దృష్టిని కేవలం స్టాలిన్‌పైనే కేంద్రీకరించారు. తమిళనాడు ఓటర్లు ఎప్పుడూ కొత్త ప్రయోగాలను ఆదరిస్తారనే నమ్మకంతో విజయ్ వేస్తున్న ఈ అడుగులు రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని మార్చివేసేలా కనిపిస్తున్నాయి. రాజకీయ చదరంగంలో విజయ్ వేస్తున్న ఎత్తుగడలు అన్నాడీఎంకేను చిక్కుల్లో పడేయగా, డీఎంకేను సైతం ఆత్మరక్షణలో పడేస్తున్నాయి.
తమిళనాడు రాజకీయాల్లో చాలా కాలంగా రెండు ద్రవిడ పార్టీల ఆధిపత్యం కొనసాగుతోంది. డీఎంకే, ఏఐఏడీఎంకే తమిళనాడు రాజకీయాలకు రెండు కీలక మూలస్తంభాలుగా మారాయి. అయితే, ఈ రెండు పార్టీలలో ఏదీ సాధారణంగా ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లో సొంతంగా అధికారాన్ని చేపట్టడానికి కావాల్సిన మెజారిటీ సీట్లను గెలుచుకోవు. ప్రతి ఎన్నికలో పొత్తులు తమిళనాడు రాజకీయాల్లో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తాయి. డీఎంకే, ఏఐఏడీఎంకే మధ్య చిన్న ఓటు బ్యాంకులుగల మిత్రపక్షాల కోసం నిరంతర అన్వేషణ జరుగుతుంటుంది. ఇప్పుడు కూడా చిన్నాచితకా పార్టీలు రెండు శిబిరాల మధ్యా చీలిపోయాయి. కానీ విజయ్ ఒంటరిపోటీ ఎవరి పుట్టి ముంచుతుందనే విషయంపైనే వాదోపవాదాలు నడుస్తున్నాయి.
విజయ్ ఎన్నికల ప్రచారం అనుకున్న సమయం కంటే ఆలస్యంగా మొదలైంది. ప్రచార సభల్లో తొక్కిసలాటలు, మరణాలతో.. విజయ్ సభలకు అనుమతి నిరాకరించడం.. టీవీకేని కలవరపెట్టింది. ఆ తర్వాత ఆలస్యంగా ప్రచారం మొదలుపెట్టిన.. వీలైనన్ని ఎక్కువ నియోజకవర్గాలు కలియదిరుగుతూ.. తమిళ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రత్యర్థులతో రాజకీయం చేయాలే కానీ.. కుట్రలు చేయడం ఏం పద్ధతని విజయ్ అడుగుతున్న ప్రశ్నకు.. తమిళ ఓటర్లు ఎలాంటి జవాబిస్తారనేది ఆసక్తికరం. కేవలం రాజకీయం కోసమే విజయ్ కుటుంబ వివాదాన్ని బయటకు లాగి రచ్చ చేస్తున్నారని టీవీకే ప్రచారం చేస్తోంది. దీనికి తోడు విజయ్ వ్యక్తిత్వ హననం చేస్తున్న వారికి బుద్ధి చెప్పాలని ఆయనే స్వయంగా పిలుపు ఇస్తున్నారు. విజయ్ క్రేజ్ విషయంలో ఎవ్వరికీ ఎలాంటి అనుమానాల్లేవు. కాకపోతే సరైన క్యాడర్ బలం లేకుండా అభిమానాన్ని ఓట్లుగా మలుచుకోవడం కష్టం. విజయ్ ముందున్న సవాల్ ఇదేనని చెబుతున్నారు. మరి ఈ సవాల్‌ను విజయ్ ఎంతవరకు కాచుకోగలరనేదే.. ఆయన సాధించే సీట్లను నిర్దేశించనుంది. ఇక్కడ విజయ్ గెలిచే సీట్లెన్ని అనే అంశం కంటే.. ఆయన ప్రధాన పార్టీలను ఓడించే సీట్లెన్ని అనేది కీలకంగా మారిపోయింది. విజయ్ ఏ పార్టీ అభ్యర్థుల్ని ఎక్కువగా ఓడిస్తే.. మిగిలిన ప్రధాన పార్టీ అధికారం అందుకోవటం తేలికవుతుందనేది ప్రస్తుత తమిళనాడు రాజకీయ సమీకరణంగా ఉంది. కానీ పోలింగ్ నాటికి ఇదే సమీకరణం పని చేయాలని ఏమీ లేదు. ఇప్పటికే కీలకమైన నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థుల్ని పోలిన పేర్లతో భారీగా దాఖలైన స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లు ప్రధాన పార్టీలకు గుబులు రేపుతున్నాయి. రెండు చోట్ల పోటీ చేస్తున్న విజయ్.. రెండు అఫిడవిట్లలో పేర్కొన్న ఆస్తుల విలువలో తేడా పైనా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఈ కారణంగా విజయ్ కు ఏమైనా ఇబ్బంది ఎదురవుతుందా అనేది కూడా ఉత్కంఠకు దారితీస్తున్న అంశమే.
అంతిమంగా దశాబ్దాలుగా ద్రవిడ పార్టీల హోరాహోరీ పోరాటం చూసిన తమిళ ప్రజలు.. ఇప్పుడు చాలా కాలం తర్వాత ఓ సినీ స్టార్ రాజకీయ అరంగేట్రాన్ని చూస్తున్నారు. కరుణానిధి, జయలలిత హయాంలో జరిగిన ఎన్నికలకు.. ప్రస్తుత ఎన్నికలకు స్పష్టమైన తేడా ఉంది. అటు స్టాలిన్‌కు, ఇటు పళనిస్వామికి బలాలతో పాటు బలహీనతలూ ఉన్నాయి. అదే సమయంలో విజయ్ పార్టీ పరిస్థితి ఏమిటో ఎవరి అంచనాలకూ అందటం లేదు. దీంతో ఒకే దశలో ముగియనున్న పోలింగ్‌లో తమిళ ఓటర్లు ఎవరికి పట్టం కడతారనేది చూడాల్సి ఉంది.




