పెరుగుతున్న ధరలు, ద్రవ్యోల్బణం నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు కేంద్ర కేబినెట్ భారీ ఊరటనిచ్చింది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న డియర్నెస్ అలవెన్స్ (DA) పెంపుపై ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్ణయం వల్ల సుమారు 50.46 లక్షల మంది ఉద్యోగులు, 68.27 లక్షల మంది పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు. కేవలం జీతం పెరగడమే కాకుండా.. పాత బకాయిలు (అరియర్స్) కూడా ఒకేసారి చేతికి అందనుండటంతో లక్షలాది కుటుంబాల్లో సంతోషం నెలకొంది. ఈ పెంపు వల్ల పెరిగిన నిత్యావసర ధరల భారం నుంచి కొంత ఉపశమనం లభిస్తుందని ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
డీఏ పెంపు వివరాలు..
కేంద్ర ప్రభుత్వం డీఏను ప్రస్తుతమున్న 58 శాతం నుంచి 60 శాతానికి పెంచింది. అంటే నేరుగా 2 శాతం పెంపును ప్రకటించింది. ఈ కొత్త రేట్లు జనవరి 1, 2026 నుంచి అమలులోకి వస్తాయి. ప్రభుత్వం సాధారణంగా ఏడాదికి రెండుసార్లు (జనవరి మరియు జూలై) ఏఐసీపీఐ (AICPI) గణాంకాల ఆధారంగా ఈ డీఏను సవరిస్తుంది.
పెరిగిన 2 శాతం డీఏ వల్ల మీ జీతంలో వచ్చే మార్పును ఈ ఉదాహరణల ద్వారా అర్థం చేసుకోవచ్చు. బేసిక్ శాలరీ రూ. 20,000 ఉంటే పాత డీఏ (58%)కు రూ. 11,600, కొత్త డీఏ (60%)కు రూ. 12,000 పెరుగుతాయి. అంటే నెలవారీ పెరుగుదల రూ. 400 వరకు ఉంటుంది. అరియర్స్ (3 నెలలకు – జనవరి నుండి మార్చి): 400×3=1,200 రూపాయలు అదనంగా అందుతాయి.
Also Read:PBSK Owner Preity Zinta: ప్రీతి జింటా స్టేడియంలో ఎందుకు కనిపించడం లేదో తెలుసా..? కారణం ఇదే..
ఒక వేళ బేసిక్ శాలరీ రూ. 50,000 ఉంటే పాత డీఏ (58%).. రూ. 29,000, కొత్త డీఏ (60%) ప్రకారం రూ. 30,000.. అంటే నెలవారీ పెరుగుదల రూ. 1,000. అరియర్స్ (3 నెలలకు – జనవరి నుండి మార్చి): 1,000×3=3,000 రూపాయలు ఏప్రిల్ నెల జీతంతో కలిపి వస్తాయి.
సాధారణంగా ప్రభుత్వం డీఏ పెంపును ప్రకటించినప్పుడు, అది గడిచిన నెలల నుంచి అమలులోకి వస్తుంది. తాజా నిర్ణయం ప్రకారం.. జనవరి నుంచి మార్చి వరకు ఉన్న మూడు నెలల పెరిగిన డీఏ బకాయిలను (Arrears), ఏప్రిల్ నెల జీతంతో కలిపి చెల్లించే అవకాశం ఉంది. అంటే వచ్చే నెలలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల బ్యాంక్ ఖాతాల్లో భారీగా నగదు జమ కానుంది. ఈ పెంపు జీతానికే పరిమితం కాకుండా.. పెన్షనర్లకు ఇచ్చే డియర్నెస్ రిలీఫ్ (DR) కు కూడా వర్తిస్తుంది. దీనివల్ల రిటైర్డ్ ఉద్యోగులకు కూడా ఆర్థికంగా అండ లభించనుంది.




