వైసీపీ నాయకుడు గురించి అమిత్ షా దగ్గర ఏమీ మాట్లాడలేదని.. అయినా అమిత్ షాతో ఏకాంతంగా జరిగిన చర్చలు బయటకు ఎలా తెలుస్తాయని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. రాజమండ్రిలో జరిగిన జనసేన సమావేశంలో పవన్ కల్యాణ్ మాట్లాడారు. ‘‘అమిత్‌షాతో మాట్లాడిన విషయాలు బయటవాళ్లకు ఎలా తెలుస్తాయి. వైసీపీ నేత జైలుకు వెళ్లాలని అడిగితే నాకు క్లాస్ తీసుకున్నారట. ఒకరు జైలుకి వెళ్తే పవన్ కల్యాణ్ ఎదుగుతారా.? జనసేన ఎదుగుతుందా..? ఇలాంటి వారు లేనప్పుడే నేను రాజకీయాల్లోకి వచ్చా. అభివృద్ధి కోసమే అమిత్ షాను కలిశాను. రాజకీయ పార్టీ నడపడం అంత ఈజీ కాదు. కులం గురించి మాట్లాడతానని నన్ను అంటున్నారు. మిగితా నాయకులు కులం గురించి మాట్లాడటం లేదా.? గత్యంతరం లేక.. ఇంత ఓపికతో ఉన్నా.. తమిళనాడు రాజకీయాలు ఎంతో సాఫీగా సాగిపోయాయి. నాకు అసూయ కలిగేంత చక్కగా రాజకీయాలు సాగాయి.’’ అని పవన్ కల్యాణ్ అన్నారు.
‘‘జనసేనపై రాళ్లు వేద్దామనుకుంటే.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. నేను కూడా మనిషినే.. నాకు కూడా కోపాలు ఉంటాయి. మీరు కొడుతూ ఉంటే.. మేము భరిస్తూ ఉంటామా.? కష్టాలు, కన్నీళ్లు మీకే ఉంటాయా.? మీరు ఏమన్నా.. మేము భరిస్తూ ఉండాలా..? భరిస్తాం.. సహిస్తాం అవసరమైతే తాట తీస్తాం.. ఈ మాట చానాళ్ల క్రితమే చెప్పా.’’ పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.
‘‘కటౌట్ పెట్టుకొని ఈజీగా విజయ్ సీఎం అయిపోయాడు. తమిళ రాజకీయాలు ఎంతో సుఖంగా జరిగిపోయాయి. తమిళ రాజకీయాలు చూసి నాకు అసూయ కలిగింది. అన్ని ప్రాంతాల వారిని ఏకతాటిపై తీసుకురావడానికి కృషి చేస్తున్నాం. పార్టీ నడపటం సింగిల్ లైన్లో ఉంటుంది. నేను అన్ని ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటా వాటిని ఆచరించండి విమర్శించవద్దు. అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ శ్రేణులకు పౌరుషం చచ్చిపోయింది. మళ్లీ అందరికీ ఖడ్గ తిక్కన్న కథ చెప్పి పెంచాలి.’’ అని పేర్కొన్నారు.




