Lokesh Kanagaraj DC Movie Review: తమిళ సినీ పరిశ్రమలో చేసింది కొన్ని సినిమాలైనా, మంచి గుర్తింపు సంపాదించాడు దర్శకుడు లోకేష్ కనగరాజ్. ఆయన హీరోగా అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో ‘డీసీ’ అనే సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి లోకేష్ ఫ్యాన్స్‌లో ఆసక్తి ఏర్పడింది. అసలు కొన్ని కల్ట్ సినిమాలు డైరెక్ట్ చేసిన డైరెక్టర్, హీరోగా ఎలా నటిస్తాడు? అసలు ఎలాంటి మూవీ చేస్తున్నాడు? అంటూ సినిమా మీద కూడా కొంత ఆసక్తి ఏర్పడింది. వామికా కథానాయికగా నటించిన ఈ సినిమాని తెలుగులో ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ అదే పేరుతో రిలీజ్ చేసింది. ఈ సినిమా ఆగస్టు ఏడో తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
డీసీ కథ:
దేవదాస్ (లోకేష్ కనగరాజ్) మరో నలుగురితో కలిసి ఒక గ్యాంగ్‌గా ఏర్పడి, పోలీసులు వాడి ద్వంశం చేయబోతున్న తుపాకులను దొంగిలిస్తాడు. దీంతో పోలీసులు అందరూ ఈ గ్యాంగ్‌ని ట్రేస్ చేసే పనిలో పడతారు. అయితే అనుకోకుండా ఒక పోలీస్ అధికారిని సైతం దేవదాస్ అండ్ గ్యాంగ్ అత్యంత దారుణంగా చంపేస్తుంది. దీంతో పోలీసులు మరింత ఫోకస్డ్‌గా ఈ గ్యాంగ్‌ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే అసలు ఈ గ్యాంగ్ లక్ష్యం ఏమిటి? ఎందుకు పోలీసులను టార్గెట్ చేసింది? పోలీసుల నుంచి దొంగిలించిన తుపాకులతో ఏం చేశారు? అసలు పోలీస్ అధికారిని ఎందుకు చంపాల్సి వచ్చింది? ఈ కథ మొత్తం మీద చంద్ర (వామికా) పాత్ర ఏమిటి? అనేది తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
విశ్లేషణ:
గతంలో కీర్తి సురేష్‌తో ‘సానీ కాగితం’, ధనుష్‌తో ‘కెప్టెన్ మిల్లర్’ సినిమాలు చేసిన అరుణ్ మాథేశ్వరన్, ఈసారి తన తోటి దర్శకుడిని హీరోగా పెట్టి ‘డీసీ’ అనే సినిమాను చేశాడు. సినిమా అనౌన్స్‌మెంట్ నుంచే ప్రేక్షకులలో ఆసక్తి ఏర్పడింది. సినిమా ప్రారంభం నుంచి అరుణ్ మాథేశ్వరన్ మార్క్ దాదాపుగా కనిపిస్తూనే ఉంది. పూర్తిస్థాయి రా అండ్ రస్టిక్ మూవీగా ఈ సినిమాని రూపొందించారు. కొత్తగా చెప్పుకోవడానికి అయితే ఏమీ లేదు, ఒక రెగ్యులర్ గ్యాంగ్‌స్టర్ డ్రామా. కాకపోతే దానికి పీరియాడిక్ సెటప్ తీసుకుని కథ నడిపించే ప్రయత్నం చేశారు.
ఫస్ట్ హాఫ్‌లో లోకేష్ అండ్ గ్యాంగ్ అసలు ఎందుకు గన్స్ దొంగతనం చేస్తున్నారు, అసలు ఈ గ్యాంగ్ లక్ష్యం ఏమిటి అనే విషయాలు ఏమీ చూపించకుండానే ప్రేక్షకులలో కొంత ఆసక్తి పెంచే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత కథలోకి వామికా ఎంట్రీ ఇచ్చిన క్రమంలో కథలో ఏమైనా కొత్త ట్విస్టులు చోటుచేసుకుంటాయేమో అని ఆశించే ప్రేక్షకులకు, అదేమీ లేకుండానే కథ నడిపించాడు దర్శకుడు.
మొత్తంగా చెప్పాలంటే, ఒక చదువుకున్న వ్యక్తి పోలీసుల నుంచి న్యాయం దొరకని క్రమంలో వారిపై తిరుగుబడే ఒక ప్రయాణంగా ఈ సినిమాని రూపొందించారు. దానికి పూర్తిస్థాయి కమర్షియల్ హంగులు అద్ది, అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్‌తో మ్యాజిక్ చేసే ప్రయత్నం చేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది రెగ్యులర్ కమర్షియల్ సినిమా అనే చెప్పాలి. కానీ, ఒక దర్శకుడు హీరోగా మారి ఎలాంటి సినిమా చేశాడు అని ప్రేక్షకులలో క్రియేట్ అయిన ఆసక్తి ఈ సినిమాకి ప్లస్ పాయింట్. అలానే అనిరుద్ తన మ్యూజిక్తో చేసిన మ్యాజిక్ స్క్రీన్ మీద బాగా వర్కౌట్ అయింది. చాలా చోట్ల సీన్లను ఎలివేట్ చేయడంతో పాటు థియేటర్ మొత్తం ఎరప్ట్ అయ్యేలా చేయడంలో టీం సక్సెస్ అయింది.
నటీనటుల పనితీరు విషయానికి వస్తే.. ఈ సినిమాతో పూర్తిస్థాయి హీరోగా లాంచ్ అయిన లోకేష్ కనగరాజ్, దేవదాస్ అనే పాత్రలో కరెక్ట్‌గా సెట్ అయ్యాడు. పెద్దగా ఎక్స్‌ప్రెషన్స్ కూడా అవసరం లేని ఈ పాత్రలో పూర్తిస్థాయిలో లీనమై నటించాడు. ఈ సినిమాలో వామికా పాత్ర చిన్నదే అయినా ఇంపాక్ట్‌ఫుల్. ఇక సంజనా కృష్ణమూర్తి ఉన్నంతలో పర్వాలేదు అనిపించింది. లోకేష్ కనగరాజ్ స్నేహితుల పాత్రల్లో నటించిన నటులు వయొలెన్స్ సృష్టిస్తూనే కొన్నిచోట్ల నవ్వించే ప్రయత్నం చేశారు.
టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే, ఈ సినిమాకి హీరో లోకేష్ అయితే, టెక్నికల్ టీమ్‌గా అలాగే సినిమా మొత్తాన్ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకువెళ్లడంలో మాత్రం అనిరుధ్ రవిచందర్ పూర్తిస్థాయిలో డ్యూటీ చేశాడు. ఏమాత్రం తగ్గకుండా ఎక్కడికక్కడ సినిమాని ఎలివేట్ చేస్తూ వచ్చాడు. సినిమా చూస్తున్నంతసేపు అనిరుధ్ రవిచందర్ నేపథ్య సంగీతం ప్రేక్షకులను హాంట్ చేసేలా అనిపించింది. ఇక సినిమాటోగ్రఫీ సెటప్‌కి తగ్గట్టుగా సరిపోయింది. నిడివి కూడా క్రిస్పీగానే ఉంది. కథ రొటీన్ అయినా సరే, స్క్రీన్ ప్లే కూడా పెద్దగా కన్ఫ్యూజన్ లేకుండా రాసుకుని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. తెలుగు డబ్బింగ్ కూడా కరెక్ట్‌గానే సెట్ అయింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.




