Iran War: ఇరాన్‌లో అమెరికా సైనికుడి పోరాటం హాలీవుడ్ యాక్షన్ సినిమాకు ఏమాత్రం తక్కువ కాదు. యుద్ధంలో విమానం కూలిపోతే సాధారణంగా ప్రాణాలు దక్కడం కష్టం. అలాంటిది ఇరాన్ వంటి దేశంలో ఆ విమానం కూలిపోతే, ప్రాణాలపై ఆశ వదులుకోవాల్సిందే. అలాంటి పరిస్థితుల్లో ఆ సైనికుడు సాగించిన ప్రాణ పోరాటం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇరాన్-అమెరికా యుద్ధంలో అమెరికాకు చెందిన ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగిల్ యుద్ధ విమానం ఏప్రిల్ 2న ఇరాన్‌లో కూలిపోయింది. ఇరాన్ మిస్సైల్ దాడితో విమానం కుప్పకూలింది. ఆ సమయంలో విమానంలో ఉ న్న వెపన్ సిస్టమ్ ఆఫీసర్ అత్యవసరంగా విమానం ననుంచి దూకాల్సి వచ్చింది.
యూఎస్ విమానాన్ని కూల్చిన ఇరాన్..
ఈ ఘటనలో పైలట్‌ను కొన్ని గంటల వ్యవధిలోనే అమెరికా రెస్క్యూ చేసింది. కానీ వెపన్ సిస్టమ్ ఆఫీసర్ జాడ కనుగొనడానికి చాలా సమయం తీసుకోవాల్సి వచ్చింది. భద్రతా కారణాల వల్ల అతడి పేరు వెళ్లడించకుండా.. ‘‘డ్యూడ్ 44 బ్రావో’’గా అతడిని పిలుస్తున్నారు. బ్రావో ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన ప్రాణాల కోసం ఎలా పోరాడాడనే విషయాన్ని వెల్లడించారు. తాను ప్రాణాలతో బయటపడటం ‘‘ఆధునిక కాల అద్భుతం’’గా అభివర్ణించాడు. క్షిపణి తాకిన సమయంలో భారీ ట్రక్క్ ఢీకొన్నట్లు అనిపించిందని, విమానాన్ని గాలిలో ఉంచేందుకు పైలట్ ప్రయత్నించినా అది సాధ్యం కాలేదని చెప్పుకొచ్చారు. దీంతో ఇద్దరం ఎజెక్ట్ అయ్యామని వెల్లడించారు. అయితే, బ్రావో దెబ్బతిన్న పారశ్యూట్ వల్ల పైలట్ నుంచి 5 మైళ్ల దూరంలో కఠినమైన భూభాగంలో నేలపై పడిపోయారు. ఈ ప్రమాదంలో అతడి వెన్నెముక, చేతికి తీవ్ర గాయాలయ్యాయి.
విరిగిన ఎముకలతో 7000 అడుగుల ఎత్తు పర్వతం పైకి..
రెండు కొండచరియలు ఉన్న లోయలో పడిపోయిన బ్రావో అక్కడే ఉంటే ఇరాన్ సైన్యానికి దొరికే వాడే. తీవ్ర గాయాలైనా పర్వతంపైకి ఎక్కడానికే నిర్ణయించుకున్నాడు. సుమారు 7000 అడుగుల ఎత్తైన కొండ పైకి ఎక్కాడు. విమానం కూలిపోయిన వెంటనే అమెరికా రెస్క్యూ మిషన్ ప్రారంభించింది. హెలికాప్టర్లు, విమానాలతో అమెరికా ఇద్దరు పైలట్ల కోసం వెతకడం ప్రారంభించింది. ఈ ఆపరేషన్ కోసం 90 మందికి పైగా అమెరికా సైనికుల్ని ఇరాన్ భూభాగంలోకి అమెరికా పంపించినట్లు చెప్పింది. 46 ఏళ్ల తర్వాత యూఎస్ సైనికులు ఇరాన్ భూభాగంలో దిగడం ఇదే తొలిసారి. పైలట్‌ను ఆరు గంటల్లోనే గుర్తించారు.
సీఐఏ మాస్టర్ ప్లాన్:
అయితే, చివరకు ఎలాగొలా బ్రావో అమెరికా దళాలకు మెసేజ్ చేరవేశాడు. నిజానికి బ్రావో దాక్కున్న పర్వతానికి సమీపంలోనే ఇరాన్ సైన్యం ఉన్నట్లు అమెరికా గుర్తించింది. అతడిని రక్షించేందుకు అమెరికా టీమ్‌ను పంపడానికి ముందు అమెరికా బాంబర్లు, డ్రోన్లు అక్కడ ఉన్న ఇరాన్ సైన్యంపై దాడి చేసినట్లు వార్త కథనాలు వెలువడ్డాయి.
ఈ ఆపరేషన్ మొత్తంలో అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సీఐఏ కీలక పాత్ర పోషించింది. ఇరాన్ బలగాలను గందరగోళానికి గురిచేసేలా డిసెప్షన్ ఆపరేషన్ నిర్వహించడంతో పాటు కూలిపోయిన విమానంలోని సైనిక అధికారి ఆచూకీ గుర్తించేందుకు రహస్య టెక్నాలజీని ఉపయోగించారు. దాదాపుగా 50 గంటల పాటు సాగిన గాలింపు తర్వాత బ్రావోను సురక్షితంగా రెస్క్యూ చేశారు.




