హైదరాబాద్ నగర రవాణా వ్యవస్థలో ఒక భారీ మలుపు చోటుచేసుకుంది. ఇన్నాళ్లూ ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో (PPP) నడుస్తున్న హైదరాబాద్ మెట్రో రైలును పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకుంటూ తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఎల్ అండ్ టీ మెట్రో రైల్ హైదరాబాద్ సంస్థకు ఉన్న 100 శాతం ఈక్విటీ వాటాను సుమారు రూ. 15 వేల కోట్ల వ్యయంతో కొనుగోలు చేస్తూ ప్రభుత్వం ఈ ప్రక్రియను ముగించింది. దీనికి సంబంధించి పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ అధికారిక ఉత్తర్వులు వెలువరించారు. ఈ కీలకమైన స్వాధీన ప్రక్రియ ఏప్రిల్ 30వ తేదీ నాటికి పూర్తి కానుంది, దీంతో మెట్రో రైలు మెజార్టీ వాటాదారుగా ప్రభుత్వం మారి తన పూర్తి ఆధిపత్యాన్ని చాటుకుంది.
ఈ భారీ కొనుగోలుకు అవసరమైన నిధుల కోసం భారతీయ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (IRFC) నుంచి రూ. 13,615 కోట్ల రుణాన్ని పొందేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన గ్యారంటీ పత్రాలు, అండర్‌టేకింగ్ లెటర్లపై సంతకాలు చేసే అధికారాన్ని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శికి ప్రభుత్వం కట్టబెట్టింది. అలాగే, మెట్రో కార్యకలాపాలు ఎక్కడా ఆగకుండా ఉండేందుకు ప్రస్తుత సిబ్బంది నియామకాలు, ఇతర సాంకేతిక ఒప్పందాలపై ఎల్ అండ్ టీతో చర్చలు జరిపి సంతకాలు చేసే బాధ్యతను హెచ్‌ఎమ్మార్‌ఎల్ (HMRL) ఎండీకి అప్పగించింది. క్యాబినెట్ సబ్ కమిటీ సిఫార్సుల మేరకు గురువారం జరిగిన రాష్ట్ర క్యాబినెట్ భేటీలో ఈ ప్రతిపాదనలకు తుది ఆమోదం లభించింది.
మెట్రో నిర్వహణ పూర్తిగా ప్రభుత్వ పరిధిలోకి వచ్చిన నేపథ్యంలో పరిపాలన పరంగా కూడా కీలక మార్పులు జరిగాయి. ప్రభుత్వం కొత్త బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే. రామకృష్ణరావును మెట్రో చైర్మన్‌గా నియమించగా, సర్ఫరాజ్ అహ్మద్‌ను మేనేజింగ్ డైరెక్టర్‌గా కొనసాగించాలని ప్రభుత్వం నిశ్చయించింది. వీరితో పాటు మరికొంత మంది సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను డైరెక్టర్లుగా బోర్డులోకి తీసుకువచ్చింది. ఈ మార్పుల ద్వారా మెట్రో నిర్వహణలో పారదర్శకత పెంచడంతో పాటు, భవిష్యత్తులో మెట్రో విస్తరణ , ఛార్జీల నియంత్రణ నేరుగా ప్రభుత్వం చేతుల్లోనే ఉండనుంది.




