Farmers Protest: భారత్-అమెరికా మధ్య ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందానికి (Trade Deal) వ్యతిరేకంగా దేశంలో మళ్లీ రైతు ఆందోళనలు తీవ్రమవుతున్నాయి. ఈ ఒప్పందం ఇంకా ఖరారు కాకపోయినప్పటికీ, ‘దేశ్ బచావో మోర్చా’ బ్యానర్‌పై పంజాబ్, హర్యానా, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వేలాది మంది రైతులు ఢిల్లీలోని కిసాన్ ఘాట్ వద్ద ‘మహాపంచాయత్’ నిర్వహించేందుకు పయనమయ్యారు. దీంతో హర్యానా సరిహద్దుల్లో పోలీసులు భారీ బారికేడ్లు ఏర్పాటు చేసి, పలు ప్రాంతాల్లో బిఎన్‌ఎస్ (BNS) సెక్షన్ 163 ప్రకారం నిషేధాజ్ఞలు విధించారు.
రైతుల ప్రధాన భయాలు, డిమాండ్లు:
అమెరికాలో వ్యవసాయ రంగానికి అక్కడి ప్రభుత్వం భారీగా రాయితీలు (సబ్సిడీలు) ఇస్తుందని, అక్కడ తయారైన చౌకైన వ్యవసాయ ఉత్పత్తులు భారత మార్కెట్‌లోకి ప్రవేశిస్తే స్థానిక రైతులకు, పాడి రైతులకు, చిన్న వ్యాపారులకు కోలుకోలేని దెబ్బ తగులుతుందని రైతు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీనివల్ల దేశీయ పంటల ధరలు పడిపోయి గ్రామీణ ఆదాయం దెబ్బతింటుందని వారి భయం. కేవలం వ్యవసాయ ఉత్పత్తులే కాకుండా డెయిరీ, ఈ-కామర్స్, మేధో సంపత్తి హక్కుల వరకు ఈ ఒప్పందం విస్తరిస్తుందని, కాబట్టి అమెరికాతో ఈ వాణిజ్య ఒప్పంద చర్చలను వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తోంది?
మరోవైపు కేంద్ర ప్రభుత్వం రైతులకు స్పష్టమైన హామీ ఇస్తోంది. భారతదేశ వ్యవసాయ ప్రయోజనాల విషయంలో ఎలాంటి రాజీ పడేది లేదని, సున్నితమైన వ్యవసాయ ఉత్పత్తులను చర్చల పరిధి బయటే ఉంచామని ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, ఇతర అధికారులు మాట్లాడుతూ… ఇరు దేశాలకు సమాన ప్రయోజనం చేకూరేలా, భారతదేశపు ‘రెడ్ లైన్స్’ దాటకుండా ఉంటేనే ఒప్పందంపై సంతకం చేస్తామని, తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోమని స్పష్టం చేశారు. అమెరికా పన్నుల సడలింపులపై పూర్తి హామీ ఇవ్వకపోవడం, వ్యవసాయ రంగాన్ని మినహాయించాలని భారత్ పట్టుబట్టడంతో ఇప్పటివరకు ఈ తాత్కాలిక ఒప్పందంపై ఎలాంటి ముగింపునకు రాలేకపోయారు. అయితే, ఒప్పందం కుదిరిన తర్వాత వ్యతిరేకించడం కంటే, చర్చల దశలోనే తమ నిరసన తెలపడం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచవచ్చని రైతు సంఘాలు భావిస్తున్నాయి.




