EV Car Fire Accident: ప్రమాదంలో చిక్కుకున్న ఈవీ కారు.. పూర్తిగా దగ్ధం కావడంతో నలుగురు మృతి చెందారు.. ఎన్టీఆర్ జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదానికి గురైన ఎలక్ట్రిక్ వాహనం (ఈవీ కారు) పూర్తిగా మంటల్లో చిక్కుకుని దగ్ధమైంది. ఈ దుర్ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ప్రమాదం తర్వాత పూర్తిగా దగ్ధమైన కారు
నంబూరులో జరిగిన ఓ ఫంక్షన్‌కు హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విజయవాడ వెస్ట్ బైపాస్‌పై కారు ప్రమాదానికి గురైన అనంతరం మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిని నున్న, నంబూరు ప్రాంతాలకు చెందినవారిగా గుర్తించారు.. నున్నకు చెందిన కొమ్మారెడ్డి రాందేవ్ (39), ఆయన తల్లి కొమ్మారెడ్డి అరుణ, మరో చిన్నారి, నంబూరుకు చెందిన తిగురు విజయ మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం.
సంఘటనా స్థలంలో బంధువుల రోదనలు
ప్రమాద సమాచారం అందుకున్న బంధువులు సంఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. అప్పటివరకు తమతో ఉన్నవారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రమాదం ఎలా జరిగింది, కారు మంటల్లో చిక్కుకోవడానికి గల కారణాలేమిటనే అంశాలపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.




