ఒకడేమో పోలీస్.. కానీ గంజాయి స్మగ్లర్‌గా మారాడు… మరొకడేమో దొంగ.. కానీ పోలీస్ అవతారం ఎత్తాడు. ఒకడు జనానికి మత్తు అందిస్తూ అడ్డంగా సంపాదిస్తున్నాడు.. మరొకడు.. జనాన్ని మోసం చేస్తూ దోచుకుంటున్నాడు. సీన్ కట్ చేస్తే ఈ ఇద్దరినీ పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. రెండు వేర్వేరు ఆపరేషన్లలో దొరికిన ఈ కంత్రీగాళ్ల కథా కమామిషు ఏంటో తెలుసుకుందాం.
హైదరాబాద్‌లో పోలీసులు గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణా వినియోగంపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులో భాగంగా ఎక్కడికక్కడ తనిఖీలతోపాటు స్పెషల్ ఆపరేషన్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జూబ్లీహిల్స్ పోలీసులు, ఎస్ఆర్ నగర్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో ఓ వ్యక్తి వద్ద నుంచి 158 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ రూ. 79 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు.
ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు అని ఆరా తీస్తే.. షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. ఇక్కడ చూడండి.. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తే అతను. ఆయన పేరు శివకృష్ణ. ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన CISF కానిస్టేబుల్‌గా గుర్తించారు. గతంలో రెండుసార్లు గంజాయి రవాణా చేస్తూ పోలీసులకు పట్టుబడడంతో ఉద్యోగం నుంచి అధికారులు తొలగించారు. మరోసారి ఇతర రాష్ట్రాల నుంచి గంజాయిని హైదరాబాద్‌కు తరలిస్తుండగా పోలీసులకు పక్కా సమాచారం రావడంతో జాయింట్ ఆపరేషన్ నిర్వహించి నిందితుడిని పట్టుకున్నారు.
అయితే CISF కానిస్టేబుల్‌గా పనిచేసిన శివకృష్ణ పలుచోట్ల తన ఐడీ కార్డును చూపిస్తూ పోలీసుల తనిఖీల నుంచి తప్పించుకుంటూ గంజాయి సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. రెండు కేసుల్లో నిందితుడిగా ఉండగా మరోసారి టాస్క్‌ఫోర్స్ పోలీసులకు చిక్కాడు. నిందితుడి వద్ద నుంచి గంజాయితోపాటు కారు, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.
పోలీస్ డ్రెస్‌లో స్టైల్‌గా కనిపిస్తున్న ఈ వ్యక్తి పేరు నాగరాజు. నిజానికి ఇతడు పోలీస్ కాదు. ఫేక్ ఐపీఎస్ అధికారిలా అవతారం ఎత్తి ప్రజలను మోసం చేస్తూ పోలీసులకు చిక్కాడు. గతంలో ఆర్మీ ఖల్నల్ అవతారమెత్తి అరెస్ట్ అయిన కేసులో 2 పీడీయీక్ట్లు కూడా ఉన్నాయి. కానీ అతని ప్రవర్తన మాత్రం మారలేదు. మళ్లీ ఐపీఎస్ అధికారిలా మారి మోసాలకు పాల్పడుతూనే ఉన్నాడు. జగద్గిరిగుట్ట పీయస్ పరిధిలో ఈ సూడో పోలీస్‌ను.. పోలీసులు పట్టుకున్నారు.
కూకట్ పల్లికి చెందిన పూర్ణచందర్ రావుకి సంబంధించిన ఓ కేసులో ఈ ఫేక్ ఐపీఎస్ తలదూర్చాడు. హర్యానాలో నమోదైన కేసు విషయంలో తాను ఐపీయస్ అధికారిని అని నమ్మించిన నాగరాజు.. రఘువర్మ, ఇంకా తన అనుచరులతో కలిసి పూర్ణ చందర్ రావును కిడ్నాప్ చేశాడు. తన ఫేక్ పోలీస్ కార్లో కిడ్నాప్ చేసి సూర్యాపేట్కి తీసుకెళ్లి లక్ష రుపాయలు వసూలు చేశాడు. హైదరాబాద్ లో వదిలేసి మరోసారి రూ. 5 లక్షల 26 వేలతో పరారయ్యాడు.
భాదితుడు పూర్ణ చంద్రారావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కూకట్పల్లి, జగద్గిరిగుట్ట పోలీసుల జాయింట్ ఆపరేషన్‌తో నకీలీ సూడో పోలీసులకు చిక్కాడు. అతనిపై ఇప్పటికే గతంలో 12 కేసులతో పాటు, 2 పీడీయాక్ట్‌లు, భీమవరంలో రౌడీషీట్ ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ప్రధాన నిందితుడు నాగరాజు ప్రతి ఆపరేషన్‌కి ఓ పేరు చెప్పి 12 పేర్లతో ఆయా నకీలీకార్డ్లు తయారు చేసుకుని చలామణి అయినట్లు పోలీసులు గుర్తించాడు. అంతే కాదు ఇదే విధంగా నిందితుడు 6 మంది టీంతో సూడో పోలీస్ వ్యవస్థే ఎర్పాటు చేసుకున్నాడని తెలిపారు. ఐతే ఈ టీమ్‌లోని ముగ్గురిని అరెస్ట్ చేశామని.. మిగతా ముగ్గురు పరారీలో ఉన్నట్లు వివరించారు.
మరోవైపు నిందితుల నుంచి 2 గన్లు, ల్యాప్‌టాప్, పోలీస్ డ్రెస్‌లు, కార్, బైక్, లెటర్ ప్యాడ్స్, బేడీలు, షాటిలాట్స్, పలు రబ్బర్ స్టాంప్‌లు, 10మొబైల్స్‌తో పాటు పలు గ్రేడింగ్ స్టార్ట్ సింబల్స్ స్వాధీనం చేసుకున్నారు.




