6
May, 2026

A News 365Times Venture

6
Wednesday
May, 2026

A News 365Times Venture

Chairmans Desk : ఐదు రాష్ట్రాల ఎన్నికలు పొలిటికల్ ట్రెండ్ మార్చయా? రాజకీయాలు అంటే యుద్ధాలేనా ?

Date:

ప్రజాస్వామ్య దేశంలో ప్రజాభిప్రాయానికి ఎన్నికలే గీటురాయి. కోట్ల మంది ప్రజల మనసులు గెలుచుకోవటానికి రాజకీయానికి మించిన ప్రత్యామ్నాయం లేదని నేతలు నమ్ముతారు. అందుకే ఎవరికి వారు తమ ఆలోచనలతో సింక్ అయ్యే పార్టీల్లో చేరి రాజకీయ పోరాటాలు చేయటం మొదట్నుంచీ ఉంది. కాకపోతే సిద్ధాంతాల ఆధారంగా జరగాల్సిన రాజకీయ పోరు కాస్తా.. ఇప్పుడు వీధిపోరాటాల స్థాయికి దిగజారింది. ఇంకా మాట్లాడితే రాజకీయాల కంటే యుద్ధాలే నయం అనిపించేంత దారుణంగా పరిస్థితులు విషమించాయి. మొన్నటి ఐదు రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా జరిగిన పరిణామాలు.. దేశంలో రాజకీయాలు కొత్త లోతుకు పడిపోయిన సంగతి కళ్లకు కట్టాయి. ఇక బెంగాల్లో జరిగిందైతే నభూతో నభవిష్యతి అనే చెప్పాలి. ఈ పోరాటాలు చూశాక.. మన తెలుగు రాష్ట్రాల్లో 2029లో జరిగే ఎన్నికలు ఎలా ఉంటాయో ఊహించుకోవటానికే భయమేస్తోంది. ఇదే అంశంపై ఇవాల్టి ఛైర్మన్స్ డెస్క్ చూద్దాం.

ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీల విమర్శలు, ప్రతి విమర్శలు, వాదనలు, ప్రతివాదనలను ఎవరూ తప్పుబట్టడం లేదు. కానీ ఓ స్థాయికి దిగజారి చేసుకుంటున్న రాజకీయమే ఇక్కడ చర్చనీయాంశంగా మారుతోంది. అసలు ప్రజాసమస్యలపై చర్చే లేకుండా కేవలం ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకోవటమే ఎన్నికల ప్రచారం అన్నట్టుగా పరిస్థితులు మారిపోయాయి. మొదట్లో కింది స్థాయి కార్యకర్తలు మాత్రమే ఎక్కువగా ఆవేశపడేవారు. కానీ ఇప్పుడు రాజకీయాల ట్రెండ్ మారింది. ఏకంగా అగ్రనేతలే ప్రత్యర్థుల్ని రెచ్చగొడుతూ.. కవ్విస్తూ.. బహిరంగ సవాళ్లు విసురుతున్నారు. అవసరమైతే సినిమా డైలాగులు కూడా దట్టించి.. సొంత క్యాడర్‌ను ఉత్సాహపరిచే మిషతో.. ప్రత్యర్థుల్ని దారుణంగా తూలనాడుతున్నారు. పరిస్థితి చూస్తుంటే రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉంటారనే మాటకు కాలం చెల్లినట్టే కనిపిస్తోంది. ఇక్కడ బద్ధశత్రువులే ఉంటారని, ఎవరో ఒకరో మిగలాలనేంత ఇదిగా పార్టీలు అన్నింటికీ తెగించి పోరాడుతున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల్లో ప్రత్యర్థుల్ని ఓడిస్తే సరిపోదు.. వారిని రాజకీయాంగా అంతర్ధానం చేయాలనే అత్యాశ పెరిగింది. అందుకే అధికారంలోకి వచ్చిన ప్రతి పార్టీ అందుకు తగ్గట్టుగా కార్యాచరణ రూపొందించుకుని.. ప్రత్యర్థుల్ని వేటాడటమే పనిగా పెట్టుకుంటోంది. దీనికి ఆ పార్టీ ఈ పార్టీ.. ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అనే మినహాయింపేం లేదు. అన్నీ ఆ తాను ముక్కలే అన్నట్టుగా ఎవరికి వారు తమ శక్తికి మించి రెచ్చిపోతున్నారు. ఒకప్పుడు నేతలు కనిపిస్తే ప్రజలు సమస్యలు చెప్పుకునేవారు. కానీ ఇప్పటి నేతల తీరు చూస్తున్న ప్రజలకు కూడా .. వీరికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అనిపిస్తోంది. మొత్తం మీద ప్రజల్ని ఆకట్టుకునేలా చేయాల్సిన రాజకీయం కాస్తా.. వారిని విపరీతంగా భయపెట్టే స్థాయికి చేరటాన్ని ఎలా అర్థం చేసుకోవాలో నేతలు, పార్టీలే వివరించాలి.

మొన్నటికి మొన్న ఐదు రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా జరిగిన రాజకీయ యుద్ధాలను చూస్తే దేశాల మధ్య జరిగే ఆయుధ యుద్ధాలు కూడా దిగదుడుపేనా అనిపిస్తుంది. అప్పటిదాకా ఇరాన్ యుద్ధం గురించే ఎక్కువగా ఆసక్తి చూపించిన ప్రజలు.. అసలీ ఐదు రాష్ట్రాల ఎన్నికల్ని పట్టించుకుంటారా అనే సందేహాలు కూడా మొదట్లో వచ్చాయి. కానీ మన నేతలు తమ రాజకీయ వాటం ప్రదర్శించి.. యుద్ధానికి మించిన రాజకీయ యుద్ధాన్ని ప్రత్యక్షంగా చూపించడంతో.. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల ప్రజలే కాకుండా.. మిగతా రాష్ట్రాల జనం కూడా అవాక్కయ్యారు. అసలు మన కళ్ల ముందు జరిగే రాజకీయ పోరు ముందు ఇరాన్ యుద్ధం ఏపాటిదిలే అనుకున్నారు. అంతగా రాజకీయాన్ని రక్తి కట్టించిన నేతలు.. రాష్ట్రానికో వ్యూహం, ఎత్తుగడలు అనుసరిస్తూనే.. పనిలోపనిగా అవసరమైనప్పుడల్లా మసాలా దట్టించి వదిలిన డైలాగులతో రాజకీయ రణక్షేత్రం కాస్తా.. అసలు సిసలు యుద్ధ క్షేత్రంగా మారిపోయింది. ఈ యుద్ధంలో ఎవ్వరూ ఎక్కడా తగ్గలేదు. ప్రధాన పార్టీలు, చిన్న పార్టీలు అనే తేడా లేదు. నేతల ఇమేజ్‌తో సంబంధమే లేదు. ఎవరికి వారు తమ పొలిటికల్ అగ్రెషన్ చూపించటానికి పోటీలు పడ్డారు. అసలు ప్రత్యక్ష యుద్ధాలు కూడా ఇవాళ ఇండియాలోని రాజకీయ యుద్ధాల ముందు కచ్చితంగా తీసికట్టే.

కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, అసోం ఎన్నికలు ఒకెత్తయితే పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ – టీఎంసీ మధ్య జరిగిన పొలిటికల్‌ వార్‌ చరిత్రలోనే కనీ వినీ ఎరగని ఎన్నికల రణరంగాన్ని ప్రదర్శించింది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పదిహేను రోజులు ఏకంగా పశ్చిమ బెంగాల్లో మకాం వేసి… స్వయంగా వార్‌ రూమ్‌ ఆయనే నడిపిస్తూ కదన రంగంలో కాషాయ దళాల్ని ఉరకలెత్తించారు. ఇక ప్రదాని మోడీ పాతికేళ్ల కుర్రాడిలా కోల్‌కతా వీధుల్లో తిరుగుతూ టీఎంసీ ఆధినేత్రి మమతా దీదీకి బహిరంగ సవాళ్లు విసిరారు. ఇలాంటి అత్యంత తీవ్రమైన రాజకీయ యుద్ధాన్ని ఇంతకుముందెప్పుడూ దేశం చూడలేదు. కేవలం రాజకీయ శపథాలు, హెచ్చరికలు మాత్రమే కాదు… ఒకరి రాజకీయ అంతానికి మరొకరు భీషణ ప్రతిజ్ఞలు చేయడం చూస్తే రాబోయే ఎన్నికలు ఇంకెంత దారుణంగా ఉంటాయో అని ఇప్పటి నుంచే జనం ఆసక్తిగా గమనిస్తున్నారు. ఎన్నికలంటే రాజకీయ ప్రత్యర్ధులని ఓడించడం కోసం జరిగే ప్రజాస్వామిక ప్రక్రియ అనే విషయాన్ని ఇండియాలో పొలిటికల్‌ పార్టీలు పూర్తిగా వదిలేశాయి. మరీ ముఖ్యంగా మొన్నటి బెంగాల్ ఎన్నికల్లో జరిగిన కనీవినీ ఎరుగని పరిణామాలు చూసి అంతా షాకయ్యారు. ఇక్కడ ప్రచారం జరిగినన్ని రోజులూ యుద్ధ వాతావరణమే ఉంది. ఇక ఆ తర్వాత పోలింగ్‌కు ముందు, పోలింగ్ రోజు, ఆ తర్వాత కూడా వాతవారణం మరింత వేడెక్కిందే కానీ.. ఎక్కడా ఉపశమించిన పాపాన పోలేదు. బెంగాల్‌లో ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే.. ఫలితాలు వచ్చాకైనా ఆ రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం ఉంటుందని ఎవరూ గ్యారంటీ ఇవ్వలేని దుస్థితి కనిపిస్తోంది. అసలు ఒక్క రాష్ట్రం గురించి ఈ స్థాయి రాజకీయ యుద్ధం ఏంటని దేశమంతా చర్చ జరిగేలా చేసిన బెంగాల్ ఎన్నికలు.. ఇకపై జరిగే ప్రతి ఎన్నికకూ సరికొద్ద యుద్ధ ప్రమాణాలు నిర్దేశించాయనే అభిప్రాయాలు వస్తున్నాయి.

ఇక ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలే ఇలా ఉంటే.. రేపు 2029లో ఆంధ్ర-తెలంగాణ ఎన్నికలు ఇంకెలా ఉంటాయో?! అసలా వాతావరణాన్ని ఊహించడానికే భయంగా ఉంది. మాటలు, అంతకు మించి సవాళ్లు వాటిని అధిగమించి భౌతిక దాడులు, కిడ్నాప్‌లు, హెచ్చరికలు ఇవన్నీ చూస్తుంటే రేపు 2029లో తెలుగు రాష్ట్రాల్లో జరిగే యుద్ధం అలాంటి ఇలాంటి యుద్ధం కాదనిపిస్తోంది. రాజకీయంగా చాలా క్రియాశీలకంగా ఉండే తెలుగు రాష్ట్రాల్లో వచ్చే ఎన్నికలు.. ఎలాంటి పరిణామాల్ని కళ్లకు కడతాయనేది ఎవరి ఊహకూ అందటం లేదు. అప్పటికప్పుడు వ్యూహాల మార్పులు, అనూహ్య ఎత్తుగడలు తెలుగు రాజకీయాల్లో మామూలే. పైగా మిగతా రాష్ట్రాల కంటే రాజకీయంగా ఓ అడుగు ముందుండాలనే తాపత్రయం గల నేతలు కూడా ఎక్కువే. దీంతో 2029లో జరిగే ఏపీ, తెలంగాణ ఎన్నికలు కచ్చితంగా సరికొత్త యుద్ధాన్ని దేశ రాజకీయ తెరపై ఆవిష్కరిస్తాయనడంలో సందేహం లేదు.

 

దేశ రాజకీయాల్ని గమనిస్తే.. ఇప్పుడు ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో చూసిన పరిణామాలేవీ హఠాత్తుగా జరిగినవి కాదు. వీటన్నింటికీ ఓ బలమైన పూర్వరంగమే ఉంది. స్వాతంత్ర్యానంతర కాలం నాటి రాజకీయాలు.. ఒక్కో దశాబ్దం గడిచేకొద్దీ కొద్దికొద్దిగా దిగజారుతూ వచ్చి.. చివరకు ఈ రూపు తీసుకున్నాయి. రాజకీయాలు దిగజారిన తర్వాత.. ఆ రాజకీయ పార్టీలు ప్రధాన పాత్ర పోషించే ఎన్నికల ప్రక్రియలో కూడా అవాంఛిత ధోరణులు, అనవసర ఉద్రిక్తతలు ప్రవేశించడం వింతేం కాదు. ప్రజల మనసును గెలవటం ఎలా అనే విషయంలో మారిన నేతల ఆలోచనలు.. చివరకు రాజకీయాల్లో విజయాలకూ షార్ట్‌కట్‌లను నమ్ముకునే ధోరణులు పెరిగినప్పుడు.. ఇప్పుడు చూసిన వాటికి మించిన ధోరణులు చూడటానికి కూడా ఎక్కువ కాలం పట్టదనే చర్చ జరుగుతోంది.

ఎన్నికల ప్రచారం విషయంలో నిర్దిష్ట వ్యూహం ఉన్నప్పుడు.. అనవసరంగా ఎవర్నీ రెచ్చగొట్టాల్సిన పని లేదు. మన మీద మనకు నమ్మకం ఉన్నప్పుడు అవతలివారిని కించపరచాల్సిన అవసరం కూడా అసలే ఉండదు. కానీ ప్రస్తుత రాజకీయాల తీరు వేరు. స్వపక్షం బలాల కంటే.. విపక్షం బలహీనతల్నే నమ్ముకుంటున్నారు. నలభై మంచిమాటలు చెప్పేకంటే.. నాలుగు రెచ్చగొట్టే డైలాగులతోనే పని జరుగుతుందని గట్టిగా నమ్ముతున్నారు. కష్టపడి పనిచేసి, సమస్యలు పరిష్కరించి.. ప్రజల మనసులు గెలుచుకోవటానికి కొన్నేళ్లు పడుతుంది. కానీ అంత సమయం వృథా చేయటం అనవసరం. అదేదో అడ్డదారిలో ఎడాపెడా ఎదిగిపోతే త్వరగా ఉన్నత పదవులు వస్తాయనే లెక్కలో నేతలుంటున్నారు. ఇంతకుముందు ఎన్నికల సమయంలో హడావుడి చేయటానికి, ఉద్రిక్తతలు సృష్టించటానికి ప్రత్యేక బ్యాచ్‌లుండేవి. కానీ కాలక్రమంలో అలాంటి లక్షణాలున్నవారినే పార్టీలు ఎంకరేజ్ చేయటం, వారికే టికెట్లు ఇచ్చేస్తుండటంతో.. ఆ ఉద్రిక్తతలకు కూడా ప్రొఫెషనల్ కోణం జతచేరి.. రాజకీయ మూకలు మరింతగా రెచ్చిపోతున్నాయి. వీటిని అదుపుచేయాల్సిన అగ్రనేతలే.. వారిని మరింత రెచ్చగొట్టేలా ప్రవర్తించడం.. పరిస్థితిని ఇంకా దిగజారుస్తోంది.

ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికల్లో గెలుపే కోరుకుంటోంది. అలా కోరుకోవటం తప్పు కాకపోయినా.. గెలుపు మాత్రమే పరమావధి అనుకున్నప్పుడే చిక్కులు వస్తున్నాయి. ఏ యుద్ధంలో అయినా గెలుపు, ఓటమి రెండూ ఉంటాయి. దేనికైనా సిద్ధపడే రంగంలోకి దిగాలి. మామూలుగా ఎవరికి వారికి గెలుపుధీమా ఉండటం తప్పు కాదు. చివరకు యుద్ధానికి కూడా నిబంధనలు ఉంటాయి. ఏదైనా కొన్ని నిబంధనలకు లోబడే చేయాలి. అంతేకానీ గెలుపే ప్రధానం కదా అని తోచినట్టుగా యుద్ధం చేస్తే రచ్చ రచ్చ తప్పదు. ప్రస్తుతం దేశంలో వివిధ రాష్ట్రాల్లో జరిగిన, జరుగుతున్న ఎన్నికల్లో గతంలో ఎప్పుడూ ఎరుగని పోకడలు గమనిస్తున్నాయి. చివరకు ఎన్నికల నిబంధనలు రూపొందించే ఈసీనే కంగారుపెట్టేలా ఉంటోంది నేతల వ్యవహారం. రాజకీయ పార్టీల అతి తెలివి చూసి.. ఎన్నికల నిపుణులు కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. సరే కాసేపు నిబంధనల సంగతి పక్కనపెడితే.. ప్రజల్ని బుట్టలో వేయటానికి కూడా నేతలు ప్రమాదకరమైన ఎత్తుల్ని ఎంచుకుంటున్నారు.

ఎన్నికలు వచ్చేదాకా రాజకీయం ఒకలా ఉంటుంది. కానీ అలా ఎన్నికలు వచ్చాయో లేదే.. అంతే ఒక్కసారిగా రాజకీయ థర్మామీటర్లు బద్దలయ్యేంతగా ఉష్ణోగ్రతలు పెరిగిపోతాయి. ప్రజల్ని కదిపేసి, కుదిపేసి, కలేసి, మెలేసి.. ఓట్లు వేయించుకుంటాయి పార్టీలు. అప్పటిదాకా పార్టీల పనితీరుని బట్టి ఓటేద్దామనుకున్న ఓటర్లను కూడా గందరగోళపరిచి.. అసలు ప్రజలకు సంబంధం లేని ఏవో అంశాలు తెరపైకి తెచ్చి.. అవే ప్రధానం అని ప్రజలతోనే అనిపించి.. చివరకు వాటి ప్రాతిపదికనే ఓటింగ్ జరిగేలా చేయడంలో పార్టీలన్నీ ఆరితేరాయి. ఆ మాటకొస్తే ఈ విషయంలో అన్ని పార్టీలూ కూడబలుక్కుంటున్నాయా అనే అనుమనాలూ రాకమానవు. చాలాసార్లు ఎన్నికల ప్రచార సమయంలో జరిగిన పరిణామాలే ఎన్నికల్లో విజేతల్ని నిర్ణయిస్తాయి. ఇంతకుముందు ఇలాంటి దుందుడుకు ధోరణులు ఉండేవి కాదు. ఐదేళ్ల పాటు పార్టీల పనితీరుపై సమగ్ర పరిశీలనకు ఓటర్లకు అవకాశం ఉండేది. కానీ ఇప్పటి పార్టీలు తెలివిమీరి ఓటర్లకు ఆ ఛాన్స్ ఇవ్వకుండా ప్రాంతీయ ఆస్తిత్వమో, జాతీయ భద్రతనో, మరేదో సరికొత్త అంశాన్నో తెరపైకి తెచ్చి ఓట్లు దండుకుంటున్నాయి. అందుకోసం ప్రచారంలోనే ఓటర్లకు సినిమా చూపిస్తున్నాయి. నవరసాల్ని కళ్ల ముందే కనికట్టులా చూపిస్తూ.. కేవలం పోలింగ్ కోసమే ఓటర్లలో భావోద్వేగం పెరిగేలా ప్లాన్లు గీస్తున్నాయి. ఇటీవలి కాలంలో కొన్ని రాష్ట్రాల్లో పాత రికార్డులన్నీ బద్దలయ్యేలా నమోదవుతున్న పోలింగ్ శాతాలపై కూడా ఇలాంటి చర్చే జరుగుతోంది. నిజంగా ఇదంతా ఓటరు చైతన్యమే అయితే.. అంతకంటే మన ప్రజాస్వామ్యానికి మంచి పరిణామం మరోటి ఉండదు. కానీ లోతుగా తరచి చూస్తే.. భారీ పోలింగ్ పర్సంటేజీల వెనుక పార్టీల కుట్రలు, నేతల కుటిల ఆలోచనలూ కనిపిస్తున్నాయి. ఎందుకంటే భారీ పోలింగ్ ఎక్కడా ఆ రాష్ట్రానికి సంబంధించిన ఓ బలమైన అంశం ప్రాతిపదికన నమోదు కావడం లేదు. కేవలం ఆ రాష్ట్రంలో రాజకీయ ప్రత్యర్థుల మైండ్ గేమ్, లేనిపోని పంతాల కారణంగానే నమోదవుతోందనేది విశ్లేషకుల మాట. సరే ఎలా నమోదైనా భారీగా ఓటర్లు పోటెత్తడం ప్రజాస్వామ్యానికి మంచిదే అనే వాదన కూడా లేకపోలేదు. అదీ నిజమే అయినా అందుకోసం రాజకీయ యుద్ధాన్ని రియాల్టీ షోలా చూపించి.. అమాయకుల్ని రెచ్చగొట్టి.. అనవసర హింసకు తెరతీస్తారా .. అంటే సమాధానం అంత తొందరగా దొరకదు.

రాజకీయం ఎప్పుడైనా బాధ్యతగానే చేయాలి. కానీ ప్రస్తుతం పార్టీలు మాత్రం రాజకీయాన్ని యుద్ధానికి మించి చేయాలని కొత్త నిర్వచనం ఇస్తున్నాయి. ప్రచారం అన్నాక చప్పగా ఉంటే ఏం బాగుంటుంది. విన్న ఓటర్లు పిచ్చెక్కిపోయేలా చేస్తే తప్ప నాలుగు ఓట్లు రాలవనేది నయా నేతల రాజకీయ సిద్ధాంతం. అందుకోసం ఏం చేసినా తప్పు కాదనేది సరికొత్త రాజకీయ యుద్ధనీతి. యుద్ధంలో, జూదంలో ఏదీ తప్పుకానప్పుడు.. యుద్ధాన్ని మించిన రాజకీయంలో మాత్రం ఏం చేసినా తప్పెలాగవుతుందని నేతలు ఎదురుప్రశ్నలు వేస్తున్నారు. గెలుపు కోసం నానా తిప్పలు పడి.. ఓటర్లను ప్రసన్నం చేసుకోవటానికి పాట్లు పడుతుంటే.. వాటిని సహృదయంతో అర్థం చేసుకోవాల్సింది పోయి.. సూటిపోటి మాటలతో వేధిస్తారేంటని అడిగినా అడుగుతారు మన నాయకులు. ఎందుకంటే రాజకీయాల్లో చూడూ ఒకవైపే చూడూ అన్నట్టుగా గెలుపును మాత్రమే దృష్టిలో పెట్టుకునే నేతలకే ఇప్పుడు అగ్రాసనం దక్కుతోంది. ఎన్నికల్లో గెలిచినవారికే కాదు.. ఓడినవారికీ అంతో ఇంతో ప్రజాదరణ ఉంటుందనే విషయాన్ని మన నేతలు అసలు లెక్కలోకి తీసుకోవడం లేదు. గెలిస్తే కింగు. లేకపోతే చేతగానివాడికిందే లెక్క. ఒక నేత ఎంత స్థాయి ఉన్నవారైనా ఒక్కసారి ఓడిపోయారంటే.. ఇక కూటికి కొరగాని ప్రత్యర్థులు కూడా నోటికొచ్చినట్టుగా అవహేళన చేస్తారు. దీంతో గెలుపోటముల్ని సమానంగా తీసుకునే ఆలోచన నేతలకు లేకుండా పోతోంది. ఓడిపోతే అవమానాలు తప్పవని ముందే ఫిక్సైపోతున్న నేతలు.. విజయం కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. ఏం చేసైనా ఓటర్లను ఆకట్టుకోవటం తప్పు కాదనుకుంటున్నారు. అందుకోసం హింసకు తెరతీయటానికి, కొత్త గొడవలు సృష్టించటానికి కూడా వెనుకాడటం లేదు. చిన్ని నా బొజ్జకు శ్రీరామరక్ష అన్నట్టుగా.. తన గెలుపు కోసం రాష్ట్రాన్ని.. వీలైతే దేశాన్నీ తగలెట్టేసే మహానుభావులే నేతలుగా చలామణీ అవుతున్న కాలంలో.. రాజకీయంగా ఇలా కాకుండా.. మరోలా ఎలా ఉంటుందనే ప్రశ్నలు వస్తున్నాయి.

 

ఇప్పుడు దేశంలో ఎక్కడచూసినా రాజకీయం అంటే యుద్ధమే అనే భావన స్థిరపడిపోయింది. ఇక యుద్ధానికి మించి అనేది ఇప్పుడు కొత్తగా చూస్తున్న పరిణామం. ఏతావాతా ఐదు రాష్ట్రాల ఎన్నికల పరిణామాలు.. దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు, నేతలకు సరికొత్త రాజకీయ గీతను బోధించాయనడంలో సందేహమే లేదు. ఇక తెలుగు రాష్ట్రాల గురించి చెప్పాల్సిన పని లేదు. ఇక్కడ ఇప్పటికే ఆ రాజకీయ యుద్ధ వాతావరణం వచ్చేసింది. ముఖ్యంగా తెలంగాణలో అదేదో రేపే అసెంబ్లీ ఎన్నికలు అన్నట్టుగా అధికార ప్రతిపక్ష పార్టీలు రోడ్డెక్కేశాయి. నిత్యం ప్రెస్‌ మీట్లు, సభలు, రకరకాల కార్యక్రమాలతో రాష్ట్రాన్ని హోరెత్తిస్తున్నాయి. ప్రధాని మోడీ ఈనెల 10న తెలంగాణ వస్తున్నారు. అది ఆషామాషీ పర్యటన కాదు. నిద్రపోతున్న బీజేపీ యంత్రాంగాన్ని చమ్కీ దెబ్బతో అదిలించి ఉరకలెత్తించడానికి మోడీ పర్యటన ఇగ్నీషన్‌ కానుందని ఢిల్లీ నుంచి గల్లీ దాకా బీజేపీ వర్గాలే చెబుతున్నాయి. ఇక బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలైతే సవాళ్లు, ప్రతి సవాళ్లు, ఆరోపణలు ఇలా ఒకటి కాదు… రకరకాల రాజకీయ కార్యక్రమాలతో వ్యూహాలతో ముందుకు వెళ్తున్నాయి. ఇదంతా చూస్తుంటే 2029లో తెలంగాణ పొలిటికల్‌ వార్‌ మామూలు స్థాయిలో జరగదనేది అర్ధమవుతోంది. ముఖ్యంగా బీజేపీ దక్షిణాదిలో తమ బలం పెంచుకునేందుకు తెలంగాణలో నయానో భయానో గెలిచి తీరాలనే పట్టుదలతో ఉంది. అందుకే 2029లో జరగబోయే తెలంగాణ ఎన్నికలు ఓ మహాయుద్ధం లాంటివి.

తెలంగాణలో ప్రస్తుతానికి త్రిముఖ పోటీ నడుస్తోంది. వరుసగా రెండోసారి అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తోంది. లేదు ఈసారి అధికారం మాదేనని బీఆర్ఎస్ తొడ గొడుతోంది. మీ ఇద్దరికీ కాదు.. ఈసారి తెలంగాణ ప్రజలు మాకే అధికారం ఇస్తారని బీజేపీ కవ్విస్తోంది. గతంతో పోలిస్తే ప్రతి పార్టీ అంతో ఇంతో రాజకీయ లోతు పెంచుకోవటం, ఎన్నో ఢక్కామొక్కీలు తిన్న అనుభవం సంపాదించుకోవడంతో.. తెలంగాణలో వచ్చే ఎన్నికలు హోరాహోరీగా జరుగుతాయనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎవరికి వారు అమీతుమీ తేల్చుకోవాలనప్పుడు కచ్చితంగా.. కొత్త వ్యూహాలు, ఎత్తుగడలు.. వాటికి సమాంతరంగా అవాంఛిత ధోరణులు కూడా రంగప్రవేశం చేయడం కొత్తేం కాదు. పైగా పోటీ గట్టిగా ఉన్నప్పుడే ఎప్పుడూ అనవసర రాజకీయ ఉద్రిక్తతలకు తెర తొలగుతుంది. ఈ కారణంగా తెలంగాణలో రాబోయే ఎన్నికలు యుద్ధాన్ని మించి జరగటమే కాకుండా.. ఇక్కడి పార్టీలు రాజకీయ వర్గాలుక కొత్త కిక్ ఇస్తాయనే వాదన కూడా వినిపిస్తోంది.

ఇక ఏపీ విషయానికి వస్తే అక్కడ రోజూ రణరంగమే. పాలక ప్రతిపక్షాలు రెండూ రేపే ఎన్నికలకు వెళ్లిపోతున్నట్టు ఇవాళ విమర్శించుకుంటాయి. అడుగుతీసి అడుగేస్తే చాలు.. ప్రత్యర్ధిపై నిప్పులు కురిపిస్తున్నాయి. గెలిచి రెండేళ్లవుతున్నా ఏపీ సీఎం చంద్రబాబు తన ప్రత్యర్ధిని వదిలిపెట్టడం లేదు. విమర్శించడం ఆపడం లేదు. ఇప్పుడు బెంగాల్‌ యుద్ధం జరిగిన తీరు చూస్తే రేపు ఏపీలో జరిగే రాజకీయ యుద్ధం ముందు ఇవన్నీ దిగదుడుపే అనిపిస్తుంది. గెలుపు కోసం ఏ స్థాయి తెగింపుకైనా సరే ఏపీలో పొలిటికల్‌ పార్టీలు సిద్ధపడిపోతాయి. ఇంకా మూడేళ్లు ఉండగానే నిత్యం ఆరోపణలు ప్రత్యారోపణలతో పొలిటికల్‌ భూకంపం సృష్టిస్తున్న పార్టీలు ఎన్నికలు దగ్గరకొస్తే ఊరుకుంటాయా?

ఏపీలో టీడీపీ, వైసీపీ నువ్వానేనా అన్నట్టుగా తలపడుతున్నాయి. రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శల్లో ఎవరూ తగ్గటం లేదు. అవకాశం కల్పించుకుని మరి ప్రత్యర్థుల్ని చీల్చిచెండాడుతున్నారు. అగ్రనేతలు కూడా సూటిగా సుత్తి లేకుండా పదునైన వాగ్బాణాలు సంధించుకుంటున్నారు. విషయం ఏదైనా.. ఓటర్ మనసుకు సూటిగా తగిలేలా మాట్లాడటం ఏపీ నేతలకు వెన్నతో పెట్టిన విద్య. మిగతా విషయాలు పక్కనపెడితే.. రాజకీయంగా ఏ కొత్త పోకడ అయినా ఇక్కడే మొదలుకావాలని కోరుకునే నేతలకు ఎప్పుడూ కొదువలేదు. ఇప్పుడు కూడా ఇదే ధోరణితో ఆలోచిస్తున్న నేతలు.. 2029లో జరిగే ఎన్నికల నాటికి.. ఎలాంటి రాజకీయ యుద్ధక్షేత్రాన్ని సిద్ధం చేస్తారనేది చూడాల్సి ఉంది. వచ్చే ఎన్నికలకు ఏపీలో రాజకీయ రణక్షేత్రం ఎవరూ ఊహించనంత సంక్లిష్టంగానూ ఉండనుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే రాజకీయంగా విపరీతమైన దూకుడు చూపిస్తున్న పార్టీలు.. ఎన్నికల సమయానికి సరికొత్త ఎత్తులతో ఆశ్చర్యపరుస్తాయనే అభిప్రాయాలున్నాయి.

ఏది ఏమైనా ఇప్పటిదాకా ఐదు రాష్ట్రాల్లో పొలిటికల్‌ వార్‌ చూశాం. ఇంతకుముందు చాలాసార్లు ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరిగినా.. మునుపెన్నడూ చూడని పరిణామాలకు ప్రస్తుత ఎన్నికలు వేదికగా నిలిచాయి. ఇప్పటిదాకా పోల్ మేనేజ్‌మెంట్‌కు మాత్రమే ప్ర్తయేక దృష్టి కావాలనే రాజకీయ దృక్కోణమే సమూలంగా మారిపోయేలా చేశాయి. ఎన్నికలంటే ఆషామాషీ కాదు. చాలా వ్యూహాత్మకంగా, అంతకుమించిన దూకుడుతో ఎన్నికల అజెండాను ఫిక్స్ చేయడమే కాదు.. దాన్ని ఓటర్ల మనసులోకీ అంతే పదునుగా చొప్పించాలని, అప్పుడే మనం అనుకున్నట్టుగా పోలింగ్ సరళి ఉంటుందని పార్టీలన్నీ నిరూపించాయి. ఇప్పటికే ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరిగిన తీరుపై దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలు రకరకాలుగా అధ్యయనాలు చేస్తున్నాయి. పోలింగ్‌ను విశ్లేషిస్తున్నాయి. ముఖ్యంగా ప్రచార ఘట్టాల్ని కూలంకషంగా పరిశీలిస్తున్నాయి. ఎవరికి తోచిన ఇన్‌పుట్స్‌ వారు తీసుకుంటున్నారు. పనిలోపనిగా తెలుగు రాష్ట్రాల్లో పార్టీలు కూడా ఐదు రాష్ట్రాల ఎన్నికల నుంచి స్ఫూర్తి పొందాయనడంలో సందేహమే లేదు. అందుకే మూడేళ్ల తర్వాత 2029లో తెలుగు రాష్ట్రాల్లో అంతకు మించి సూపర్‌ పవర్‌ గేమ్‌ చూస్తామని జనం కూడా ముందే ఫిక్సైపోతున్నారు. ఇదీ ఈ వారం ఛైర్మన్స్ డెస్క్. మరో అంశంపై విశ్లేషణతో మళ్లీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఎన్టీవీ.

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Rahul Gandhi: బెంగాల్ కాంగ్రెస్ నాయకులపై రాహుల్‌గాంధీ ఫైర్.. ఏం జరిగిందంటే..!

పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ నాయకులపై రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం...

CM Chandrababu : ఇనుప ఖనిజంతో ఏపీకి జాక్‌పాట్.!

రాష్ట్రంలోని ఇనుప ఖనిజ నిల్వలను పూర్తిస్థాయిలో వినియోగించుకుని… అటు ఆదాయం, ఇటు...

MK Stalin: ఓడిన కొన్ని గంటలకే కొళత్తూరులో స్టాలిన్ పర్యటన.. ఫొటోలు వైరల్

ఎన్నికల్లో ఓటమి అంటే ఎవరూ జీర్ణించుకోలేరు. ఆ ఓటమి నుంచి వెంటనే...

Gen Z: జెన్ జీల ప్రభావం.. రాష్ట్రాల సీఎంలనే మార్చేశాయి.. విజయ్‌కు కలిసొచ్చింది ఇదే…

భారతదేశ ఎన్నికల ముఖచిత్రం ప్రస్తుతం భారీ మార్పులకు లోనవుతోంది. ముఖ్యంగా జన్-జీ...