Beach Shacks in AP: ఆంధ్రప్రదేశ్‌లో తీరప్రాంత పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని బీచ్ ప్రాంతాల్లో ‘బీచ్ షాక్స్’ పేరుతో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ అధికారిక ఉత్తర్వులు విడుదల చేసింది. రాష్ట్రంలోని 12 జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ (APTDC) గుర్తించిన ప్రాంతాల్లో ఈ బీచ్ షాక్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. పర్యాటకులను ఆకర్షించడం, తీరప్రాంతాల్లో సౌకర్యాలను మెరుగుపరచడం, స్థానిక ఉపాధి అవకాశాలను పెంచడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా పేర్కొంది.
అయితే, ఈ బీచ్ షాక్స్‌లో ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ (IMFL) మరియు విదేశీ మద్యం విక్రయాలకు అనుమతి ఉండదని ఎక్సైజ్ శాఖ స్పష్టం చేసింది. ఈ కేంద్రాల నిర్వహణ, అనుమతులు, కార్యకలాపాలకు సంబంధించిన విధివిధానాలను ప్రభుత్వం గైడ్‌లైన్స్ రూపంలో విడుదల చేసింది. ప్రస్తుతం ఈ కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఏర్పాటు చేసే బీచ్ షాక్స్ పనితీరును ఏడాది పాటు పరిశీలించనున్నారు. అనంతరం వాటి నిర్వహణ, పర్యాటకుల స్పందన, ఆర్థిక ప్రయోజనాలు వంటి అంశాలపై సమీక్ష నిర్వహించి, రాష్ట్రంలోని ఇతర తీరప్రాంతాలకు విస్తరించాలా లేదా అనే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు.
పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడంతో పాటు తీరప్రాంతాల అభివృద్ధికి ఈ నిర్ణయం దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. బీచ్ షాక్స్ ద్వారా సందర్శకులకు మరింత మెరుగైన అనుభవాన్ని అందించడంతో పాటు పర్యాటక రంగంలో కొత్త అవకాశాలు సృష్టించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.




