ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగ మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కీలక ప్రకటన చేశారు. పార్వతీపురంలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆమె ఈ నియామక ప్రక్రియపై పూర్తి వివరాలను వెల్లడించారు. ఈ నిర్ణయం ద్వారా వేలాది మందికి ఉపాధి లభించనుంది.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 5,000 మినీ అంగన్‌వాడీ కేంద్రాలను ప్రభుత్వం ప్రధాన అంగన్‌వాడీలుగా అప్‌గ్రేడ్ చేసింది. ఈ మార్పు వల్ల ఆయా కేంద్రాల్లో అదనపు సిబ్బంది అవసరం ఏర్పడింది. ఈ కేంద్రాల్లో కొత్తగా అంగన్‌వాడీ సహాయకులను నియమించేందుకు ప్రభుత్వం అనుమతించింది.
తొలి విడతలో భాగంగా 2,645 కేంద్రాల్లో సహాయకుల నియామక ప్రక్రియను వెంటనే ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. మిగిలిన కేంద్రాల్లో తదుపరి దశల్లో భర్తీ చేస్తారు. ఈ నియామకాలకు సంబంధించి ఆయా జిల్లాల కలెక్టర్ల నేతృత్వంలో నోటిఫికేషన్లు జారీ కానున్నాయి. అర్హులైన అభ్యర్థులు స్థానిక ప్రకటనల ఆధారంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. గత కొన్నాళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ పోస్టుల భర్తీకి అనుమతి లభించడంపై అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు ఈ నిర్ణయం ఆర్థికంగా చేయూతనిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. త్వరలోనే దీనిపై పూర్తి స్థాయి షెడ్యూల్ విడుదల కానుంది.




