Ambati Rambabu: ప్రశ్న రావణ్‌పై నమోదైన యూఏపీఏ కేసును తీవ్రంగా తప్పుబట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు.. ఆయనపై కేసు నమోదు చేయడం పూర్తిగా అన్యాయమని, అణచివేత ధోరణిలో భాగంగానే ఈ చర్యలు చేపట్టారని ఆరోపించారు. రావణ్‌కు ఒక కేసులో బెయిల్ లభించిన వెంటనే మరో కేసులో అరెస్టు చేయడం, చివరకు యూఏపీఏ కింద కేసు నమోదు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు.
రిమాండ్‌కు పంపిన అనంతరం దర్యాప్తు ప్రారంభించడం, ఇంట్లో సోదాలు నిర్వహించడం ద్వారా కేసుకు అవసరమైన ఆధారాలను సేకరించే ప్రయత్నం జరుగుతోందని అంబటి రాంబాబు విమర్శించారు. పోలీస్ స్టేషన్లో ఉన్న రావణ్‌పై దాడి యత్నం జరిగినప్పటికీ సంబంధిత వారిపై చర్యలు తీసుకోలేదని ఆయన ఆరోపించారు. రావణ్ సిద్ధాంతాలతో తమకు ఏకీభావం లేదని, ఆయన గతంలో వైసీపీని విమర్శించిన విషయాన్ని గుర్తుచేసిన అంబటి.. అయినప్పటికీ అన్యాయమైన చట్టాలను ప్రయోగించి ఎవరినైనా అణచివేయడాన్ని తమ పార్టీ వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. పోలీసు హింసకు బలైన బాధితులకు అండగా నిలవడం తమ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు.
సాయికృష్ణ, క్రాంతి కుమార్ లు చనిపోతే మేం వారికి అండగా నిలిచామన్నారు అంబటి.. రౌడీషీటర్లకు మద్దతిస్తారా అని కొందరు ప్రశ్నిస్తున్నారు.. మేం రౌడీ షీటర్లకు కాదు.. చనిపోయిన వారికి మాత్రమే మద్దతిస్తున్నాం అన్నారు.. దుర్మార్గంగా పోలీసుల హింసకు బలైపోయిన వారికి మద్దతిస్తే తప్పా? అని ప్రశ్నించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు.




