రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) బౌలర్ల ధాటికి ఢిల్లీ క్యాపిటల్స్ (DC) బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కూలిపోయింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత దారుణమైన పవర్ ప్లే ప్రదర్శనను నమోదు చేసిన తర్వాత, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ తన మనసులోని ఆవేదనను పంచుకున్నాడు. మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. అసలు క్రీజులో ఏం జరుగుతుందో అర్థం చేసుకోలేకపోయామని ఆయన అంగీకరించారు.
“అసలేం జరిగిందో నాకే అర్థం కావట్లేదు”..
మ్యాచ్ ముగిసిన తర్వాత అక్షర్ పటేల్ చాలా నిరాశగా కనిపించాడు. “నిజం చెప్పాలంటే.. క్రీజులో అసలు ఏం జరుగుతుందో నాకే అర్థం కాలేదు. వికెట్లు ఒకదాని వెంట ఒకటి రాలిపోతుంటే ఏం చేయాలో పాలుపోలేదు. క్రికెట్ అనేది చాలా అనిశ్చితమైన ఆట, అందుకే ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలి. ఈ చేదు జ్ఞాపకాన్ని ఎంత త్వరగా మర్చిపోతే అంత మంచిది” అని అక్షర్ పేర్కొన్నాడు.
ఆర్సీబీ బౌలర్లపై ప్రశంసలు..
ఆర్సీబీ బౌలింగ్ యూనిట్‌ను అక్షర్ కొనియాడాడు. ముఖ్యంగా భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్ వేసిన స్పెల్స్ మ్యాచ్‌ను మలుపు తిప్పాయని చెప్పాడు. “భువీ, హేజిల్‌వుడ్ ఇద్దరూ ప్రపంచ స్థాయి బౌలర్లు. ఏ పిచ్ పైనైనా బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగల సామర్థ్యం వారికి ఉంది. ఈ రోజు వారి బంతులు బ్యాటర్లకు చుక్కలు చూపించాయి” అని అన్నాడు.
టాప్ ఆర్డర్ వైఫల్యంపై అసహనం..
ఢిల్లీ ఓటమికి ప్రధాన కారణం టాప్ ఆర్డర్ బ్యాటర్ల తొందరపాటేనని అక్షర్ అభిప్రాయపడ్డారు. “మా ఓపెనర్లు , టాప్ ఆర్డర్ బ్యాటర్లు కాస్త ఓపికగా ఆడి ఉంటే ఫలితం మరోలా ఉండేది. ఆరంభంలో వారు స్వింగ్‌ను గౌరవించి ఉంటే.. తర్వాత స్కోరు పెంచే అవకాశం ఉండేది. కానీ వరుస వికెట్లు పడటంతో మిడిల్ ఆర్డర్‌పై విపరీతమైన ఒత్తిడి పెరిగింది” అని విశ్లేషించాడు. ప్రస్తుతం ఢిల్లీ ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే మిగిలిన మ్యాచుల్లో అద్భుతాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆర్సీబీ బౌలింగ్‌కు దాసోహమైన ఢిల్లీ, తన లోపాలను సరిదిద్దుకుని తదుపరి మ్యాచ్‌కు సిద్ధం కావాలని అక్షర్ ఆశాభావం వ్యక్తం చేశారు.




