ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలోని బేతుపల్లి చెరువు వద్ద తీవ్ర దిగ్భ్రాంతికర ప్రమాదం చోటుచేసుకుంది. చెరువులో చిక్కుకుపోయిన మత్స్యకారులను కాపాడేందుకు వెళ్లిన రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF) సిబ్బంది ప్రమాదంలో చిక్కుకున్నారు. రక్షణ చర్యలు చేపడుతుండగా ఎస్డీఆర్ఎఫ్కు చెందిన రెండు బోట్లు అలుగు (మత్తడి) నీటి ఉధృతికి కొట్టుకుపోయాయి.
మత్స్యకారుల రక్షణకు వెళ్లి..
స్థానిక సమాచారం ప్రకారం.. బేతుపల్లి చెరువు నీటి ప్రవాహంలో ఎనిమిది మంది మత్స్యకారులు చిక్కుకుపోయారు. వారిని సురక్షితంగా ఒడ్డుకు తీసుకురావడానికి ఎస్డీఆర్ఎఫ్ బృందం వెంటనే రంగంలోకి దిగింది. నిరంతర శ్రమతో ముందుగా ముగ్గురు మత్స్యకారులను రెస్క్యూ టీమ్ సురక్షితంగా కాపాడి ఒడ్డుకు చేర్చింది.
అలుగులో కొట్టుకుపోయిన రెండు బోట్లు
మిగిలిన ఐదుగురు మత్స్యకారులను కాపాడేందుకు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది మళ్లీ చెరువులోకి వెళ్లిన సమయంలో తీవ్రమైన నీటి ప్రవాహానికి అదుపుతప్పిన రెండు బోట్లు అలుగులో కొట్టుకుపోయాయి. ప్రమాద సమయానికి ఆ రెండు బోట్లలో కలిపి మొత్తం 11 మంది ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.
మరో బోటుతో గాలింపు చర్యలు ముమ్మరం
అల్పపీడన ప్రభావంతో నీటి ప్రవాహం ఉధృతంగా ఉండటంతో రెస్క్యూ చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. నీటిలో కొట్టుకుపోయిన ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు మిగిలిన మత్స్యకారులను కాపాడేందుకు అధికారులు మరొక బోటు సహాయంతో గాలింపు చర్యలను తీవ్రతరం చేశారు. ఈ ఘటనతో స్థానిక ప్రజలు , వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. స్థానిక యంత్రాంగం , పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితులను నిరంతరం సమీక్షిస్తున్నారు.




