Hyderabad: హైదరాబాద్ ఐటీ కారిడార్ పరిసరాల్లోని ప్రముఖ రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. తాజాగా మియాపూర్, మదినగూడ ప్రాంతంలోని జీఎస్‌ఎం (GSM) మాల్‌పై సైబరాబాద్ సీఎంసీ ఫుడ్ సేఫ్టీ బృందం మెరుపు దాడులు నిర్వహించింది. మాల్‌లోని పేరుగాంచిన బార్బెక్యూ నేషన్, చైనీస్ వాక్ రెస్టారెంట్లలో తనిఖీలు చేపట్టిన అధికారులు.. అక్కడ విస్తుపోయే నిజాలను గుర్తించి సదరు యాజమాన్యాలకు ఇంప్రూవ్‌మెంట్ నోటీసులు జారీ చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా మొదట జీఎస్‌ఎం మాల్‌లోని బార్బెక్యూ నేషన్ రెస్టారెంట్‌ను అధికారులు పరిశీలించారు. అక్కడ కనీసం ఎలాంటి లేబుల్స్ లేకుండా నిల్వ ఉంచిన బ్రౌనీస్, కుల్ఫీలను గుర్తించి వాటిని అక్కడికక్కడే పారవేయించారు. రెస్టారెంట్‌లో క్రమబద్ధంగా నిర్వహించాల్సిన ఫుడ్ టెస్టింగ్, పెస్ట్ కంట్రోల్ రికార్డులు ఏవీ అందుబాటులో లేకపోవడంపై అధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
అంతేకాకుండా, పండ్లను నిల్వ ఉంచే ప్రాంతంలో బొద్దింకలు తిరుగుతుండటం, వంటగదిలోని క్రేట్లు అపరిశుభ్రంగా మారడం, కూరగాయలు కోసే కటింగ్ బోర్డులు దెబ్బతిని ఉండటాన్ని అధికారులు గమనించారు. దీంతో ఈ రెస్టారెంట్‌కు హైజీన్ స్కోర్ కేవలం 79 శాతంగా నిర్ధారించి, లోపాలను సరిదిద్దుకోవాలంటూ నోటీసులు ఇచ్చారు. అదే మాల్‌లోని చైనీస్ వాక్ రెస్టారెంట్‌లోనూ ఫుడ్ సేఫ్టీ బృందం విస్తృతంగా తనిఖీలు చేసింది. ఇక్కడ కనీస నిబంధన అయిన ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ (FSSAI) లైసెన్స్‌ను కస్టమర్లకు కనిపించేలా ప్రముఖంగా ప్రదర్శించకపోవడాన్ని అధికారులు తప్పుపట్టారు. ఆహార పదార్థాల తయారీలో వాడే గుడ్లను కనీసం శుభ్రం చేయకుండానే నేరుగా వినియోగిస్తున్నట్లు గుర్తించి షాకయ్యారు. రైస్, నూడుల్స్ తయారు చేసే ప్రాంతంలో ఉన్న నీటి ట్యాపులు అత్యంత అపరిశుభ్రంగా దర్శనమిచ్చాయి. వీటితో పాటు ఫుడ్ టెస్టింగ్, ప్యాకేజింగ్ మెటీరియల్స్, సిబ్బందికి సంబంధించిన వార్షిక మెడికల్ ఫిట్‌నెస్ రికార్డులు ఏవీ అక్కడ లభ్యం కాలేదు. ఈ క్రమంలో చైనీస్ వాక్ రెస్టారెంట్‌కు 82 శాతం హైజీన్ స్కోర్ కేటాయించిన అధికారులు, తక్షణమే ఈ లోపాలన్నింటినీ సరిచేసుకోవాలంటూ ఇంప్రూవ్‌మెంట్ నోటీసు జారీ చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తప్పవని అధికారులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.




