Wife torture: భార్యలు, అత్తమామల వేధింపులకు బలవుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. బెంగళూర్‌లో జరిగిన అతుల్ సుభాష్ ఆత్మహత్య మొదలు అప్పటి నుంచి చాలా మంది భార్యల వేధింపుల వల్ల ఆత్మహత్యలకు పాల్పడ్డారు. తాజాగా, ఒడిశాకు చెందిన మరో వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు. తన భార్య వేధింపులు తట్టుకోలేక ఈ చర్యకు పాల్పడుతున్నట్లు తన బాధను వీడియోలో వెల్లడించారు. ఒడిశాలోని ఖుర్దాలో కదులుతున్న రైలు ముందు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. బాధితుడిని కుంభర్‌బస్తాకు చెందిన రామచంద్ర బర్జెనాగా గుర్తించారు.
ఆత్మహత్యకు ముందు తన భార్య రూపాలిపై ఆరోపణలు చేశారు. ‘‘ నేను రామచంద్ర బర్జెనా, నేను కుంభర్‌బస్తాలో నివసిస్తాను. నా భార్య కారణంగా నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను.’’ అని వీడియోలో చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. రామచంద్ర రూపాలిని వివాహం చేసుకున్నాడని, వీరికి ఒక కుమార్తె కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా రూపాలి తనను మానసికంగా వేధింపులకు గురిచేస్తోందని, ఇంట్లో అల్లర్లకు కారణమవుతుందని రామచంద్రం తీవ్ర భావోద్వేగంతో చెప్పాడు. విడాకులు ఇస్తానని తనను తన కుటుంబాన్ని బెదిరిస్తోందని వెల్లడించాడు.
ఈ సంఘటన తర్వాత రామచంద్ర తల్లిదండ్రులు కూడా భార్య, ఆమె కుటుంబం తమ కొడుకు ఆత్మహత్య చేసుకునేందుకు కారణమయ్యారని ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 108, 351(2), మరియు 3(5) కింద పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. తన కోడలు పదేపదే తన తల్లిదండ్రులకు ఇంటికి వెళ్లేదని, అడ్డు చెబితే తిట్టేదని రామచంద్ర తల్లి ఆరోపించింది. పెళ్లికి అయ్యే మొత్తం ఖర్చుని కూడా తమ కుటుంబమే భరించిందని, రూపాలి కుటుంబానికి రూ. 20 లక్షలు అప్పుగా ఇచ్చామని చెప్పింది. వారి పెళ్లి జరిగి రెండేళ్లు మాత్రమే అయిందని, అప్పటి నుంచి తన కొడుకును కోడులు చిత్ర హింసలు పెడుతూనే ఉందని ఆమె చెప్పింది.