బీజేపీ, అన్నాడీఎంకే పొత్తును ప్రకటించిన అమిత్ షా..
తమిళనాడు ప్రతిపక్ష పార్టీ అన్నాడీఎంకే, బీజేపీ మధ్య పొత్తు కుదిరింది. వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. మాజీ సీఎం ఎడప్పాడి పళని స్వామి నేతృత్వంలో రాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు చెప్పారు. చెన్నైలో జరిగిన విలేకరుల సమావేశంలో పొత్తుపై అమిత్ షా క్లారిటీ ఇచ్చారు. ఈ సమావేశంలో పళని స్వామి మాట్లాడుతూ.. రెండు పార్టీలు గతంలో పొత్తు పెట్టుకున్నాయి. రెండు పార్టీలు కలిసే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి వెళ్తామని చెప్పారు. అవసరమైతే రెండు పార్టీలు ‘‘కామన్ మినిమమ్ ప్రోగ్రామ్’’ని రూపొందిస్తామని అమిత్ షా చెప్పారు. అన్నాడీఎంకేకి ఎలాంటి షరతులు, డిమాండ్లు లేవని, ఆ పార్టీ అంతర్గత విషయాల్లో తాము జోక్యం చేసుకోమని, ఈ కూటమి ఎన్డీయేకి, అన్నా డీఎంకేకి రెండింటికి ప్రయోజనకంగంగా ఉంటుందని అమిత్ షా చెప్పారు.
మాజీ సీఎం కుటుంబ సభ్యులకు కూడా రక్షణ లేదు..
వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్యామల టీడీపీ-జనసేనపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. గత కొన్ని నెలలుగా ఈ రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలు సోషల్ మీడియాలో అనుచితంగా ప్రవర్తిస్తున్నారని, మహిళలను లక్ష్యంగా చేసుకుని వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. మహిళల పట్ల గౌరవం ఉందని చెప్పే వారే, వారికి ఇచ్చిన హామీలను వదిలేసినప్పుడే వారి నిజమైన స్వభావం బయటపడిందని మండిపడ్డారు. రాజ్యంలో పోలీస్ వ్యవస్థ ‘రెడ్ బుక్ రాజ్యాంగం’లో మునిగిపోతోందని, మాజీ ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు కూడా రక్షణ లేకుండా పోతుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవస్థను అడ్డం పెట్టుకుని టీడీపీ, జనసేన నాయకులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీల మహిళా నేతలపై బరితెగించి పోస్టులు పెట్టినా, వారికి కేసులు పెట్టడం లేదని, ఎందుకంటే వారిని టీడీపీ-జనసేనే పెంచి పోషిస్తున్నాయని ఆరోపించారు.
అలా చేయడం సిగ్గుగా అనిపించట్లేదా.. ఖుష్బూ ఫైర్..!
తమిళనాడులో దారుణమైన ఘటన జరిగింది. నెలసరి కారణంతో ఓ విద్యార్థినిని బయటే కూర్చోబెట్టి ఎగ్జామ్ రాయించడం సంచలనం రేపింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. దీనిపై తాజాగా నటి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు అయిన ఖుష్బూ స్పందించారు. తన రాష్ట్రంలో జరిగిన ఈ ఘటన తనను తీవ్రంగా కలిచి వేసిందన్నారు. నెలసరి పేరుతో స్టూడెంట్ ను అలా బయట కూర్చోబెట్టడం అస్సలు తట్టుకోలేకపోతున్నానని చెప్పుకొచ్చింది.
గోరంట్ల మాధవ్‌ను కోర్టుకు తరలింపు.. కేసు గురించి ఎస్పీ ఏమన్నారంటే?
చేబ్రోల్ కిరణ్‌ను తీసుకెళ్తున్న పోలీసు వాహనాన్ని అడ్డుపడ్డ ఈ కేసులో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌తో పాటు ఆరుగురిని అరెస్ట్ చేశారు. ఐదుగురు నిందితులను ముసుగేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. మరోవైపు.. గోరంట్ల మాధవ్‌ను పోలీసులు గుంటూరు కోర్టుకు తీసుకొచ్చారు. మాధవ్‌ను తొలుత నల్లపాడు పీఎస్ నుంచి గుంటూరు జీజీహెచ్‌కు తరలించిన పోలీసులు అక్కడ వైద్య పరీక్షలు చేయించారు. వైద్య పరీక్షల అనంతరం మాధవ్‌ను కోర్టుకు తీసుకొచ్చారు. అంతకు ముందు కోర్టుకు తీసుకెళ్తున్న గోరంట్ల మాధవ్ ను తిరిగి ఎస్పీ ఆఫీసుకు తీసుకొచ్చే ప్రయత్నం చేసినట్లు సమాచారం. ఎక్కడకు తీసుకెళ్తున్నారంటూ మరోసారి పోలీసులపై మాధవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ పోలీసులు తిరిగి కోర్టుకు తీసుకెళ్లారు. పోలీసులతో గోరంట్ల మాధవ్ వాగ్వాదానికి దిగారు. “నేను దేశానికి ఎంపీగా పని చేశా.. నేను ఏమైనా దోపిడీ దొంగనా?” అంటు కేకలు వేశారు.
మహిళల రక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది.. ఇదే ఉదాహరణ..
మహిళల పట్ల ఎన్డీఏ ప్రభుత్వం గౌరవంతో వ్యవహరిస్తోందని మంత్రి బాల వీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. మహిళల రక్షణకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని, చిత్తశుద్ధితో చర్యలు తీసుకుంటున్నదని ఆయన తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి భార్యపై కిరణ్ అనే వ్యక్తి చేసిన అనుచిత వ్యాఖ్యలను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నదని మంత్రి పేర్కొన్నారు. కిరణ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడమే కాకుండా వెంటనే అరెస్టు చేయించామని తెలిపారు. ఇలాంటి పైశాచికంగా ఆనందపడే పనులకు ప్రభుత్వంలో చోటు లేదని స్పష్టం చేశారు.
తమిళానికి స్టాలిన్ ఏం చేశారు.? బీజేపీ తమిళ భాష, సంస్కృతిని గౌరవిస్తుంది
శుక్రవారం చెన్నైలో బీజేపీ-అన్నాడీఎంకే పొత్తును అమిత్ షా అధికారికంగా ధ్రువీకరించారు. వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయబోతున్నట్లు వెల్లడించారు. విలేకరుల సమావేశంలో మాట్లాడిన అమిత్ షా, అధికార డీఎంకే ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ తమిళ భాష, తమిళ సంస్కృతిని గౌరవిస్తుందని, సీఎం స్టాలిన్ తమిళ భాష కోసం ఏం చేశారని ప్రశ్నించారు. డీఎంకే ప్రభుత్వం, స్టాలిన్ అవినీతికి పాల్పడ్డారని, తమిళ ప్రయోజనాలను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. ప్రొఫెషనల్ కోర్సుల్లో తమిళ మాధ్యమ విద్యను డీఎంకే అనుమతించడం లేదని అమిత్ షా విమర్వించారు. ఎన్డీయే ప్రభుత్వం ఉన్న ప్రతీ చోట, మెడిసిన్, ఇంజనీరింగ్ చదవడానికి మాతృబాష సిలబస్ అందుబాటులో ఉందని చెప్పారు. కానీ, మూడు సంవత్సరాలుగా స్టాలిన్‌ని తమిళభాషలో ప్రొఫెషనల్ కోర్సులు ప్రవేశపెట్టాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ ప్రభుత్వం విద్యాభ్యాస లక్ష్యంగా ప్రతి ఏడాది నిర్వహించే టెట్ (Teacher Eligibility Test) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఉపాధ్యాయులుగా ఉద్యోగం పొందాలనుకునే అభ్యర్థులకు ఇది ఎంతో కీలకమైన పరీక్ష. ఈ పరీక్ష ద్వారా పాఠశాలల ఉపాధ్యాయ పోస్టులకు అర్హత సాధించవచ్చు. ఈ ఏడాది టెట్ పరీక్షలు జూన్ 15 నుండి 30 మధ్య నిర్వహించనున్నారు. అధికారికంగా విడుదలైన షెడ్యూల్ ప్రకారం, ఈ నెల 15వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఆన్లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ జరుగుతుంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే అప్లికేషన్ ఫారాన్ని సమర్పించాల్సి ఉంటుంది.
సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం.. ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో
ఫ్యూచర్ సిటీ వరకు మెట్రోను విస్తరించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నిర్ణయించారు. అందుకు అవసరమైన తుది ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం కమాండ్ కంట్రోల్ సెంటర్ లో మెట్రో విస్తరణపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. సీఎంతో పాటు సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, శ్రీనివాసరాజు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, సీఎం ముఖ్య కార్యదర్శి వి.శేషాద్రి, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్, హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెట్రో రెండో దశ విస్తరణకు సంబంధించిన ప్రతిపాదనల పురోగతిని ముఖ్యమంత్రి ఆరా తీశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రావాల్సి ఉందని, ఇప్పటికే ఢిల్లీలో అధికారులను కలిసి సంప్రదింపులు జరిపినట్లు అధికారులు వివరించారు.
టీటీడీ గోశాలలో గోవుల మరణాల ప్రచారంపై మంత్రి నారా లోకేష్ రియాక్షన్..
గోవుల మరణాలపై జరుగుతున్న ప్రచారాన్ని మంత్రి నారా లోకేష్ ఖండించారు. “టీటీడీ గోశాలలో గోవుల మరణాలంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. దురుద్దేశపూరిత ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా, వాస్తవాలను టీటీడీ స్పష్టం చేసింది. తప్పుదోవ పట్టించేందుకు, రెచ్చగొట్టేందుకు వైసీపీ పురిగొల్పుతున్న తప్పుడు కథనాలను భక్తులు నమ్మొద్దు. రాజకీయ లబ్ధికోసం పవిత్ర సంస్థలపై అసత్యాలను ప్రచారం చేయడం సిగ్గుచేటు.” అని నారా లోకేష్ స్పష్టం చేశారు.
నాంపల్లి పోక్సో కోర్టు సంచలన తీర్పు.. నిందితుడికి 25 ఏళ్ల శిక్ష
నాంపల్లి లోని పోక్సో (POCSO) కోర్టు శుక్రవారం సంచలన తీర్పుని వెలువరించింది. 2023లో రాజ్‌భవన్ మక్త ప్రాంతంలో మైనర్ బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడిన నిందితుడు శ్రీనివాస్‌కు కోర్టు 25 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఈ కేసు తీర్పు ప్రకటనతో బాధిత కుటుంబానికి న్యాయం లభించిందన్న భావన నెలకొంది.
వివరాల ప్రకారం, 2023లో శ్రీనివాస్ అనే వ్యక్తి మైనర్ బాలికను సెల్‌ఫోన్ ఇస్తానని మాయ మాటలతో మభ్యపెట్టి తన ఇంటికి తీసుకెళ్లాడు. అనంతరం బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. బాలిక ప్రాణాలతో బయటపడిన తర్వాత, తల్లిదండ్రులు వెంటనే నాంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు (Section of IPC and POCSO Act) కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.
కేసు విచారణ సమయంలో కోర్టుకు అందిన ఆధారాలు, బాలిక ధైర్యంగా ఇచ్చిన వాంగ్మూలం, వైద్య నివేదికలు అన్ని నిందితుడిపై అభియోగాలను నిరూపించాయి. పోక్సో చట్టం కింద ఈ కేసును విచారించిన నాంపల్లి ప్రత్యేక కోర్టు, నేరం నిరూపితమైందని తేల్చి, శ్రీనివాస్‌కు 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అంతేకాకుండా, నిందితుడిపై జరిమానా కూడా విధించింది.