Tilak Varma: హైదరాబాద్‌కు చెందిన యువ క్రికెటర్ తిలక్ వర్మ తన అద్భుతమైన బ్యాటింగ్‌తో ముఖ్యంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL), టి20 లలో ప్రత్యేక గుర్తింపు పొందిన ఆటగాడు. 2022లో ముంబై ఇండియన్స్ తరఫున ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన తిలక్ తన దూకుడు, స్థిరతతో చాలామంది అభిమానులను సంపాదించాడు. ఇకపోతే ఐపీఎల్ 2025లో భాగంగా బుధవారం నాడు హైదరాబాదులోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడబోతున్నాయి. ఈ నేపథ్యంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో భాగంగా తెలుగు కుర్రాడు, ముంబై ఇండియన్స్ ఆటగాడు తిలక్ వర్మ మీడియా సమావేశంలో ఆసక్తికరమైన అంశాలను పంచుకున్నాడు.
ఇటీవల లక్నో సూపర్ జెయింట్స్ (LSG) తో జరిగిన మ్యాచ్ సందర్భంగా జరిగిన ఘటనపై తిలక్ వర్మ కాస్త భావోద్వేగంగా స్పందించాడు. ఆ మ్యాచ్‌లో నన్ను ‘రిటైర్డ్ హర్ట్’గా తిరిగి రమ్మన్నప్పుడు చాలా బాధ పడ్డానని తెలిపాడు. ఎందుకంటే, ఆ సమయంలో ‘నేను ఉండి ఉంటే మ్యాచ్ గెలిపించే వాడినని’ అనిపించిందని తెలిపారు. కానీ, అదే సమయంలో టీమ్ మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయం అది. దానిపై ఏమీ అనలేకపోయా అని తిలక్ తెలిపాడు.
బుధవారం ఉప్పల్‌లో జరగనున్న మ్యాచ్‌పై తిలక్ విశ్వాసం వ్యక్తం చేశాడు. ఉప్పల్ మంచి బ్యాటింగ్ పిచ్. నాకు ఇది సొంత గడ్డ. రేపు పెద్ద స్కోర్ చేయగలగుతాను అన్న కాన్ఫిడెన్స్ ఉంది అని తెలిపాడు. ఇక్కడ ఆడటం అంటే విపరీతమైన ఎమోషన్ ఉంటుంది. అది కూడా అపోసిట్ టీమ్‌తో అయినప్పుడు.. ఈ మైదానంపై నేను ప్రాక్టీస్ చేశాను.. నా కెరియర్ రోజుల్లో ఇక్కడే ఆడాను.. ఆ ఎమోషన్ వేరు అంటూ తిలక్ తన మనసులో మాటను వ్యక్తం చేశాడు.