Thalapathy Vijay Cabinet Ministers and Portfolios: తమిళనాడులో రాజకీయ చరిత్రలో కొత్త అధ్యాయం ప్రారంభంకానుంది. తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత, ప్రముఖ నటుడు తలపతి విజయ్ ఈరోజు తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం ఘనంగా జరగనుంది. విజయ్‌తో పాటు 9 మంది మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గ శాఖల కేటాయింపును ముందుగానే ఖరారు చేశారు.
టీవీకే ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ సాధించడంతో, వీసీకే మరియు ఐయూఎంఎల్ మద్దతుతో విజయ్ అధికారంలోకి వస్తున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత సీఎం అభ్యర్థిపై ఉత్కంఠ నెలకొన్నప్పటికీ, చివరికి విజయ్‌కే గవర్నర్ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇచ్చారు.
విజయ్ కేబినెట్లో శాఖల కేటాయింపు
* సీఎం విజయ్ – హోం, ప్రజాపాలన శాఖలు
* ఆధవ అర్జున్ – క్రీడలు, ఎక్సైజ్ శాఖ
* సెంగొట్టాయన్ – పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (PWD)
* వెంకట్రామన్ – పాఠశాల విద్యాశాఖ
* ఎన్. ఆనంద్ – మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్
* CTR నిర్మల్ కుమార్ – విద్యుత్ శాఖ
* రాజమోహన్ – ఆదిద్రవిడ సంక్షేమ శాఖ
* అరుణ్ రాజ్ – కమర్షియల్ ట్యాక్సెస్ & రిజిస్ట్రేషన్ శాఖ
అయితే ఎస్. కీర్తన, టీకే ప్రభులకు ఇంకా శాఖలు కేటాయించలేదు. అసెంబ్లీలో బల నిరూపణ పూర్తయ్యాక కేబినెట్ విస్తరణ జరిగే అవకాశముందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
గ్రేటర్ చెన్నైకు అధిక ప్రాధాన్యం
ఈ కేబినెట్లో గ్రేటర్ చెన్నై పరిధిలో గెలిచిన ఐదుగురికి మంత్రి పదవులు దక్కడం విశేషం. పట్టణాభివృద్ధి, యువత, విద్య, మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టితో విజయ్ తన తొలి కేబినెట్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది. ఇక, వాస్తవానికి విజయ్ మధ్యాహ్నం 3:45 గంటలకు ప్రమాణస్వీకారం చేయాల్సి ఉండగా, జ్యోతిష్యుడి సూచన మేరకు ఉదయం 10 గంటలకు కార్యక్రమం నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున అభిమానులు, పార్టీ కార్యకర్తలు తరలివస్తున్నారు.
రాహుల్ గాంధీ హాజరు
ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ హాజరుకానున్నారు. అలాగే సంప్రదాయం ప్రకారం పదవీ విరమణ చేస్తున్న మాజీ సీఎం ఎం.కె. స్టాలిన్‌కు కూడా ఆహ్వానం పంపారు. మరోవైపు.. మే 9న విజయ్ తమిళనాడు గవర్నర్‌ను కలిసి, టీవీకే శాసనసభా నాయకుడిగా ఎన్నికైనట్లు లేఖ సమర్పించారు. అనంతరం గవర్నర్ ఆయనను ముఖ్యమంత్రిగా నియమిస్తూ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆహ్వానించారు. మే 13లోపు లేదా అంతకంటే ముందుగా అసెంబ్లీలో విశ్వాస తీర్మానం పొందాలని గవర్నర్ సూచించారు.




