వేసవి ఉష్ణోగ్రతలు అమాంతం పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో 41 డిగ్రీలు దాటి నమోదవుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే ఎండకు బయటకు రావాలంటే జనం జంకుతున్నారు. తేమ శాతం తగ్గిపోవడంతో ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వేడి తీవ్రత వడదెబ్బకు దారి తీసే ప్రమాదముంది. చాలామంది చల్లని పదార్థాలను తీసుకునేందుకు ఇష్టపడతారు. ఎండాకాలంలో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు, శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నవారు, శారీరక శ్రమ చేసే కార్మికులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వడదెబ్బబారిన పడకుండా సాధ్యమైనంత వరకు నీడలో ఉండేలా చూసుకోవాలని, ఆహార నియమాలు, వస్త్రధారణ మార్పులు, శారీరక శ్రమను తగ్గించుకోవడం వంటి జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు.
READ MORE: Maruti eVitara: మారుతి నుంచి తొలి ఎలక్ట్రిక్ కారు వచ్చేస్తోంది.. సింగిల్ ఛార్జ్ తో 500 KM రేంజ్
పారిశ్రామిక, ఆర్టీసీ, ఉపాధి, వ్యవసాయ, ఇతర రంగాల కార్మికులు ఎండ ప్రదేశాల్లో పని చేయాల్సి ఉంటుంది. వీరంతా శారీరక రక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. పలుచని కాటన్ దుస్తులు ధరించాలి. సరైన భోజనం తీసుకుంటూ శక్తిని కాపాడుకోవాలి. ప్రొటీన్లు, ఐరన్, కాల్షియం కలిగిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. మసాలాలు, చక్కెర, ఉప్పు తగ్గించాలి. శరీర నొప్పులను తగ్గించుకునేందుకు తగినంత విశ్రాంతి తీసుకోవడం, వ్యాయామాలు చేయడం మంచిది. అతి చల్లని పదార్థాలు తీసుకుంటే దుష్ప్రభావాలు తప్పవు. శరీర ఉష్ణోగ్రతలకు అనుగుణంగా వాటిని తీసుకోవాలి. శీతల పానీయాలు, ఐస్‌క్రీములు తాత్కాలికంగా చల్లదనాన్ని కలిగించినా గొంతు ఇన్‌ఫెక్షన్లు, జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. చల్లదనాన్ని కలిగించే కొబ్బరి నీరు, మజ్జిగ, బత్తాయి, ద్రాక్ష పండ్ల రసాలు, అరటి పండ్లు ఆరోగ్యానికి శ్రేయస్కరం.
READ MORE: Kamal Haasan : ఆ ఇద్దరూ నాకు ఐలవ్ యూ చెప్పలేదు.. కమల్ హాసన్ షాకింగ్ కామెంట్స్..
వేసవిలో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు ఆహారం, జీవన శైలిలో మార్పులు చేసుకోవాలి. పండ్లు, కూరగాయలు, తేలికపాటి ఆహారం తీసుకోవాలి. నిత్యం తగినంత నీరు తాగాలి. పొగ, మద్యం తాగడం వల్ల ఆరోగ్యంపై ప్రభావం ఉంటుంది. రక్తపోటు, మధుమేహం, గుండె, ఊపిరితిత్తుల సంబంధిత ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటూ నివారణ చర్యలు తీసుకోవాలి. ఒత్తిడిని తగ్గించుకునేందుకు ధ్యానం, యోగా అభ్యాసం చేయాలి. నిద్ర సరిపోయేలా చూసుకోవాలి. శ్వాస సంబంధిత బాధితుల్లో ధూళి, పొగ, రసాయనాల కారణంగా ఊపిరితిత్తులు బలహీనపడే ప్రమాదం ఉంది. బహిరంగ ప్రదేశాల్లో ఎక్కువ సమయం గడపకుండా జాగ్రత్తపడాలి.