Story Board: సంచలనం సృష్టించిన సినీ నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు ఇచ్చేసింది. కానీ రెండు దశాబ్దాల కాలంగా విచారణ జరగడంపై చర్చ జరుగుతోంది. ఈ కేసులో హైకోర్టు విధించిన జైలుశిక్షను సవాల్ చేస్తూ నిందితుడు గుడిపల్లి సిద్ధార్థరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. నిందితుడికి గతంలో హైకోర్టు ఖరారు చేసిన శిక్షను సమర్థించిన సుప్రీం ధర్మాసనం.. సిద్ధార్థరెడ్డి నాలుగు వారాల్లో లొంగిపోవాలని ఆదేశించింది.
2002 ఫిబ్రవరి 23న ప్రత్యూష, తన ప్రియుడు సిద్ధార్థ్ రెడ్డితో కలిసి పురుగుల మందు సేవించిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రత్యూష మరణించగా, సిద్ధార్థ్ ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రత్యూష ఆత్మహత్యకు సిద్ధార్ధ్‌రెడ్డే కారణమంటూ ఆమె తల్లి సరోజిని దేవి చేసిన ఫిర్యాదుతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. ప్రత్యూషని అత్యాచారం చేసి చంపేశారని అప్పట్లో వార్తలు రాగా పోస్టుమార్టం చేసిన వైద్యులు దాన్ని ధ్రువీకరించలేదు. ప్రత్యూష మరణించింది విషం వల్ల కాదని, ఎవరో బలంగా ఆమె గొంతు నులిమితే ఊపిరాడక చనిపోయినట్లు నాడు ఓ ఫోరెన్సిక్ నివేదిక బయటకొచ్చింది. దీంతో నటిపై హత్య జరిగిందంటూ ప్రచారం జరిగింది. మరోవైపు ప్రత్యూష చనిపోయేముందు ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేయకపోవడం కూడా పలు అనుమానాలకు తావిచ్చింది. ఈ క్రమంలోనే నాటి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనపై దర్యాప్తునకు ఓ వైద్యుల బృందాన్ని నియమించింది. ఈ బృందం కేసును పరిశీలించి ప్రభుత్వానికి ఓ నివేదిక సమర్పించింది. పురుగులమందు కారణంగానే ప్రత్యూష మరణించారని.. ఊపిరాడకుండా చేయడం, మరణానికి ముందు ఆమెపై లైంగిక దాడి వంటివి జరగలేదని తేల్చింది. దీని ఆధారంగా దర్యాప్తు జరిపిన సీబీఐ.. నిందితుడు సిద్ధార్థరెడ్డి ఆత్మహత్యకు ప్రేరేపించాడన్న నేరం కింద అతనిపై అభియోగాలు నమోదు చేసింది.
ప్రత్యూష, సిద్దార్ఢ్ రెడ్డి ఇద్దరూ ఇంటర్ కాలేజీలో ప్రేమించుకున్నారు. ఆ తర్వాత ప్రత్యూష సినిమాల్లోకి వెళ్లిపోగా.. సిద్ధార్ధ్ ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాడు. 2002లో హఠాత్తుగా ఒక రోజు వీరిద్దరూ కూల్ డ్రింక్ లో విషం కలిపి తాగిన పరిస్ధితుల్లో ఆస్పత్రిలో చేరారు. అక్కడ ప్రత్యూష చనిపోగా.. సిద్ధార్ధ్ బతికిపోయాడు. అయితే పోలీసుల దర్యాప్తులో ఆమెపై సిద్ధార్ధ్ ఎలాంటి లైంగిక దాడీ చేయలేదని, చంపలేదని తేలింది. అయితే ఆత్మహత్యకు పురికొల్పిన కేసులో అతన్ని సీబీఐ కేసులు నమోదు చేసింది. చివరకు ఈ అభియోగాల ఆధారంగా సెషన్స్ కోర్టు సిద్ధార్ధ్ రెడ్డిని దోషిగా నిర్దారించింది. సిద్దార్ధ్ రెడ్డికి ఐదేళ్ల జైలుశిక్షతో పాటు 5 వేల జరిమానా కూడా విధించారు. దీనిపై అతను 2011లో హైకోర్టును ఆశ్రయించగా.. శిక్షను రెండేళ్లకు తగ్గించారు. జరిమానాను 50 వేలకు పెంచారు. దీన్ని సవాల్ చేస్తూ ప్రత్యూష తల్లి సరోజిని 2012లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. హైకోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షను సమర్థించింది. అతను నాలుగు వారాల్లోగా పోలీసుల ముందు లొంగిపోవాలని ఆదేశాలు ఇచ్చింది.
ఈ సందర్భంగా ప్రత్యూష తల్లి సరోజినీ దేవి సుప్రీం తుది తీర్పుపై స్పందించారు. సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తున్నప్పటికీ, తన కూతురికి పూర్తి న్యాయం జరిగిందని మాత్రం నమ్మలేనని ఆమె తెలిపారు. పూర్తి ఆధారాలు వెలుగులోకి వచ్చి ఉంటే నిందితుడికి ఖచ్చితంగా జీవిత ఖైదు పడేదని ఆమె అభిప్రాయపడ్డారు. మునిస్వామి నివేదికను కోర్టులు పరిగణలోకి తీసుకోలేదని, త్రిసభ్య కమిటీ నివేదికకే ప్రాధాన్యం ఇచ్చారని చెప్పారు. నిజాలను దాచిపెట్టే ప్రయత్నం జరిగిందని కూడా ప్రత్యూష తల్లి ఆరోపించారు. నటి ప్రత్యూష, సిద్ధార్థరెడ్డి హైదరాబాద్‌లో ఇంటర్మీడియట్ చదువుతున్న సమయం నుంచి ప్రేమించుకున్నారు. ఆ తర్వాత ప్రత్యూష సినీ రంగంలో స్థిరపడగా, సిద్ధార్థరెడ్డి ఇంజినీరింగ్‌లో చేరాడు. అయితే 2002 ఫిబ్రవరి 23న వీరిద్దరూ విషం తాగిన స్థితిలో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. మరుసటి రోజు అంటే ఫిబ్రవరి 24న చికిత్స పొందుతూ ప్రత్యూష మరణించగా, సిద్ధార్థరెడ్డి కోలుకుని మార్చి 9న డిశ్చార్జి అయ్యాడు. కూల్‌డ్రింక్‌లో పురుగుమందు కలుపుకుని తాగడం వల్లే ప్రత్యూష మరణించినట్లు వైద్య పరీక్షల్లో తేలింది. అప్పట్లో ఆమెపై లైంగిక దాడి జరిగిందన్న ఆరోపణలు వచ్చినప్పటికీ.. ప్రభుత్వం నియమించిన వైద్య బృందం వాటిని తోసిపుచ్చింది. అయితే ఈ కేసును దర్యాప్తు చేసిన సీబీఐ.. సిద్ధార్థరెడ్డిపై ఆత్మహత్యకు పురికొల్పడం, ఆత్మహత్యకు యత్నించడం వంటి సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేసింది. దీనిపై విచారణ జరిపిన హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు 2004లో ఆయనకు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. అనంతరం సిద్ధార్థరెడ్డి హైకోర్టును ఆశ్రయించగా, 2011లో కోర్టు ఆ శిక్షను రెండేళ్లకు తగ్గిస్తూ జరిమానాను పెంచింది. ఈ తీర్పుపై ఇటు సిద్ధార్థరెడ్డి, అటు ప్రత్యూష తల్లి సరోజినీదేవి 2012లో సుప్రీంకోర్టులో అప్పీలు చేశారు. సుదీర్ఘ కాలం పాటు సాగిన ఈ న్యాయపోరాటంలో అన్ని అంశాలను పరిశీలించిన సుప్రీంకోర్టు, చివరకు హైకోర్టు విధించిన శిక్షనే ఖరారు చేస్తూ ఈ సంచలన తీర్పును వెలువరించింది.
ప్రత్యూష హీరోయిన్ గా తన కెరీర్ పీక్ స్టేజిలో ఉన్నప్పుడు ఇంటర్మీడియట్ ఫ్రెండ్ అయిన సిద్దార్థ రెడ్డితో ప్రేమలో పడింది. సిద్దార్థ రెడ్డి ఫ్యామిలీ వారి ప్రేమను అంగీకరించకపోవడంతో ప్రత్యూష, సిద్దార్థ రెడ్డి ఇద్దరూ ఫిబ్రవరి 23, 2002లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో సిద్దార్థరెడ్డి ప్రాణాలతో బయటపడగా.. ప్రత్యూష మరణించింది. ఈ క్రమంలో ప్రత్యూషను ఆత్మహత్యకు ప్రేరేపించిన సిద్దార్థ రెడ్డికి ఐదేళ్ల జైలు శిక్ష పడింది. అయితే, 2011లో శిక్షను రెండేళ్లకు తగ్గించింది కోర్టు. కోర్టు తీర్పుతో నిరాశ చెందిన ప్రత్యూష తల్లి సరోజినీ దేవి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రత్యూషది ఆత్మహత్య కాదని.. ప్లాన్ చేసిన మర్డర్ అంటూ పిటిషన్లో పేర్కొంది సరోజినీ దేవి. సుమారు 24 ఏళ్ళ పాటు ఈ కేసు విచారణ జరిగిన తర్వాత ఇవాళ తుది తీర్పు వెల్లడించింది కోర్టు. సిద్దార్థరెడ్డి బెయిల్ పిటిషన్ ను కొట్టేసిన సుప్రీంకోర్టు.. హైకోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షను సమర్ధించింది. సిద్దార్థరెడ్డి నాలుగు వారాల్లో లొంగిపోవాలని ఆదేశించింది సుప్రీంకోర్టు.
సినీ నటి ప్రత్యూష… ఇప్పటి తరానికి ఈ పేరు తెలియకపోవచ్చు కానీ.. 90s లో కిడ్స్ కి పరిచయం అక్కర్లేని పేరు. చేసిన కొన్ని సినిమాలతోనే అప్పటి యూత్ గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకుంది ప్రత్యూష. ప్రత్యూష 1998లో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. బాలనటిగా ఇండస్ట్రీకి పరిచయమైన ప్రత్యూష ఆ తర్వాత అనతి కాలంలోనే హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించింది. కలుసుకోవాలని, రాయుడు, సముద్రం వంటి సినిమాలతో హీరోయిన్ గా తన సత్తా చాటింది ప్రత్యూష. తెలుగులోనే కాకుండా తమిళ్ లో కూడా పలు సినిమాల్లో నటించింది ప్రత్యూష. హీరోయిన్ గా కెరీర్ పీక్ లో ఉన్నప్పుడు ప్రత్యూష హఠాన్మరణం ఆమె కుటుంబంలోనే కాకుండా అభిమానులకు కూడా తీవ్ర విషాదం మిగిల్చింది.
గ్లామర్ వెలుగుల సినీ ప్రపంచంలో తెర వెనక చీకటి రహస్యాలెన్నో. స్క్రీన్ మీద నవ్వులు చిందిస్తూ అభిమానులను అలరించే నటీనటుల జీవితాల్లో.. ఎవరికీ తెలియని విషాదగాథలు దాగి ఉంటాయి. నటి ప్రత్యూషది కూడా అలాంటి కథే. తన అందమైన నవ్వుతో ఒకప్పుడు కుర్రకారు మనసును దోచుకున్న ఈ యువ నటి.. కెరీర్‌లో మంచి ఫామ్‌లో ఉన్నప్పుడే ప్రేమలో పడి ప్రాణాలు కోల్పోయింది. తెలంగాణ భువనగిరిలో పుట్టిన ప్రత్యూష చిన్నప్పటినుంచే హీరోయిన్ కావాలని కలలు కంది. అప్పట్లో జరిగిన ఓ టీవీ రియాల్టీ షోలో పాల్గొని మిస్ లవ్లీ స్మైల్ టైటిల్ గెలవడం ఆమె కెరీర్‌ను మలుపుతిప్పింది. ఆ గుర్తింపే ఆమెకు 1998లో రాయుడు సినిమాలో అవకాశం తెచ్చిపెట్టింది. అక్కడి నుంచి ఆమె తెలుగు, తమిళ భాషల్లో వరుసగా సినిమాలు చేసింది. కేవలం నాలుగేళ్లలోనే 12 సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ అయ్యే స్థాయికి చేరుకుంది. తెలుగులో శ్రీరాములయ్య, సముద్రం, స్నేహమంటే ఇదేరా, కలుసుకోవాలని సినిమాల్లో అలరించింది.
1998లో మోహన్ బాబు నటించిన రాయుడు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఇందులో మోహన్ బాబు కూతురిగా కనిపించింది. ఆ సమయంలోఆమె వయసు కేవలం 18 సంవత్సరాలు మాత్రమే. మొదటి సినిమాతోనే నటిగా ప్రశంసలు అందుకుంది. ఈ మూవీ విడుదల కాకముందే మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అప్పట్లో అందం, అభినయంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. కేవలం రెండేళ్లల్లో ఆమె నటించిన మూడు సినిమాలు విడుదలయ్యాయి. తెలుగుతోపాటు తమిళంలోనూ ఆమెకు వరుస సినిమాలు క్యూ కట్టాయి. అప్పట్లో చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది ప్రత్యూష. కానీ ఆకస్మాత్తుగా ఆమె చనిపోయిందన్న మరణవార్త ఇండస్ట్రీని కుదిపేసింది. ప్రత్యూష మరణించినప్పుడు ఆమె వయసు కేవలం 22 సంవత్సరాలు మాత్రమే.
తెలుగు అమ్మాయిలు హీరోయిన్‌గా రాణించడం కష్టమైన పరిస్థితుల్లో ప్రత్యూష అన్ని సవాళ్లని దాటుకుని హీరోయిన్‌గా నిలబడింది. అప్పుడప్పుడే ప్రత్యూష స్టార్ హీరోయిన్‌గా ఎదుగుతోంది. తెలుగులోనే కాదు, తమిళంలోనూ సినిమాలు చేసి మెప్పించింది ప్రత్యూస. అక్కడ దాదాపు ఆరు సినిమాలు చేసింది. అవి కూడా విశేష ఆదరణ పొందాయి. మొత్తం మీద సినీ వినీలాకాశంలో ధృవతారగా వెలగాలనుకున్న ఓ మధ్యతరగతి అమ్మాయి ఆశలకు మధ్యలోనే శుభం కార్డు పడిపోయింది. ప్రత్యూష కేసును హైప్రొఫైల్ కేసుగా తీసుకుని రెండు దశాబ్దాలకు ముందు నుంచీ దర్యాప్తు జరిగినా.. దర్యాప్తు దగ్గర్నుంచి విచారణ.. ప్రతి దశలోనూ జాప్యం జరిగింది. ఇక సాక్ష్యాధారాలు, విచారణ జరిగిన తీరు, ఆఖరుకి పోస్ట్ మార్టం, ఆ తర్వాత వైద్యుల బృందం నివేదిక ఇలా ప్రతి అంశం హాట్ టాపిక్ అయింది. చివరకు న్యాయస్థానాల్లో కూడా బాగా ఆలస్యం జరగడంతో.. ప్రత్యూష కేసులో నిందితుడికి శిక్ష పడటానికి ఇంతకాలం పట్టింది. ఇప్పటికీ ఫ్యాన్స్ మనసులో ఆ నవ్వుల రాణి అలానే ఉంది. గ్లామర్ ఫీల్డ్‌లో కనిపించే వెలుగుల వెనుక, ఊహించని చీకటి ఉంటుందని చెప్పడానికి ప్రత్యూష లైఫ్ ఒక ఎగ్జాంపుల్. ఆమె తల్లి కూడా కూతురి పేరు మీద ఛారిటీ ట్రస్ట్ రన్ చేస్తోంది.
దేశంలో న్యాయవ్యవస్థకు అత్యున్నతమైన బాధ్యత ఉంది. ప్రభుత్వాలు, పోలీసులపై నమ్మకం కోల్పోయే సామాన్యులు.. ఆశగా చూసేది కోర్టులవైపే. అలాంటి కోర్టులు కూడా విచారణలో జాప్యం చేస్తే.. ఇక న్యాయం కోసం ఎక్కడకు వెళ్లాలనే మౌలికపరమైన ప్రశ్న తెరపైకి వస్తోంది. సామాన్యులకు కూడా కోర్టు తీర్పు ఇచ్చిందంటే కచ్చితంగా న్యాయంగానే ఇస్తాయనే నమ్మకం ఉంది. అలాంటి నమ్మకం క్రమంగా సడలిపోతోందా అనే సందేహాలు వస్తున్నాయి. కొన్ని కేసుల్లో కోర్టులు ఇస్తున్న తీర్పులు.. పైకోర్టులో అందుకు విరుద్ధంగా వెలువడుతున్న తీర్పులు సామాన్యుల్లో అపోహలు, అనుమానాలు కలిగిస్తున్నాయి. కేసులు పెట్టే విషయంలో నిబంధనలు స్పష్టంగా ఉన్నా.. పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండంతో.. అసలైన క్రిమినల్స్ అయితే శిక్ష పడకుండా తప్పించుకుంటున్నారు. లేదంటే ఏళ్లు గడిచాక కానీ శిక్షలు ఖరారు కావడం లేదు.
కోర్టుల్లో కూడా న్యాయప్రక్రియలో జాప్యం జరగడాన్ని ఎవరూ హర్షించడం లేదు. పోలీసులు సరైన సాక్ష్యాలు ప్రవేశపెట్టకపోవడం, చాలా కేసుల్లో సాక్షులు అడ్డం తిరగడం, మరికొన్ని కేసుల్లో ఆధారాలు లేకపోవడం.. ఇలా కారణాలు ఏవైనా కేసుల విచారణ మాత్రం నత్తనడకన సాగుతోంది. దానికి ఇప్పుడు ప్రత్యూష కేసే మంచి ఉదాహరణ. ఇలాంటి కేసుల్లో విచారణలో చోటుచేసుకుంటున్న ఆలస్యం చూసి.. నేరగాళ్లు మరింతగా చెలరేగిపోతున్నారు. హత్య చేసినా, అత్యాచారం చేసినా ఏమౌతుందని బరితెగించి ప్రవర్తిస్తున్నారు. ఎలాగో కేసు ఇప్పట్లో తేలదు. మహా అయితే కొన్నాళ్లు జైల్లో ఉండి బెయిల్ మీదకు బయటకు రావచ్చనే ధీమాతో కనిపిస్తున్నారు. ఒకవేళ ఓ కోర్టులో శిక్షపడినా.. పై కోర్టుకు.. ఆ పై కోర్టుకు అప్పీల్‌కు వెళ్లే అవకాశంతో.. కేసు విచారణ మరింత జాప్యం జరుగుతోంది. ఈ లెక్కన పెండింగ్‌లో ఉన్న కేసులన్నీ తేలటానికి ఎంత సమయం పడుతుందో ఎవరి ఊహకూ అందటం లేదు.
కింది కోర్టు అయినా, పై కోర్టు అయినా.. సుప్రీంకోర్టు అయినా.. అందరికీ ఒకటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఉంది. ఓ కేసులో సెక్షన్లు మారవు. చేసిన అభియోగాలు మారవు, సాక్షులు మారరు. కానీ తీర్పులు మాత్రం మారిపోతున్నాయి. చాలా కేసుల్లో అది జరుగుతోంది కూడా. ఇప్పుడు ప్రత్యూష కేసులోనూ అదే జరిగింది. వంద మంది నేరస్తులు తప్పించుకున్నా పర్లేదు కానీ.. ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదనేది మన న్యాయవ్యవస్థ కట్టుబాటు. అందుకే ఏ జడ్జి అయినా ఓ వ్యక్తిని నేరస్తుడిగా కన్ఫర్మ్ చేసేముందు.. కేసును అన్నికోణాల్లోనూ విశ్లేషిస్తారు. దీని కోసం టైమ్ తీసుకోవడం తప్పేమీ కాదు. కానీ న్యాయం జరుగుతుందని అనిపించడం కాదు.. కనిపించాలి. మరి కోర్టుల్లో న్యాయం జరుగుతుందని అనిపించడమే కానీ.. కనిపిస్తుందా అంటే.. సమాధానం వెతుక్కోవాల్సిందే.
ఇన్ని చర్చలు అనవసరం. ఇన్ని విశ్లేషణలతో కూడా పని లేదు. ఏ కేసులో అయినా సహేతుక సమయంలో తీర్పులు వస్తున్నాయా.. లేదా అని ఎవరికి వారే ఆలోచించుకోవాలి. కేసు విచారణలో జరుగుతున్న అసాధారణ జాప్యమే సామాన్యులకు ఇన్‌స్టంట్ జస్టిస్‌పై నమ్మకం పెట్టుకునేలా చేస్తుందనే సంగతి ఇప్పటికైనా గుర్తించాలి. ఇప్పుడు ప్రత్యూష కేసు తీసుకుంటే ఇక్కడ తీర్పు కంటే.. రెండేళ్ల శిక్ష కోసం నిందితుడు 24 ఏళ్లు ఎదురుచూడాల్సి వచ్చింది. అటు కూతురు పోయిన దుఃఖాన్ని పంటిబిగువన భరిస్తూ.. ప్రత్యూష తల్లి గుండె దిటవు చేసుకుని సుదీర్ఘ న్యాయపోరాటం చేయాల్సి వచ్చింది. ఇంత టైమ్ తీసుకుని.. చివరకు ఏం మిగిలిందని రెండు పక్షాలూ తమను తామే ప్రశ్నించుకునేలా విచారణలో ఆలస్యం జరుగుతోంది. ఇప్పటికైనా కేసుల విచారణకు పట్టే సమయాన్ని తగ్గించాల్సిన అవసరం చాలా ఉంది.




