పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య క్రికెట్ సంబంధాలపై అనిశ్చితి నెలకొంది. ఇప్పటికే ఇరు దేశాల మధ్య దైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. 2008లో ముంబై పేలుళ్ల తర్వాత బీసీసీఐ పాకిస్థాన్‌ను నిషేదించింది. 2012-13 నుంచి ఇరు దేశాల మధ్య ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. ఐసీసీ టోర్నీలలో మాత్రమే ఇరు దేశాలు ముఖాముఖిగా తలపడుతున్నాయి. తాజా టెర్రర్ ఎటాక్ నేపథ్యంలో పాకిస్థాన్‌తో ఐసీసీ ఈవెంట్లలోనూ పాల్గొనకూడదన్న డిమాండ్స్ వినిపిస్తున్నాయి. టీమిండియాతో ఆడకపోతే పాకిస్థాన్‌కు పుట్టగతులుండవని, భారత్ జరిగే మ్యాచ్‌ల ద్వారా పాక్ క్రికెట్ బోర్డుకు కోట్లాది రూపాయలు వస్తున్నాయని, ఇకనైనా పాకిస్థాన్‌తో భారత్ పూర్తిగా సంబంధాలు తెంచుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
తాజాగా బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పహల్గాం ఉగ్రదాడిపై స్పందించారు. పాకిస్థాన్‌తో క్రికెట్ సంబంధాలను పూర్తిగా తెంచుకోవాలని బీసీసీఐని దాదా కోరారు. భారత్‌పై జరిపిన టెర్రర్ ఎటాక్‌కు గట్టిగా సమాధానమివ్వాలని విజ్ఞప్తి చేశారు. కోల్‌కతాలో విలేకరులతో మాట్లాడిన గంగూలీ.. ‘ప్రతి ఏడాది ఉగ్రదాడులు జరుగుతూనే ఉన్నాయి. ఉగ్రదాడులపై మనం కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. టెర్రరిజాన్ని ఏమాత్రం సహించేది లేదు. పాక్‌తో క్రికెట్ సంబంధాలను పూర్తిగా తెంచేసుకోవాలి. అది జరిగి తీరాల్సిందే. ఈ విషయంలో వేరే ఆలోచన పెట్టుకోవద్దు’ అని దాదా సీరీయస్ అయ్యారు.
భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ద్వైపాక్షిక క్రికెట్ మ్యాచ్‌లు జరగడం లేదు. కేవలం ఐసీసీ టోర్నీలలో మాత్రమే ఇండో-పాక్ జట్లు తలపడుతున్నాయి. ఐసీసీ నిర్వహించే టీ20 ప్రపంచకప్, వన్డే ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్‌లలో మాత్రమే తలపడుతున్నాయి. భారత్ చివరిసారిగా 2008లో ఆసియా కప్ కోసం పాకిస్థాన్‌కు వెళ్లింది. తప్పనిసరి పరిస్థితుల్లో వన్డే ప్రపంచకప్ 2023 కోసం భారత్‌కు పాకిస్తాన్ వచ్చింది. ఇటీవల ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీని పాక్ నిర్వహించగా.. తటస్థ వేదికలో టీమిండియా ఆడిన విషయం తెలిసిందే.