RSS chief: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రవాద దాడితో భారతదేశం ఆగ్రహంతో ఉంది. 26 మంది అమాయకపు టూరిస్టుల్ని లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతమార్చారు. ముఖ్యంగా, మతం ఆధారంగా ఉగ్రవాదులు హిందువుల్ని టార్గెట్ చేసి మరీ చంపారు. కల్మా చదవమని, చదవని వారిని వెతికి మరీ పాయింట్ బ్లాంక్‌లో కాల్చి చంపారు. హిందువులను ఊచకోత కోశారు.
అయితే, ఈ ఘటనపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ స్పందించారు. ‘‘ఉగ్రవాదులు మతం గురించి అడిగిన తర్వాత ప్రజల్ని చంపారు. హిందువులు ఎప్పటికీ అలా చేయరు’’ అని ఆయన గురువారం అన్నారు. ‘‘యుద్ధం ధర్మానికి, అధర్మానికి మధ్య ఉంది. మా హృదయాల్లో బాధ ఉంది, కోపంగా ఉన్నాము. చెడును నాశనం చేయడానికి బలాన్ని చూపించాలి. రావణుడు కూడా తన బుద్ధిని మార్చుకోవడానికి నిరాకరించాడు, అతడికి మంచిగా మారాలని రాముడు సమయం ఇచ్చాడు. ఆ తర్వాతే అతడిని సంహరించాడు’’ అని అన్నారు.
మోహన్ భగవత్ మాట్లాడుతూ.. సమాజంలో ఐక్యత ఉంటే ఇలాంటి సంఘటనలు చేసేందుకు కూడా భయపడుతారని, హిందువుల ఐక్యతకు పిలుపునిచ్చారు. ఒకవేళ ఎవరైనా చేసినా, వారిని నాశనం చేస్తామని, పహల్గామ్ దాడికి బలమైన ప్రతిస్పందన ఉంటుందని ఆశిస్తున్నామని అన్నారు. ద్వేషం, శత్రుత్వం మన స్వభావంలో లేదని, కానీ నిశ్శబ్దాన్ని అలుసుగా తీసుకోవద్దని, నిజంగా అహింసావాది కూడా బలంగా ఉండాలని, అవసరమైనప్పుడు బలాన్ని చూపించాలని అన్నారు.