ఐపీఎల్ 2025లో ఎట్టకేలకు సొంతగడ్డపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) గెలుపు రుచిని చవిచూసింది. 18వ సీజన్‌లో భాగంగా గురువారం చిన్నస్వామి స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచులో ఆర్సీబీ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. 206 పరుగుల ఛేదనలో రాజస్థాన్ 9 వికెట్లకు 194 పరుగులే చేయలిగింది. ఐపీఎల్ 2025లో ఆరో విజయంను ఖాతాలో వేసుకున్న ఆర్సీబీ ప్లేఆఫ్స్‌కు చేరువైంది. మరో రెండు విజయాలు సాధిస్తే ప్లేఆఫ్స్ బెర్త్ దక్కించుకుంటుంది. మరోవైపు ఏడో ఓటమి చవిచూసిన రాజస్థాన్.. దాదాపుగా ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించినట్లే.
ఈ మ్యాచులో ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (70; 42 బంతుల్లో 8×4, 2×6), దేవదత్ పడిక్కల్ (50; 27 బంతుల్లో 4×4 3×6)లు హాఫ్ సెంచరీలు చేశారు. ఫీల్ సాల్ట్ (26; 23 బంతుల్లో 4×4) కీలక పరుగులు చేశాడు. సాల్ట్ త్వరగానే పెవిలియన్ చేరినా.. కోహ్లీ, పడిక్కల్ కలిసి పరుగుల వరద పారించారు. కొద్ది తేడాలో కోహ్లీ, పడిక్కల్, రజత్ పాటీదార్ (1) నిష్క్రమించడంతో.. 17 ఓవర్లలో 167/4తో ఆర్సీబీ నిలిచింది. చివరలో టిమ్ డేవిడ్ (23; 15 బంతుల్లో 2×4, 1×6), జితేశ్ శర్మ (20 నాటౌట్; 10 బంతుల్లో 4×4) బ్యాట్ ఝళిపించడంతో ఈ సీజన్‌లో తొలిసారి ఆర్సీబీ స్కోర్ 200 దాటింది. సందీప్ శర్మ రెండు వికెట్స్ పడగొట్టాడు.
ఛేదనలో రాజస్థాన్‌కు శుభారంభం దక్కింది. యశస్వి జైస్వాల్ (49; 19 బంతుల్లో 7×4, 3×6), వైభవ్ సూర్యవంశీ (16) ధనాధన్ బ్యాటింగ్‌తో అలరించారు. అయిదో ఓవర్లో వైభవ్, 6వ ఓవర్లో జైస్వాల్ నిష్క్రమించారు. నితీశ్ రాణా (28), రియాన్ పరాగ్ (22) ధాటిగా బ్యాటింగ్ చేయడంతో 9 ఓవర్లలో 110/2తో రాజస్థాన్ లక్ష్యం దిశగా సాగింది. అయితే పరాగ్‌ను కృనాల్ పాండ్యా ఔట్ చేయడం, స్పిన్నర్ సుయశ్ కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో రాజస్థాన్ పరుగుల వేగం తగ్గింది. రాణాను కూడా కృనాల్ అవుట్ చేయడంతో రాయల్స్‌పై ఒత్తిడి పెరిగింది. ధ్రువ్ జురెల్ (47; 34 బంతుల్లో 3×4, 3×6) ధాటిగా బ్యాటింగ్ చేసినా.. హెట్‌మయర్ (11) నిరాహపర్చాడు. చివరి రెండు ఓవర్లలో 18 పరుగులు చేయాల్సివుండగా.. ఆర్సీబీ బౌలర్లు అద్భుతం చేశారు. 19వ ఓవర్లో హేజిల్‌వుడ్ 2 వికెట్స్ తీసి ఒక్క పరుగే ఇచ్చాడు. ఆఖరి ఓవర్లో యశ్ దయాళ్ 5 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు.