ఐపీఎల్ 2026 లీగ్ దశ ముగింపు వేళ ప్లేఆఫ్స్ రేసు అత్యంత ఉత్కంఠభరితమైన మలుపులు తిరిగింది. వాంఖేడే స్టేడియంలో ముంబయి ఇండియన్స్‌తో జరిగిన అత్యంత కీలకమైన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ (RR) 30 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ప్లేఆఫ్స్‌లోకి దూసుకెళ్లింది. ఈ సీజన్‌లో ఆడిన 14 లీగ్ మ్యాచ్‌లలో రాజస్థాన్ 8 విజయాలు, 6 ఓటములతో మొత్తం 16 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో అధికారికంగా నాలుగో స్థానాన్ని ఖరారు చేసుకుంది. రాజస్థాన్ రాయల్స్ సాధించిన ఈ గెలుపుతో పంజాబ్ కింగ్స్ (PBKS) ప్లేఆఫ్స్ ఆశలు పూర్తిగా గల్లంతయ్యాయి. ముంబయి ఇండియన్స్ ఈ మ్యాచ్‌లో ఓడిపోవడమే కాకుండా.. తమతో పాటు పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్లను కూడా టోర్నీ నుంచి ఇంటికి తీసుకెళ్లినట్లయింది.
ఈ సీజన్ ముగింపు పాయింట్ల పట్టిక సమీకరణాలను పరిశీలిస్తే.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు చెరో 14 మ్యాచ్‌లలో 9 విజయాలు సాధించి 18 పాయింట్లతో మొదటి మూడు స్థానాల్లో నిలిచి ముందే ప్లేఆఫ్స్ బెర్త్‌లను ఖాయం చేసుకున్నాయి. ఇక మిగిలిన ఒకే ఒక్క నాలుగో స్థానం కోసం రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. లీగ్ దశలో తమ 14 మ్యాచ్‌లను పూర్తి చేసుకున్న పంజాబ్ కింగ్స్ 7 విజయాలు, 6 ఓటములు, ఒక మ్యాచ్ రద్దు కావడంతో (నో-రిజల్ట్) మొత్తం 15 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచింది. రాజస్థాన్ రాయల్స్ 16 పాయింట్లు సాధించడంతో, పంజాబ్ కేవలం ఒక్క పాయింట్ తేడాతో ప్లేఆఫ్స్ అవకాశాన్ని చేజార్చుకుని టోర్నీ నుంచి నిష్క్రమించింది.
లక్నోపై సెంచరీ బాది పంజాబ్‌ను రేసులో నిలిపిన కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (సర్పంచ్ సాబ్).. తమ ప్లేఆఫ్స్ బెర్త్ కోసం ముంబయి గెలవాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. లక్నో మ్యాచ్ అనంతరం ఆయన సరదాగా “రేపు ముంబయికి సపోర్ట్ చేయండి” అని పిలుపునిచ్చాడు. కానీ వాంఖేడే మ్యాచ్‌లో ముంబయి చేతులెత్తేయడంతో శ్రేయాస్ అయ్యర్ ఆశలు అడియాశలయ్యాయి. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు మీమ్స్, కామెంట్స్‌తో రచ్చ చేస్తున్నారు. “ముంబయి నమ్మకద్రోహం చేసింది”, “సర్పంచ్ సాబ్ ఆశలపై ముంబయి నీళ్లు చల్లింది” అంటూ నెటిజన్లు వ్యంగ్యంగా పోస్టులు పెడుతున్నారు. ముంబయి ఓటమితో పంజాబ్ కెప్టెన్ కల చెదిరిపోయిందంటూ నెట్టింట తెగ కామెంట్స్ వినిపిస్తున్నాయి. అలాగే 13 పాయింట్లతో ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్ ఆశలు కూడా ఈ ఫలితంతో పూర్తిగా ముగిసిపోయాయి.




