Pakistan: పహల్గామ్ దాడితో భారత్ తీవ్ర ఆవేదనలో ఉంది. కాశ్మీర్ అందాలను చూసేందుకు వెళ్లిన పర్యాటకుల్ని లక్ష్యంగా చేసుకున్న టెర్రరిస్టులు, 28 మంది కిరాతకంగా చంపారు. ఈ దాడి వెనక పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రసంస్థ లష్కరే తోయిబాకు చెందిన ‘‘టీఆర్ఎఫ్’’ ఉన్నట్లు తేలింది. మరోవైపు, పాకిస్తాన్ తమకు ఈ దాడితో సంబంధం లేదని చెబుతూనే, సరిహద్దుల్లో తన బలగాలను మోహరించింది. భారత్ మళ్లీ సర్జికల్ స్ట్రైక్స్ చేస్తుందనే భయంతో ఉంది.
ఇదిలా ఉంటే, పాకిస్తాన్ మాజీ మంత్రి చౌదరి ఫవాద్ హుస్సేన్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశం “దాడి చేసినా లేదా బెదిరించినా” దేశం తనను తాను రక్షించుకోవడానికి కలిసి నిలబడుతుందని అన్నారు. తాము రాజకీయం విభజించబడి ఉన్నప్పటికీ, దేశం కోసం ఒక్కటిగా నిలబడుతామని అన్నారు. తమ మాతృభూమిని రక్షించుకోవడానికి పాకిస్తాన్ జెండా కింద కలిసి ఉంటామని ఎక్స్ వేదికగా ఫవాద్ పోస్ట్ చేశాడు. అయితే, ఈ పోస్టులో పహల్గామ్ దాడి గురించి ఎలాంటి సంతాపం కానీ, ఖండన కానీ, ప్రస్తావన కానీ చేయలేదు.
ఉగ్రదాడి తర్వాత భారతదేశంలో నిరంతర పరిణామాలను పర్యవేక్షిస్తున్న ఫవాద్.. మోడీ ప్రభుత్వం నుంచి సంయమనం ఆశిస్తున్నట్లు మరో పోస్ట్‌లో పేర్కొన్నాడు. “భారత మంత్రివర్గం తన భద్రతా సమావేశాన్ని ముగించింది – యుద్ధానికి ఆజ్యం పోసేలా మీడియా కథనాలకు లొంగి లక్షలాది మంది ప్రాణాలను పణంగా పెద్దవద్దని ఆశిద్దాం’’ అంటూ ట్వీట్ చేశారు.
జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన ఉగ్రవాద దాడి, 2019లో పుల్వామా తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన అత్యంత దారుణమైన దాడిలో ఇది ఒకటి, మంగళవారం మధ్యాహ్నం అనంతనాగ్ జిల్లాలోని పహల్గామ్ పట్టణానికి సమీపంలోని ఒక గడ్డి మైదానం సమీపంలో జరిగింది. లష్కరే తోయిబా ప్రతినిధి సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) బాధ్యత వహించింది. దాడి వెనుక ఉన్న ముగ్గురు అనుమానితుల స్కెచ్‌లను భారత భద్రతా సంస్థలు విడుదల చేశాయి, వీరిని పాకిస్తాన్ జాతీయులైన ఆసిఫ్ ఫౌజీ, సులేమాన్ షా మరియు అబు తల్హాగా గుర్తించారు.