పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన దాడులకు వ్యతిరేకంగా జనసేన నిరసన కార్యక్రమాలు చేపట్టింది. మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించింది. మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ హరిప్రసాద్, ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. “ఉగ్రవాదుల దాడిని రాజకీయాలతో సంబంధం లేకుండా అందరూ ఖండించాలి.. దేశంలో ఎన్ని మతాలు, కులాలు ఉన్నా కలిసి వెళ్లే సంస్కృతి మన పెద్దలు నేర్పారు..
Also Read:Pahalgam terror attack: ఉగ్రవాదుల జాడ చెప్పిన వారికి రూ. 20 లక్షల నగదు బహుమతి..
మతం పేరుతో ఉగ్రవాదులు దాడి చేయడం దుర్మార్గం.. ఈ ఉగ్రవాదుల దాడి తెలుసుకుని మా అధినేత పవన్ కళ్యాణ్ చలించిపోయారు. దేశ భక్తితో ముక్త కంఠంతో మనమంతా కలిసి ముందుకు నడవాలని పవన్ కళ్యాణ్ చెప్పారు.. వారికి సంఘీభావంగా ఈరోజు కొవ్వొత్తుల ర్యాలీ, రేపు మౌన దీక్షలు, నిర్వహిస్తాం.. ఎల్లుండి పవన్ కళ్యాణ్ మానవహారంలో పాల్గొంటారు.. ప్రధాని మోడీ దేశం కోసం కాశ్మీర్ లో కొన్ని కార్యక్రమాలు చేశారు.. అవి చూసి కుట్రతో ఉగ్రవాదులు రెచ్చిపోయారు.. మూడు రోజుల కార్యక్రమాల్లో ఐక్యంగా కలిసి నడవాలని కోరుతున్నామని” తెలిపారు.