Off The Record: ఇంతకీ… విషయం ఏంటంటే….గోదావరి పుష్కరాల ప్రారంభానికి ఇక సరిగ్గా ఏడాది కాలం ఉంది. 2027 జూన్ 27న మొదలై….. 12 రోజుల పాటు జరుగుతాయి. ఆ సమయంలో పుణ్య స్నానాల కోసం దేశ విదేశాల నుంచి కనీసం 10 కోట్ల మంది యాత్రికులు వస్తారని అంచనా వేస్తున్నారు. అందుకు అవసరనమైన సదుపాయాల కల్పన కోసం ఏపీ ప్రభుత్వం 8వేల 500 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించింది. 7 వేల పనులను చేపట్టాలన్న ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. వచ్చే సెప్టెంబర్ నుంచి ఈ పుష్కర పనులు మొదలవబోతున్నాయి. దాంతో…. గోదావరి పరివాహక ప్రాంత ఎమ్మెల్యేలంతా ఇప్పుడీ బడ్జెట్‌ను టార్గెట్ చేశారట. సొంత కంపెనీలు, లేదా తమకు కావాల్సిన వాళ్ళకు కాంట్రాక్ట్‌లు ఇప్పించుకుని ఎంత వీలైతే అంత జేబులో వేసుకోవాలన్న ప్లాన్ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఎలాంటి అభ్యంతరాలు లేకుండా అలా జరిగిపోవాలంటే…. మంజూరు చేసే అధికారి మనవాడై ఉండాలని అనుకుంటున్నారట ఏడెనిమిది మంది ఎమ్మెల్యేలు. అలాంటి వాళ్ళని వెదికి వాళ్ళకు తమ ప్రాంతాల్లో పోస్టింగ్స్ ఇప్పించుకోవడానికి విపరీతంగా పైరవీలు చేస్తున్నట్టు తెలిసింది. ఆ క్రమంలో ఇప్పటికే కొందరికి పోస్టింగ్స్ వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. తమకు కావాల్సిన వాళ్ళని రప్పించుకోవడం కోసం ఇప్పుడున్న అధికారులు తయారు చేసిన ప్రతిపాదనలకు వంకలు పెడుతున్న ఎమ్మెల్యేలు సైతం ఉన్నారట.
పుష్కర పనుల్లో రూపాయికి వంద రూపాయలు సంపాదించవచ్చుననే ఆలోచనతో బినామీ కంపెనీల్ని సిద్ధం చేసుకున్న మహానుభావులు సైతం ఉన్నారట. మనం ఏం చేసినా… ఈ ఏడాదిలోనే సంపాదించుకోవాలి. వన్స్ ఫర్ ఆల్ సెటిలై పోవాలి. ఎన్నాళ్ళని ఆ ఇసుక, మట్టి తవ్వుకుని అల్లరైపోతాం…. పుష్క పనులైతే తక్కువ టైంలో ఎక్కువ వెనకేసుకోవచ్చు, పైగా పుష్కరాలు ముగిశాక వాటి నాణ్యత గురించి ఎవడు అడగొచ్చాడంటూ కొందరు ఎమ్మెల్యేలు ఇంటర్నల్‌గా మాట్లాడుకుంటున్నట్టు సమాచారం. మొత్తం 242 గ్రామాల్లో గోదావరి మహా పుష్కరాల పనులు చేపట్టాలని కూటమి ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇక పుష్కర బడ్జెట్లో ఎవరు ఎక్కువ నిధులు తెచ్చుకుంటే అంత ఎక్కువ మిగులుతుందన్న అభిప్రాయంతో ఉన్నారట శాసనసభ్యులు. అందుకే నాకే ఎక్కువ నిధులు ఇవ్వమంటూ ఎవరి స్థాయిలో వాళ్ళు యాక్టివ్‌గా ఉన్నట్టు సమాచారం. ఈ విషయంలో జనసేన ఎమ్మెల్యేలు అందరూ ఒక మాట మీద ఉన్నారట. టీడీపీ, బీజేపీ శాసనసభ్యులు మాత్రం ఎవరి లెక్క వారిదే అంటున్నట్టు తెలుస్తోంది. పుష్కర ఏర్పాట్లలో ఏ పని చేపట్టినా.. తక్కువలో తక్కువ 20 శాతం వాటా మిగులుతుందంటూ గత అనుభవాలను వివరిస్తున్నారట కొందరు. అందుకే ఎమ్మెల్యేలు ఎవరికి వారు తమ నియోజకవర్గాల్లో కొత్తగా మోడల్ స్నాన ఘట్టాలను నిర్మించాలని ప్రతిపాదిస్తున్నట్టు తెలుస్తోంది. యాత్రికులకు ఎటువంటి ఆసౌకర్యం కలగకుండా చెన్నైకి చెందిన క్రౌడ్ మేనేజ్మెంట్ సంస్థతో ప్రభుత్వం కొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేయించింది. అందులో సీతానగరం మండలం ముని కూడలి గ్రామంలో మోడరన్ స్నాన ఘట్టం నిర్మించాలని, కొవ్వూరు మండలం పెద్ద వాడపల్లి వద్ద రెండు కిలోమీటర్ల మేర స్నాన ఘట్టం ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.
అలాగే… అఖండ గోదావరి ప్రాజెక్టు కింద 94 కోట్లతో రాజమండ్రిలో రివర్ ఫ్రంట్, పుష్కర్ ఘాట్ అభివృద్ధి, హేవలాక్ బ్రిడ్జిని పాదచారులు వంతెనగా మలచడం వంటి పనులు చేస్తున్నారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పనులపై ప్రస్తుతం టిడిపి ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారు. తమ ప్రమేయం లేకుండా నాసిరకంగా పనులు చేస్తున్నారంటూ ఇద్దరు టిడిపి ఎమ్మెల్యేలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. మరోవైపు పూర్తి స్థాయిలో పనులు మొదలయ్యే టైంకి అధికారులంతా తమకు అనుకూలమైన వాళ్ళే ఉండేలా ఎమ్మెల్యేలంతా ఎవరికి వారు ప్రయత్నిస్తున్నారట. అన్ని పనులు తమకు కావాల్సిన కాంట్రాక్టు సంస్థలకే ఇప్పించుకుని కోట్ల రూపాయలు కొల్లగొట్టే పనిలో ఉన్నారనే ఆరోపణలు పెరుగుతున్నాయి. ఇక్కడే చాలా మందిలో ఆందోళన పెరుగుతోంది. వేల కోట్ల రూపాయల బడ్జెట్‌తో జరిగే పనుల విషయంలో రాజకీయ ప్రమేయం పెరిగితే… పనుల నాణ్యతా ప్రమాణాలను గాలికి వదిలేస్తారన్న భయాలు పెరుగుతున్నాయి. ఆ విషయంలో ప్రభుత్వ పెద్దలు ముందే జాగ్రత్త పడాలని అంటున్నారు జనం.




