Off The Record: నష్టం కలిగించే నాయకులను ఏ రాజకీయ పార్టీ ఉపేక్షించదు. కాస్త ముందో, వెనకో… తప్పకుండా యాక్షన్ ఉంటుంది. ఒకవేళ వెన్నుపోట్లు ఉన్నట్టు తెలిసినా… ఆ సంగతి బయటపడక ముందే జాగ్రత్తలు ఉంటాయి. కానీ…. పార్టీలందు కాంగ్రెస్ పార్టీ వేరయా అన్నట్టుగా ఉంటింది వ్యవహారం. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఆ సంగతి మరోసారి బయటపడింది. ఇక్కడ ఫుల్ రివర్స్‌లో ఉందట. మున్సిపల్ ఎన్నికల్లో ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ చెప్పిన వారికి కాకుండా తమకు నచ్చిన వారికే టిక్కెట్లు ఇచ్చుకున్నారు. దీనిపై పార్టీ రాష్ట్ర నాయకత్వం సీరియస్ గానే రియాక్ట్ అయ్యింది. ఎన్నికల ముందు గొడవ ఎందుకని అనుకున్నారో ఏమోగానీ… ఆ వ్యవహారాన్ని అప్పటికి వదిలేశారు. అంటే…ఎన్నికలు పూర్తయ్యాక చూద్దామన్నట్టు వాయిదా వేశారన్న మాట. కానీ…. ఇప్పుడు నష్ట పోయిన నేతలంతా.. దిద్దుబాటు చర్యల కోసం ఎదురు చూస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, తుంగతుర్తి MLA మందుల సామేల్‌తో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మరో శాసనసభ్యుడి మీద కూడా ఫిర్యాదులు వచ్చాయి. పార్టీ నాయకత్వం ఎంపిక చేసిన వారికి కాకుండా…తమకు నచ్చిన వారికి బీ ఫామ్స్ ఇచ్చారట సదరు శాసనసభ్యులు.
ఇది పార్టీని, నాయకత్వాన్ని మోసం చేయడమే అవుతుంది. ఇదే అంశం పై పిసిసి చీఫ్ మహేష్ గౌడ్… మీడియాతో మాట్లాడినప్పుడు సీరియస్‌గానే పరిగణిస్తున్నామని, సరైన సమయంలో నిర్ణయాలు ఉంటాయని ప్రకటించారు. ఐతే ఇప్పుడు ఎన్నికలు ముగిసి వారాలు గడుస్తున్నా… చర్యలు ఎక్కడంటూ వాయిస్ రెయిజ్ చేస్తున్నారు నష్టపోయిన నాయకులు. ఇటీవల తుంగతుర్తి నియోజక వర్గంలో మున్సిపల్ ఎన్నికల ఫలితాల పై ఎంపీ చామల కిరణ్ కొన్ని కామెంట్స్ చేశారు. తుంగతుర్తి తో పాటు జనగామ నియోజకవర్గంలో క్యాడర్‌కు, లీడర్స్‌కు గ్యాప్ ఉందని, ఇతరుల ఇన్ఫార్మర్స్ ఉన్నారంటూ కామెంట్ చేశారాయన. ఇది తీవ్రమైన అంశం. పార్టీ లో ఉంటూ..ప్రత్యర్ధి పార్టీకి ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నారంటే…. అలాంటి వాళ్ళు ఏదో ఓ రోజు పార్టీ పుట్టి ముంచేస్తారు. ఓ వైపు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బి ఫామ్స్ పార్టీ చెప్పిన వాళ్లకు కాకుండా మరొకరికి ఇవ్వడం.. సొంత పార్టీలోనే ఇన్ఫార్మర్లు ఉన్నారని స్థానిక ఎంపీ చెప్పినా… ఇప్పటి వరకు పార్టీ నాయకత్వం అటు వైపు కన్నెత్తి చూడకపోవడం ఏంటన్న చర్చ జరుగుతోంది కాంగ్రెస్ వర్గాల్లో. అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి…ఇప్పటికిప్పుడు ఇదేం పెద్ద సమస్య గా కనిపించక పోవచ్చు. కానీ సాధారణ ఎన్నికల నాటికి… చిన్న చిన్న సమస్యలు కూడా మెడకు పామై చుట్టుకుంటాయి.
ఇవే కాదు హైదరాబాద్ ను అనుకుని ఉన్న పటాన్‌చెరులో కూడా అంతే. పార్టీలో చేరిన ఎమ్మెల్యేల మహిపాల్ రెడ్డి ఆఖరి నిమిషంలో నేను బీఆర్‌ఎస్ అని ప్రకటించుకుని అక్కడ కాంగ్రెస్ నడ్డివిరిచారు. చేవెళ్ల లో కూడా కాంగ్రెస్ చెప్పిన వాళ్లకు కాకుండా సొంత వాళ్ళకే టికెట్ల ఇచ్చుకున్నారు. బయట నుండి వచ్చిన వాళ్ళు ఏం చేసినా పార్టీ నాయకత్వం ఎందుకు సైలెంట్ గా ఉందనేది కూడా క్యాడర్ కి అర్థం కాని పరిస్థితి. పార్టీకి నష్టం చేసిన వాళ్లపై చర్యలు ఉంటాయా..? ఉండవా..? అనేది మరో రచ్చ. పార్టీ రాష్ట్ర నాయకత్వం ఎలా ఉన్నా… ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ఏం చేస్తున్నట్టు..? పాత వారికి నష్టం జరిగితే ఊరుకునేది లేదని మీటింగుల్లో డైలాగులు వేస్తారు కానీ… ఇక్కడ పార్టీకే నష్టం జరుగుతున్నా… మీనాక్షి మేడం కనీసం కొరడా కూడా జులిపించడం లేదని గాంధీ భవన్ లో నేతలు చెవులు కొరుక్కుంటున్నారు.




