Off The Record: ఆ మంత్రిగారికి పోలీసులు అస్సలు సహకరించడం లేదా? మంత్రి అయితే మాకేంటి అన్నట్టుగా ఉన్నారా? చివరికి నియోజకవర్గంలో వైసీపీ నాయకులకు ఇచ్చిన గౌరవం కూడా రాష్ట్ర మంత్రికి ఇవ్వడం లేదా? చివరికి చేసేది లేక మినిస్టర్ కూడా పోలీసుల మీద నిరసన వ్యక్తం చేయడం మొదలుపెట్టారా? ఎవరా ఏపీ మంత్రి? ఏకంగా ఎస్కార్ట్ వద్దు, ఏం వద్దు దొబ్బేయండని ఆయన ఎందుకు అనాల్సి వచ్చింది?
Read Also: Supreme Court: మురికివాడలు కూల్చి విఐపిల కోసం రోడ్లు వేస్తారా..
పాలకొల్లు అసెంబ్లీ నియోజకవర్గం.. వరుసగా మూడోసారి ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు మంత్రి నిమ్మల రామానాయుడు. మినిస్టర్‌గా రాష్ట్ర రాష్ట్ర స్థాయిలో హవా నడిపిస్తున్నా… సొంత సెగ్మెంట్‌లో మాత్రం…. ఇంట్లో ఈగల మోత అన్నట్టుగా తయారైందట ఆయన పరిస్థితి. ఏం… ఆయనకేమైంది. ముచ్చటగా మూడుసార్లు జనం గెలిపించారు. క్షణం తీరికలేకుండా కష్టపడతారన్న పేరుంది. ఇపుడు కొత్తగా ఆయనకేం కష్టం వచ్చిపడిందన్న డౌట్ రావడం కామన్. ఆ అనుమానం సహజమేగని…. ఆయన సమస్య జనంతో కాదట. పాలకొల్లు పోలీసులు మంత్రిగారిని ముప్పు తిప్పలు పెట్టి 36 చెరువుల నీళ్ళు తాగిస్తున్నారట. అనేత సందర్భాల్లో మంత్రి చెబుతున్నదొకటి, పోలీసులు చేస్తున్నదొకటి అన్నట్టుగా మారుతోందట వ్యవహారం. లోకల్ పోలీసులు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా వ్యవహరించారో ఇప్పటికీ అలాగే ఉన్నారంటూ మంత్రి తీవ్ర అసహనంగా ఉన్నట్టు తెలుస్తోంది. నియోజకవర్గంలో జరుగుతున్న క్రికెట్ బెట్టింగ్ దందాను అడ్డుకోవాలని నిమ్మల ఆదేశించినా డోంట్ కేర్ అన్నట్టుగా ఉన్నారట స్థానిక పోలీసులు. అలాగే ఇటీవల జరిగిన యలమంచిలి ఎంపీపీ ఎన్నికలో సైతం పోలీసులు వైసీపీ నేతలకే ఎక్కువగా సహకరించారంటూ టీడీపీ నాయకులు ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది.
Read Also: Off The Record: గ్రేటర్ హైదరాబాద్ లో బీజేపీ సరికొత్త గేమ్ ప్లాన్ మొదలుపెట్టిందా..?
అయితే, ఎన్నికలు జరుగుతున్న సమయంలో వైసీపీ ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్‌ను మండలపరిషత్ కార్యాలయంలోకి పంపించడం, ఆయన సూచనలు పాటించడమే కాకుండా టిడిపికి చెందిన వాళ్ళని కనీసం అటువైపు కూడా రాకుండా చేశారని ఆరోపిస్తున్నారు పాలకొల్లు తమ్ముళ్ళు. వైసిపివారితో సౌమ్యంగా, టీడీపీ నేతలతో దురుసుగా వ్యవహరించినట్టు చెప్పుకుంటున్నారు. అదంతా ఒక ఎత్తయితే….అసలు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనుల కోసం మంత్రిని తీసుకువెళ్ళే టైంలో మంత్రి ఎస్కార్ట్‌ని కూడా పక్కదారి పట్టిస్తున్నారట లోకల్ పోలీసులు. ఆయన వెళ్ళాల్సింది ఒకచోటికి అయితే… దాన్ని వదిలేసి అసలు ఆహ్వానం లేని కార్యక్రమాలవైపు తీసుకెళ్ళి.. చివరి నిమిషంలో కాన్వాయ్‌ని వెనక్కి తిప్పారట. కనీసం రూట్ మ్యాప్ కూడా లేకుండా మంత్రిని రోడ్ల వెంబడి తిప్పడంతో ఆయన బాగా సీరియస్ అయినట్టు తెలిసింది. ఇక అప్పటి నుంచి లోకల్ పోలీస్ ఎస్కార్ట్ వాహనాలు తనతో ఉండకూడదని ఆదేశించారట ఆయన. వాళ్లు లేకుండానే ఇప్పుడు మంత్రి పాలకొల్లులో తిరుగుతున్నట్టు చెప్పుకుంటున్నారు. వైసిపి అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి ప్రోటోకాల్ లేకున్నా…. పాలకొల్లు వైసిపి ఇంఛార్జికి పోలీసులు పైలట్, ఎస్కార్ట్ రెండూ ఇచ్చేవారని,ఇప్పుడు మాత్రం తాను మంత్రిగా ఉన్నప్పటికి కనీసం రూట్ మ్యాప్‌కూడా లేకుండా వ్యవహరిస్తున్నారంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట మంత్రి.
Read Also: Off The Record: కేటీఆర్ జీహెచ్ఎంసీ ఎన్నికల మాటల వెనక వేరే లెక్కలు ఉన్నాయా..?
ఇక, మంత్రి పదేపదే ఆగ్రహం, అసహనం వ్యక్తం చేస్తున్నా స్థానిక పోలీసుల్లో మార్పు ఎందుకు రావడం లేదో… ఆ పెరుమాళ్ళకే ఎరుక అంటున్నారు పరిశీలకులు. పైగా పాలకొల్లు నియోజకవర్గంలోపనిచేసే పోలీసులను ఏరికోరి ఎంపిక చేసుకున్నా.. వారి తీరులో మాత్రం మార్పు రాకపోవడానికి ఉన్నతాధికారుల ఆదేశాలే కారణమన్న గుసగుసలు సైతం వినిపిస్తున్నాయి. పైస్థాయిలో పోలీస్ అధికారులు ఇప్పటికీ వైసీపీకి అనూకూలంగా వ్యవహరిస్తున్నారని, అందుకే ఆ ప్రభావం ఇక్కడ పడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. స్థానిక పోలీసుల తీరుపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు ఎస్కార్ట్‌ని వద్దనడాన్ని సీరియస్ గా తీసుకున్న ఉన్నతాధికారులు మంత్రితో మాట్లాడే ప్రయత్నం చేసినా అందుకు ఆయన ఒప్పుకోలేదని తెలిసింది. దీంతో మేటర్ సీరియస్‌గా ఉందని గ్రహించిన ఆఫీసర్స్ మంత్రిని ప్రసన్నం చేసుకునే పనిలో బిజీగా ఉన్నట్టు సమాచారం. ఇందులో భాగంగానే పాలకొల్లులో ఎప్పటినుంచో బెట్టింగులు నిర్వహిస్తున్న కొంతమందిపై తాజాగా కేసులు బుక్ అయ్యాయంటున్నారు. కేసులైతే పెట్టారుగాని, నిందితుల్ని మాత్రం అదుపులోకి తీసుకోలేదు. సదరు బెట్టింగ్ గ్యాంగ్స్‌లో వైసీపీకి చెందినవాళ్ళే ఎక్కువగా ఉండటంవల్లే… అరెస్ట్ చేయడం లేదన్నది మంత్రి అనుచరుల మాట. పాలకొల్లు పోలీసులు ఫైనల్‌గా ఏం చేస్తారో చూడాలంటున్నారు పరిశీలకులు.