పొలిటికల్ స్క్రీన్ మీద అన్నదమ్ముల సవాల్‌లో కొత్త సీన్స్ కనిపించబోతున్నాయా? ఎన్నికల్లో ఓడిపోయి పదినెలలు కామ్‌గా ఉన్న అన్న ఇప్పుడెందుకు తమ్ముడు టార్గెట్‌గా సోషల్ వార్ మొదలుపెట్టారు? ఉన్నట్టుండి ఈ మార్పునకు కారణం ఏంటి? అన్న కమ్ మాజీ ఎంపీ… ఇప్పుడు తమ్ముడు కమ్ సిట్టింగ్ ఎంపీ మీదికి కొత్త అస్త్రాల్ని సంధించబోతున్నారా? ఎవరా పొలిటికల్ వారియర్ బ్రోస్? ఏమా ఫ్యామిలీ డ్రామా? కేశినేని నాని…బెజవాడ నుంచి టిడిపి తరఫున రెండుసార్లు వరుసగా ఎంపీగా గెలిచిన నాయకుడు. మూడోసారి వైసిపి తరపున పోటీ చేసి… సొంత తమ్ముడు కేశినేని చిన్ని చేతిలోనే ఓడిపోయారాయన. ఆ ఒక్క ఓటమితోనే రాజకీయాలకు గుడ్ బై చెప్పారు నాని. టీడీపీలో ఉన్నంత కాలం సొంత పార్టీ నేతలతో అనేక సందర్భాల్లో విభేదించిన కేశినేని నానికి చివరికి పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుతో కూడా గ్యాప్ రావడంతో… చివరికి టీడీపీని వీడాల్సి వచ్చిందనేది లోకల్ టాక్. ఎన్నికల ముందు వరకు తమ్ముడు కేశినేని చిన్నిపై పలు ఆరోపణలు చేసిన నాని గెలిచాక కొన్నాళ్ళు కామ్‌గా ఉన్నారు. కానీ.. తాజాగా మరోసారి తమ్ముడు టార్గెట్‌గా మాజీ ఎంపీ యాక్టివ్ అవడం కలకలం రేపుతోంది. నాని టీడీపీలో ఉన్నప్పుడు జిల్లా పార్టీ నాయకులతో ఉన్న గొడవల గురించి చెప్పేపనేలేదు. ఎప్పటికప్పుడు ఏదో ఒక వివాదం రగులుతూనే ఉండేది. అదే సమయంలో డైరెక్ట్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన చిన్ని మీద ఎంపీగా ఉన్నప్పుడే మండిపడ్డారు నాని. కార్ స్టిక్కర్ వివాదం ఇద్దరి మధ్య తొలి గొడవగా చెబుతారు. తనకు తెలియకుండా తన కారు నెంబరుతో ఉన్న ఎంపీ స్టిక్కర్‌ని వాడుతున్నారంటూ చిన్ని భార్యపై ఎంపీ హోదాలో… నాని ఫిర్యాదు చేయడం అప్పట్లో కలకలం రేపింది. ఈ ఘటన తర్వాతే అన్నదమ్ముల మధ్య సఖ్యత లేదని, దూరం పెరిగిందనే విషయం బయటి ప్రపంచానికి తెలిసింది. ఇక ఎన్నికల సమయానికి నాని తీరు పతాక స్థాయికి వెళ్లడంతో టీడీపీలో ఆయనకు బదులు తమ్ముడు చిన్నికి ప్రాధాన్యత పెరగటం, చివరికి వైసీపీలో చేరి ఓడిపోవడం చకచక జరిగిపోయాయి. ఎన్నికల ముందు కేశినేని నాని… తమ్ముడికి వ్యతిరేకంగా ఎన్ని ప్రెస్‌మీట్స్ పెట్టి, ఎంత ప్రచారం చేసినా… ఉపయోగం లేకుండా పోయింది. ఆ తర్వాత రాజకీయాలకు గుడ్ బై అంటూ ప్రకటించిన నాని… తాజాగా పెట్టిన పోస్ట్ పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చనీయాంశం అయింది. ఆ ఎక్స్ పోస్ట్ మీద కూడా టిడిపి శిబిరంలో రక రకాల చర్చలు జరుగుతున్నాయట.
సిట్టింగ్ ఎంపీ కేశినేని చిన్నిని బూచిగా చూపించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై కేశినేని నాని ఆరోపణలు చేస్తున్నాడన్న అభిప్రాయం ఉందట టీడీపీలో. ఉద్యోగాల కల్పన కోసం ప్రతిష్టాత్మక సంస్థలకు ప్రభుత్వం భూమి కేటాయిస్తే దానికి చిన్నిని సాకుగా చూపిస్తూ…ఆరోపణలు చేయడం ద్వారా ప్రభుత్వాన్ని నాని తప్పుపడుతున్నారన్న చర్చ జరుగుతోందట తెలుగుదేశంలో. ఓవైపు చంద్రబాబుకు పుట్టినరోజుకు విషెస్ చెబుతూనే, మరో వైపు చిన్ని టార్గెట్‌గా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడాన్ని ఎలా చూడాలని ప్రశ్నిస్తున్నారు పార్టీ లీడర్స్. ఆయన మెసేజ్‌ని ఎవరు ఎలా అర్ధం చేసుకున్నా… ఫైనల్ టార్గెట్ మాత్రం తమ్ముడు చిన్నియేనన్నది ఎక్కువ మంది అభిప్రాయం. అదే సమయంలో టీడీపీలోని కొందరు నేతలు ఇంకో అడుగు ముందుకేసి నాని సోషల్ మీడియా పోస్ట్‌ల వెనక జగన్ అజెండా ఏమన్నా ఉందా? కంపెనీలకు భూముల కేటాయింపుల్ని టార్గెట్ చేసుకుని జగన్ వర్గం నానితో గేమ్ ఆడిస్తోందా అని కూడా ఆరాలు తీస్తున్నారట. ఎవరి అంచనాలు, విశ్లేషణలు ఎలా ఉన్నా… ఆ ఎక్స్ మెసేజ్‌లకు రియాక్ట్ అవ్వొద్దని మాత్రం తన అనుచరులకు చెబుతున్నారట ఎంపీ కేశినేని చిన్ని. గతంలో కూడా ఇదే విధంగా ట్వీట్ వార్ చేస్తూ కాలం గడిపారని, దానివల్ల అయ్యేది లేదు పొయ్యేది లేదని చెబుతున్నట్టు సమాచారం. అన్న ఆరోపణలకు సరైన సమయంలో నేనే స్పందిస్తానని కేడర్‌కు క్లారిటీ ఇచ్చారట చిన్ని. ఎన్నికలైన 10 నెలల తర్వాత కేశినేని చిన్ని పై నాని మొదలుపెట్టిన సోషల్ మీడియా వార్… ముందు ముందు ఏ టర్న్ తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.