ఆ గులాబీ మాజీ ఎమ్మెల్యే డబుల్ డోస్ పాలిటిక్స్ చేస్తున్నారా? వారసుడి రాజకీయ భవిష్యత్ కోసం ఇప్పట్నుంచే స్కెచ్‌ల మీద స్కెచ్‌లు వేస్తున్నారా? ఆయన ప్లానింగ్ ఎలా ఉన్నా… ఒక నియోజకవర్గంలో కేడర్ సపోర్ట్ లేదా? అక్క అయితేనే మాకు బెస్ట్ అని అంటున్నారా? ఎవరా లీడర్? ఏంటాయన రెండు పడవల ప్రయాణం? నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఇప్పుడు మరో నియోజకవర్గం మీద కూడా ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోందని అంటున్నారు. రూరల్ ఎమ్మెల్యేగా 10ఏళ్లు పనిచేసిన బాజిరెడ్డి…. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో.. ఓడిపోయారు. అప్పటి నుంచి బాన్సువాడ మీద మనసు పారేసుకున్నారట ఆయన. స్థానిక ఎమ్మెల్యే పోచారం…. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి.. కాంగ్రెస్ పార్టీలో చేరడంతో.. ఇప్పుడు అక్కడి గులాబీ బాధ్యతలు బాజిరెడ్డి చూస్తున్నారు. రూరల్ నియోజకవర్గ ఇంచార్జ్‌తోపాటు… బాన్సువాడకు అడిషనల్ ఇన్ఛార్జ్‌గా బిజీబిజీగా మారారట. పోచారం కారు దిగేశాక బాన్సువాడ బీఆర్‌ఎస్ కార్యకర్తల మీటింగ్ పెట్టి నేనున్నానంటూ భరోసా కల్పించారట గోవర్ధన్. రైతు భరోసా నిరసన కార్యక్రమాల్లో.. రెండు నియోజకవర్గాల్లో పాల్గొన్నారాయన. ఇక పార్టీ తరపున జరిగిన ఇఫ్తార్ విందులో కూడా ఎమ్మెల్సీ కవితతో కలిసి పాల్గొన్నారు. ఇలా ప్రతీ కార్యక్రమానికి రెండు నియోజకవర్గాల్లో హాజరవుతున్నారు బాజిరెడ్డి. అంత వరకు బాగానే ఉన్నా…. ఇప్పుడు ఆయన రెండు పడవల ప్రయాణం పై కొత్తగా చర్చ మొదలైందట బీఆర్ఎస్ సర్కిల్స్‌లో. భవిష్యత్తులో బాజిరెడ్డి బాన్సువాడ నుంచి పోటీ చేసి.. రూరల్ సెగ్మెంట్‌లో కొడుకుని బరిలో దింపడానికి ప్లాన్ చేస్తున్నారన్నది ఆ చర్చల సారాంశం.
అందుకే అటో కాలు, ఇటో కాలు వేసి… రెండు చోట్ల పట్టు బిగించే ప్లాన్‌లో ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. అటు బాన్సువాడ నేతలు మాత్రం బాజిరెడ్డి ఓకేగానీ…. అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారట. బాన్సువాడలో గులాబీ క్యాడర్ బలంగా ఉంది. నడిపించే నాయకుడు కావాలంటూ పార్టీ పెద్దలకు మొర పెట్టుకున్నారట ద్వితీయ శ్రేణి నాయకులు. ఎమ్మెల్సీ కవితకు బాన్సువాడ బాధ్యతలు అప్పగించాలన్నది వాళ్ళ డిమాండ్. ఆమె కాదంటేనే…. బాజిరెడ్డికి ఇవ్వాలని అధిష్టానాన్ని కోరినట్టు తెలిసింది. దీంతో కవిత కూడా నియోజకవర్గంలో ర్యాలీ నిర్వహించి పార్టీ శ్రేణుల్లో భరోసా కల్పించారు. ఈనెల 27న వరంగల్ వేదికగా జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు .. బాన్సువాడ నుంచి జనసమీకరణ బాధ్యతలను ఎమ్మెల్సీ కవితతో పాటు బాజిరెడ్డికి అప్పగించిందట పార్టీ అధిష్టానం. బాజిరెడ్డి అనుభవం దృష్ట్యా ఆయనకు రెండు సెగ్మెంట్ల బాధ్యతలు ఇచ్చేందుకు పార్టీ అధినేత సైతం సముఖంగా ఉన్నట్టు సమాచారం. కానీ… మెజార్టీ గులాబీ క్యాడర్ మాత్రం కవితకు ఇంచార్జ్ ఇస్తేనే… పార్టీకి పూర్వ వైభవం వస్తుందని పట్టుదలగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో రజతోత్సవ సభ తర్వాత బాన్సువాడ భవితవ్యం తేలుస్తామని చెప్పారట గులాబీ పెద్దలు. మాజీ ఎమ్మెల్యేకి నిజామాబాద్ రూరల్, బాన్సువాడతో పాటు ఆర్మూర్ సెగ్మెంట్‌లో కూడా పట్టు ఉందని చెప్పుకుంటారు. ఈ పరిస్థితుల్లో బాజిరెడ్డి రెండు పడవల ప్రయాణం వర్కౌట్ అవుతుందో లేదా చూడాలంటున్నారు పరిశీలకులు. ఒక నియోజకవర్గాన్ని తన కోసం మరోదాన్ని కొడుకు కోసం అంటూ ఇప్పట్నుంచే ఆయన స్కెచ్‌లు వేస్తున్నా… తీరా ఎన్నికల టైంకి ఏం జరుగుతుందో చూడాలి మరి.