Off The Record: ఈటల రాజేందర్ పార్టీ మారుతున్నారని ప్రచారం చేస్తోంది ఎవరు? తాను పార్టీ మారడం లేదు అని పదేపదే ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది? ఆయన కమలంలో కంఫర్ట్ గానే ఉన్నారా? ఈటలపై పార్టీలో అసలేం జరుగుతోంది?
బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఈమధ్య చేసిన కొన్ని కామెంట్స్ పై చర్చనే కాదు…సొంత పార్టీలోనే రచ్చ కూడా ఓ రేంజ్లో జరుగుతోంది. వివిధ సందర్భాల్లో ఆయన చేస్తున్న వ్యాఖ్యలు అనుమానాలకు కారణమవుతున్నాయన్న డిస్కషన్ సాగుతోంది. ఆయన బీజేపీ లో హ్యాపీగా లేరా…అడ్జస్ట్ కాలేకపోతున్నారా అనే డౌట్స్ పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తున్నాయి. ఈటల పార్టీ మారతారంటూ ఎప్పటికప్పుడు పుకార్లు షికారు చేస్తున్నాయి. దీంతో తాను పార్టీ మారడం లేదో మొర్రో అంటూ రెగ్యులర్గా ఈయన వివరణ ఇచ్చుకోవాల్సి వస్తోంది.
తాజాగా మరోసారి ఆయన పార్టీ మారుతున్నారని ప్రచారం మొదలైంది. జీవన్ రెడ్డి BRSకు వెళ్తున్నారని..ఆ టీంలో ఈటల రాజేందర్ కూడా ఉన్నారన్న పోస్టర్లు వెలుస్తున్నాయని చెప్పుకుంటున్నారు. ఎవరో ఆరోపణలు చేస్తే తాను వివరణ ఇచ్చుకోక తప్పడం లేదని వాపోతున్నారట ఈటల రాజేందర్. BRSలో ఉన్న కొందరు తనను ఆ పార్టీలోకి రావాలని కోరుకుంటున్నారని..అందుకే ప్రచారం చేస్తున్నారని…అయినా తను పార్టీ మారే ప్రసక్తే లేదని చెప్పుకుంటున్నారు ఈటల. కావాలనే తనపై మొసలి కన్నీరు కారుస్తున్నారని అంటున్నారు. ఏ పార్టీలోనైనా వైవిధ్యాలు, పోటీ తత్త్వం ఉంటుందని చెప్పుకొస్తున్నారు. తను ఉన్న పార్టీలో కూడా అభిప్రాయ భేదాలు ఉన్నాయని పరోక్షంగా ఒప్పుకుంటున్నారు ఈటల. అంత మాత్రాన అంగీలు మార్చినంత ఈజీగా పార్టీ మార్చడం కరెక్ట్ కాదని తాను ఎన్నో సార్లు చెప్పానని గుర్తు చేస్తున్నారు. తనను గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పార్టీలోకి రమ్మని అడిగారని చరిత్ర పేజీలు తిరగేస్తున్నారు. 2023 ఎన్నికలకి ముందు కూడా తనకు కాంగ్రెస్ నుంచి ఆఫర్ వచ్చిందని చెబుతున్నారు. పదవుల కోసం పార్టీ మారే వాడిని కాదని వివరణ ఇచ్చుకుంటున్నారు.
బీఆర్ఎస్ లో వున్నప్పుడు కేసీఆర్ తనను ఇబ్బందులకు గురిచేసి, ఆ పార్టీ నుంచి బయటకు పంపించారని గుర్తు చేసుకుంటున్నారు ఈటల. అలాంటిది మళ్ళీ ఆ పార్టీలోకి ఎలా వెళతానని ఎదురు ప్రశ్నిస్తున్నారట. తనకు బీఆర్ఎస్లో సన్నిహితులు ఉన్నంత మాత్రాన, బద్నాం చేయడం కరెక్ట్ కాదని చెబుతున్నారు. బీజేపీలోనూ తనపై కన్ఫ్యూజన్ వుంటుందని, అందుకే పదేపదే పార్టీ మారడం లేదన్న శీలపరీక్ష తప్పడం లేదని చెబుతున్నారు. కావాలనే తమ నేతపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన సన్నిహితులు ఫీలవుతున్నారు. బీజేపీలో కొందరు నేతలు కూడా పనిగట్టుకుని ఈటల పార్టీ మార్పుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని రగిలిపోతున్నారు. ఎప్పటికప్పుడు పార్టీ మారడం లేదని నిరూపించుకునే పరిస్థితికి చెక్ పడేదెప్పుడని మాట్లాడుకుంటున్నారు.




