ఆ రాజు గారు కన్నెర్రజేస్తే ఎలాంటివారైనా పొలిటికల్‌గా ఫట్‌మనాల్సిందేనా? ఆయనకు భజన చేస్తే తప్ప ఆ జిల్లాలో రాజకీయ మనుగడ కష్టమా? బంగ్లా పాలిటిక్స్ వద్దన్న వాళ్ళకు రాజకీయ భవిష్యత్తే లేకుండా పోయిందా? శతృ శేషం ఉండకూడదన్న టార్గెట్‌తో పిచ్చుకల మీద కూడా బ్రహ్మాస్త్రాలు ప్రయోగిస్తారా? ఎవరా రాజు? ఏంటాయనగారి రాజకీయ వేట? విజయనగరం జిల్లా టీడీపీ అంటే…. కేరాఫ్ అశోక్ గజపతి రాజనే చెప్పుకుంటారు అంతా. పార్టీ పుట్టిన నాటి నుంచి ఆయన అందులోనే ఉన్నారు. అశోక్ బంగ్లానే పార్టీ కార్యాలయంగా కొనసాగుతోంది. టీడీపీ కూడా ఆయనకు తగిన గౌరవం ఇచ్చింది. ఎప్పటికప్పుడు ఉన్నత పదవుల్లో కూర్చోబెట్టింది. సాఫ్ట్ పాలిటిక్స్ చేస్తారు, నిజాయితీగా ఉంటారని పేరున్న అశోక్‌ని ఎదిరిస్తే మాత్రం పరిణామాలు వేరుగా ఉంటాయట. అలాంటివారిని సందర్భం వచ్చినప్పుడల్లా… సుతిమెత్తగా… వారు పెద్ద వారు.. విజ్ఞులు అంటూ ర్యాగింగ్ చేస్తారని చెప్పుకుంటారు విశ్లేషకులు. అలాంటి వారికి రాజకీయ మనుగడ లేకుండా చేస్తారని, తీరా జరిగేదాకా ఆ విషయం వాళ్ళకు కూడా తెలియదని చెప్పుకుంటారు. ఇది ఆయనలోని అదర్ సైడ్ అట. అశోక్‌గజపతి రాజు రాజనీతి శాస్త్రం మొత్తాన్ని తానే వడకట్టి తాగేసినట్టు చెబుతారే గానీ, ఆచరణలో మాత్రం ఉండదని పార్టీలోని ఓ వర్గం నాయకులు తాజాగా గుసగుసలాడుకుంటున్నారట. మా తాతలు నేతులు తాగారన్న తరహాలో ఆయన వ్యవహారం ఉంటుందన్నది ఇంకొందరి మాట. కాకలు తీరిన నాయకులు సైతం అశోక్ గజపతి రాజు పన్నాగానికి బలైపోయరన్న చర్చ ఇప్పుడు విజయనగరం టీడీపీలో జరుగుతోందట. జిల్లాలో ఏ పదవి కావాలన్నా రాజుగారి చలవలేనిదే దక్కదన్నది లోకల్ టాక్. అందుకే ఆయన పట్టుకున్న కుందేలుకు మూడే కాళ్ళు అనాల్సిందేనట. అలా కాదు నాలుగంటే మాత్రం శంకరగిరి మాన్యాలేనన్న ప్రచారం జరుగుతోంది. అందుకు కొన్ని తాజా ఉదాహరణల్ని చూపిస్తున్నారు విజయనగరం టీడీపీ నాయకులు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. నాటి ఎన్నికలలో విజయనగరం ఎంపీగా పోటీ చేసి గెలిచారు అశోక్. కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.
అదే సమయంలో జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రిగా గంటా శ్రీనివాసరావుని నియమించింది పార్టీ. ఆ తర్వాత స్థానికంగా రెండు వర్గాలు ఏర్పడ్డాయి. ఒకటి అశోక్ వర్గం కాగా మరొకటి గంటా వర్గం. గంటా వర్గంలో ఉన్న కొండపల్లి అప్పలనాయుడు, మీసాల గీతలకు అధిక ప్రాధాన్యత లభించేదట. ఇక అప్పటి నుంచి వీరిద్దర్నీ అశోక్ టార్గెట్ చేసినట్టు చెప్పుకుంటారు. అందుకు తగ్గట్టే… తెలియకుండానే ఇద్దరి రాజకీయ భవిష్యత్తు ఇప్పుడు మసకబారిపోయిందంటున్నారు. వీరిద్దరినీ పొమ్మనకుండా పొగ పెట్టే చర్యలు చాలా చేశారని పార్టీ నాయకులే చెప్పుకుంటున్నారు. మాజీ ఎమ్మెల్యే మీసాల గీత అయితే అశోక్‌ను ఎదిరించి వేరేగా పార్టీ ఆఫీస్ ఓపెన్ చేశారు. దీన్ని పెద్ద ఇష్యూ చేసి చివరికి పార్టీ నుంచి వెల్లగొట్టారన్న విమర్శలు ఉన్నాయి. అలాగే మరో మాజీ ఎమ్మెల్యే కే ఏ నాయుడు ప్రాతినిధ్య వహిస్తున్న గజపతినగరంలో వేరే నాయకుడిని పెట్టి ఇబ్బందులకు గురిచేశారన్న టాక్ ఉంది. వారి మధ్య వివాదాలను బూచిగా చూపించి చివరికి నాయుడికి టిక్కెట్టు లేకుండా చేశారని బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. ఇలా రాజు గారిని ఎదిరిస్తే… రాజకీయంగా ఖతం కావాల్సిందేనని పార్టీ వర్గలాలో చర్చ నడుస్తోంది. మొన్నటి ఎన్నిలకలప్పుడు ఒకరిని పార్టీలోనే లేకుండా చేసి.. మరొకరికి టిక్కెట్టు కూడా రాకుండా చేశారన్నది ఇన్‌సైడ్ టాక్. ఖచ్చితంగా అశోక్‌గజపతిరాజు సీనియరే, సిన్సియరే… కానీ, ఆయన పార్టీ కోసం నిజాయితీగా పనిచేసేవారికి కాకుండా భజనపరుల్ని దగ్గరికి తీస్తే… అంతిమంగా అది టీడీపీకే నష్టం కదా అన్నది ఓ వర్గం క్వశ్చన్. పార్టీ అధిష్టానం దీన్ని ఏ కోణంలో చూస్తుందోనని గమనిస్తున్నాయి రాజకీయ వర్గాలు.