బీఆర్ఎస్ అధిష్టానం దేన్నుంచో తప్పించుకోబోయి… ఇంకెక్కడో ఇరుక్కుపోయిందా? హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నిక పార్టీని ఇరికించేసిందా? ఇప్పుడు గులాబీ పార్టీకి కొత్తగా వచ్చిన ఇబ్బంది ఏంటి? దాని గురించి అంతర్గతంగా జరుగుతున్న చర్చ ఏంటి? హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ ముగిసినా… పొలిటికల్ ప్రకంపనలు మాత్రం రేగుతూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఈ ఎలక్షన్‌లో బీఆర్‌ఎస్ వైఖరి చర్చనీయాంశమైంది. ఈ ఎన్నికలో జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లే ప్రధాన ఓటర్లు. ఇప్పటివరకు ఏకగ్రీవంగా ఎన్నికైన ఈ స్థానం నుంచి తొలిసారి పోలింగ్ జరగడం…, బీజేపీ,ఎంఐఎం తలపడటం వరకు బాగానే ఉన్నా… ఇక్కడ బీఆర్‌ఎస్ తీరు పలు ప్రశ్నల్ని లేవనెత్తుతోందంటున్నారు పరిశీలకులు. ఆ పార్టీ పోటీకి దూరంగా ఉండటం ఒక ఎత్తయితే…. గులాబీ కార్పొరేటర్స్ ఎవరూ ఓటేయకపోవడం మరో ఎత్తు. అలా ఎందుకు జరిగింది? మామూలుగా ఏ ఎన్నికైనా మరో మాట లేకుండా బరిలో దిగే బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికలో ఎందుకు పోటీ చేయలేదన్న చర్చ జరుగతుండగానే… మీరంతా ఓటింగ్‌కు దూరంగా ఉండండని పార్టీ పెద్దలనుంచి కార్పొరేటర్స్‌కు ఆదేశాలు రావడం వివాదాస్పదమవుతోంది. ఇప్పుడున్న ప్రత్యేక రాజకీయ పరిస్థితుల్లో పోటీలో ఉన్న ఏ పార్టీ అభ్యర్థికి ఓటేసినా… అది తమకు ఇబ్బందికర పరిణామం అవుతుందని భావించారట కారు పెద్దలు. అందుకే కీలక నిర్ణయం తీసుకుని పోలింగ్‌కు వెళ్ళవద్దని కార్పొరేటర్స్ అందరికీ ఫోన్లలోనే చెప్పేశారట. అక్కడితో ఆగకుండా… ఇక్కడ ఓటు హక్కు ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లతో పాటు కార్పొరేటర్స్ అందరికీ విప్ ఇచ్చింది. ఈ ఎన్నికల పోలింగ్‌లో ఎవరు పాల్గొన్నా సరే…. వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని బహిరంగంగానే ప్రకటించారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆ ఆదేశఆల ప్రకారమో… లేక మరో కారణమోగానీ… హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో బీఆర్‌ఎస్ కార్పొరేటర్స్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎవరూ పాల్గొనలేదు. అయితే… ఈ వ్యవహారం మీద, ప్రత్యేకించి బీఆర్‌ఎస్ అధిష్టానం ఆదేశాల మీద రాజకీయ దుమారం రేగుతోంది. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఆదేశాలు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్? అదీ కూడా పదేళ్ళు అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ తమ సభ్యుల్ని ఓటేయవద్దని విప్ జారీ చేయడం పద్ధతేనా అన్న ప్రశ్నలు వస్తున్నాయి.
ఇప్పటిదాకా… మన అభ్యర్థికే ఓటేయాలని, లేకుంటే ఆత్మప్రభోదానుసారం వేసుకోమని పార్టీలు చెప్పడం చూశాంగానీ… అసలు ఓటేయవద్దని విప్ జారీ చేయడం ఏంటి… విడ్డూరంకాకపోతేనూ అని బుగ్గలు నొక్కుకుంటున్నారట పొలిటికల్ పండిట్స్. కొన్ని స్వచ్ఛంద సంస్థలైతే నేరుగా రంగంలోకి దిగి ఇది రాజ్యాంగ విరుద్ధం అంటూ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశాయి. ఇక్కడ ఓటు హక్కు ఉన్నవాళ్లంతా ప్రజలు వేసిన ఓట్లతో గెలిచివచ్చినవారేనని, అలాంటి ప్రజాప్రతినిధుల్ని ఓటింగ్‌లో పాల్గొనవద్దని విప్ ఇవ్వడం ఏ రాజ్యాంగ ప్రకారం అని ప్రశ్నిస్తోంది ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్. ఇదే విషయమై బయట కూడా తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోందట. పోటీలో ఉన్న ఇద్దరు అభ్యర్థుల్లో ఎవరూ గెలవకూడదని అనుకుంటే… బీఆర్ఎస్ కూడా ఒక అభ్యర్థిని పోటీలో పెట్టి ఉంటే బాగుండేది కదా..? ఆ పని మానేసి ఓటేయవద్దని చెప్పడం ఏంటని అడుగుతున్నారు రాజకీయ విశ్లేషకులు. తాము పోటీలో ఉండిఉంటే ఓటింగ్‌లో పాల్గొనే అవకాశం ఉండేదికదా అన్నది వాళ్ళ ప్రశ్న. మరోవైపు… పార్టీ కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మీద బీఆర్‌ఎస్ అధిష్టానానికి నమ్మకం లేదా ? ఎందుకు విప్ జారీ చేయాల్సిన అవసరం వచ్చిందంటూ పార్టీలో అంతర్గతంగా చర్చించుకుంటున్నారట. అదే సమయంలో ముందు నుయ్యి, వెనక గొయ్యి అన్నట్టుగా మారడం వల్లే.. అలాంటి నిర్ణయం తీసుకుని ఉండవచ్చని వాళ్ళలో వాళ్ళే సర్దిచెప్పుకుంటున్నారట. తాము పోటీలో లేనందున పోలింగ్‌కు వెళితే… బీజేపీ బీఆర్‌ఎస్ ఒకటేననిగాని, లేదా మజ్లిస్ బిఆర్ఎస్ ఒకటేననిగాని ప్రత్యర్థులు ప్రచారం చేసే ప్రమాదం ఉందని… అందుకే పూర్తిగా డుమ్మా కొట్టి ఉండవచ్చని మాట్లాడుకుంటున్నాయి పార్టీ వర్గాలు. కానీ… ఓటేయవద్దని విప్ జారీ చేయకుండా ఉంటే బాగుండేదని, ఇప్పుడది కొత్త సమస్యగా మారే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది పార్టీ వర్గాల్లో.