కేసులు బుక్ అవగానే గప్‌చుప్‌మని దేశం దాటేసిన ఆ మాజీ ఎమ్మెల్యే ఇప్పుడెందుకు రెక్కలు కట్టుకుని ఎగిరొచ్చి నియోజకవర్గంలో వాలిపోయారు? పైగా వేధింపులు, సాధింపులు అంటూ సెంటిమెంట్ పండించి పొలిటికల్ ఆయింట్‌మెంట్ రాయడం వెనకున్న వ్యూహం ఏంటి? నాడు వణికించిన కేసుల భయం ఇప్పుడెందుకు పోయింది? ఎవరా మాజీ ఎమ్మెల్యే? ఏంటాయన ఔట్ గోయింగ్ అండ్ ఇన్ కమింగ్ స్టోరీ? నిజామాబాద్ జిల్లా బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఎట్టకేలకు.. నియోజకవర్గంలో అడుగుపెట్టారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఈ మాజీ…2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత లోకల్‌గా ముఖం చాటేశారు. 16 నెలల పాటు దుబాయ్ లోనే మకాం వేశారు. వివిధ కేసులకు సంబంధించి ఆయన మీద అరెస్ట్ వారెంట్స్ కూడా ఉన్నాయి. ఈ క్రమంలో ఇటీవల తల్లి చనిపోవడంతో… అంత్యక్రియల కోసం రాక తప్పలేదట. శంషాబాద్ ఎయిర్ పోర్టులోనే పోలీసులు షకీల్‌ను అదుపులో తీసుకుని ప్రశ్నించి వదిలేశారు. అంత్యక్రియలు ముగిసిన వెంటనే అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరిగినప్పటికీ.. ఆయన మాత్రం బోధన్, హైదరాబాద్‌కు తిరుగుతూనే ఉన్నారట. పైగా నియోజకవర్గంలో బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహాక సమావేశం ఏర్పాటు చేసి.. మౌనం వీడారు. తనపై వచ్చిన అవినీతి ఆరోపణలు, పోలీసు కేసుల గురించి కేడర్‌కు క్లారిటీ ఇచ్చారట. తనను, తన కుమారుడిని అక్రమంగా కేసుల్లో ఇరికించి.. ఇబ్బంది పెడుతున్నారంటూ… సెంటిమెంట్ ఆయింట్‌మెంట్ పూసేసినట్టు తెలిసింది. కేసులకు భయపడి తాను దుబాయ్ పారిపోలేదని, అనారోగ్య సమస్యలతో దుబాయ్‌లో ఉండాల్సి వచ్చిందని చెప్పేశారట. దీంతో ఇప్పుడు షకీల్ వ్యవహారశైలిపై కొత్త చర్చ జరుగుతోంది నియోజకవర్గంలో. ఇప్పుడాయనకు కేసుల భయం పోయిందా? ఎన్నాళ్ళని దాక్కుంటాం… పెడితే కేసులు పెట్టుకోనివ్వండని తెగించేశారా? ఎలాగూ తల్లి చివరి చూపుల కోసం రాక తప్పిందికాదు… ఇక మళ్లీ పరుగులుపెట్టడం ఎందుకు… ఇక్కడే ఉండి తాడో పేడో తేల్చుకుందామని అనుకుంటున్నారా అంటూ రకరకాల చర్చలు జరుగుతున్నాయట బోధన్‌లో. కొడుకు మీద ర్యాష్ డ్రైవింగ్ కేసు, అతన్ని తప్పించే ప్రయత్నం చేశారంటూ షకీల్ మీద కేసు బుక్ అయ్యాయి.
అంతకు ముందు ప్రభుత్వం ధాన్యాన్ని మాయం చేశారనే ఆరోపణలపై, పౌరసరఫరా శాఖ సైతం షకీల్ పై పలు కేసులు పెట్టింది. వీటి భయంతోనే ఆయన దుబాయ్ వెళ్ళిపోయారని ప్రచారం జరిగింది. నియోజకవర్గానికి, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండిపోయారు. ద్వితీయ శ్రేణి నేతలతో పాటు క్యాడర్ సైతం తమకు దిక్కెవరంటూ.. పార్టీ పెద్దలను కలిశారట. కొత్త ఇంచార్జ్‌ని నియమిస్తామని పార్టీ పెద్దలు భరోసా ఇచ్చిన టైంలోనే… నేనున్నానంటూ…. ఎంట్రీ ఇచ్చేశారు షకీల్. పైగా ఆరోపణలన్నిటికీ ఇప్పుడు వివరణలు ఇచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రజలకు అందుబాటులో ఉండరని, తానిక పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటానని చెప్పాకొస్తున్నారట మాజీ ఎమ్మెల్యే. మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్ చేస్తానని భరోసా ఇచ్చినట్టు తెలిసింది. అయితే… షకీల్ మౌనం వీడటం వెనుక .. పెద్ద వ్యూహం ఉందని చెబుతున్నారట ఆయన అనుచరులు. పార్టీ పెద్దలు సైతం మేమున్నామనే భరోసా ఇచ్చారని, బోధన్ కేంద్రంగా షకీల్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెడతారని చెబుతున్నట్టు తెలిసింది. ఇప్పుడిక ఆలస్యం చేయకుండా ముమ్మరంగా జనంలో తిరిగితే… ఒకవేళ అరెస్ట్ అయినా… జనంలో సానుభూతి వస్తుందని లెక్కలేసుకుంటున్నట్టు సమాచారం. అక్రమ కేసులు పెట్టి కక్ష సాధిస్తున్నారంటూ పదేపదే ప్రచారం చేయడం కూడా అందులో భాగమేనంటున్నారు. మాజీ ఎమ్మెల్యే వ్యూహం ఫలిస్తుందా, సెంటిమెంట్ అస్త్రం పనిచేస్తుందా.. అన్నది తేలాలంటే కొద్దిరోజులు వేచి చూడాల్సిందే.