తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు కొత్త భయం పట్టుకుందా? వాళ్ళు….. పార్టీ పెద్దల్ని టెన్షన్ పెడుతున్నారా? నిఖార్సయిన మాట మాట్లాడుకోవాలంటే… ముచ్చెమటలు పట్టిస్తున్నారా? ప్రతిపక్షం కామ్‌గా ఉన్న విషయాల్ని కూడా కెలికిపారేస్తున్నార్రా… బాబూ… మనమేం చేయాలి? ఎలా ప్రొసీడ్ అవ్వాలనుకుంటూ పసుపు ముఖ్యులు తలలు పట్టుకుంటున్నారా? ఇంతకీ… ఎవరు వాళ్ళు? వాళ్ళకు టీడీపీ అధిష్టానం ఎందుకు భయపడుతోంది? తెలుగుదేశం పార్టీకి ఇప్పుడో కొత్త టెన్షన్ పట్టుకుందట. మా పని మమ్మల్ని చేసుకోనివ్వడం లేదు. డేయ్…. ఎవర్రా మీరంతా అంటూ…. పార్టీ పెద్దలు తలలు బాదుకుంటున్నట్టు సమాచారం. ఓ వైపు సోషల్ మీడియాలో, మరోవైపు సొంత పార్టీ కార్యకర్తలు…. మద్దెల దరువేస్తున్నారని, ఎవర్నీ ఏమీ అనలేని పరిస్థితిలో ఉన్నామని ఫీలవుతున్నట్టు సమాచారం. ఏ పని చేసినా… ఏదో ఒక వంక పెట్టి వాయించేస్తున్నారన్నది టీడీపీ పెద్దల బాధగా తెలుస్తోంది. పార్టీకి కార్యకర్తలే బలం అని పదేపదే చెప్తుంటారు చంద్రబాబు.ప్రాణ సమానం అని కూడా అంటారాయన. కానీ ప్రస్తుతం ఆ కార్యకర్తలే సమస్య అవుతున్నారని అనుకుంటున్నారట పార్టీ పెద్దలు. అందుకు కారణం ఏంటంటే… వాళ్ళంతా ఉన్నది ఉన్నట్టు చెప్పేయడమేనట. గత ప్రభుత్వ హయాంలో పోరాటాలు చేసి, రకరకాలుగా నష్టపోయి ఢక్కా మొక్కీలు తిన్న కార్యకర్తలు ఈసారి మన ప్రభుత్వం వస్తే ఏదేదో జరిగిపోతుందని ఊహించేసుకున్నారట. కానీ… ఆ ఊహలేవీ వాస్తవంలోకి రాకపోవడంతోపాటు చాలా చోట్ల వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకు ప్రాధాన్యం ఇస్తున్నారన్న అసహనం పెరుగుతోంది. అదే సమయంలో ప్రభుత్వంలో ఏం జరుగుతోంది? పార్టీ కేడర్ ఏం కోరుకుంటోందన్న విషయాలను సోషల్ మీడియాలో ఓపెన్‌గా చర్చించడం అలవాటైపోయింది. ఇప్పుడిదే అధిష్టానానికి తలనొప్పిగా మారిందట. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సోషల్ మీడియాను విస్తృతంగా వాడింది టీడీపీ. కేడర్‌కు కూడా స్వేచ్ఛ ఉండేది. దానికి అలవాటు పడ్డ కార్యకర్తలు చాలామంది ఇప్పుడు కూడా వాస్తవాలు మాట్లాడ్డం మొదలుపెట్టేసరికి అధిష్టానం ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్టు సమాచారం. గతంలో మంత్రి పార్ధసారధి పాల్గొన్న కార్యక్రమానికి వైసీపీ నేత జోగి రమేష్‌ని ఆహ్వానించినప్పుడు ఏకిపారేశారు కార్యకర్తలు. ఇలాంటివి చాలానే జరిగాయి. ఇదే అంశంపై పార్టీలో ఇప్పుడు అంతర్మధనం మొదలైందట.
పార్టీకి ప్రాణంలాంటి కేడర్ ఇలా మాట్లాడ్డంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో టీడీపీ అధిష్టానం ఉన్నట్టు సమాచారం. ఇక సోషల్ మీడియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీన్ని వాడుకుంటూ సీనియర్స్ లీడర్స్ సైతం పార్టీని ఇరుకున పెడుతున్నారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోందట. మొన్నటికి మొన్న మాజీ మంత్రి గంటా శ్రీనివాస్… ఆంధ్రా టు ఆంధ్రా వయా తెలంగాణ అంటూ వైజాగ్ నుంచి విజయవాడ విమానంలో వెళ్లాలంటే హైదరాబాద్ మీదగా అంటూ పెట్టిన ఎక్స్ మెసేజ్… సంచలనంగా మారిపోయింది. ఈ పరిస్థితుల్లో… ప్రతిపక్షాలకంటే… సొంత నేతలు, కార్యకర్తలే ఇబ్బందిగా మారుతున్నారన్న చర్చ జరుగుతోందట టీడీపీ పెద్దల్లో. చిన్న తప్పు కనిపించినా… సొంత మనుషులే సోషల్ మీడియాలో పెట్టి ఏకిపారేయడం టీడీపీ అధిష్టానానికి మింగుడు పడటం లేదట. ఏపీ ఫైబర్ నెట్ మాజీ చైర్మన్ జీవీ రెడ్డి రాజీనామా తర్వాత టీడీపీ సోషల్ మీడియాలో ఆయనకు అనుకూలంగా పోస్ట్‌లు వెల్లువెత్తాయి.అలాగే కొన్ని ఇతర సంఘటనల్లో కూడా అధిష్టానమే తప్పు చేసిందన్నట్టుగా కేడర్ పోస్టింగ్స్ పెట్టడం, ట్రోల్ చేయడం అధిష్టానంలో గుబులు రేపుతోందని అంటున్నారు. సాధారణంగా ఓ పార్టీ అధికారం లోకి వచ్చాక విమర్శలు చేయాలన్నా లేదా సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెట్టాలన్నా కొంత సమయం పడుతుంది. కానీ ప్రస్తుతం ఇంత తొందరగా కార్యకర్తల్లో ఎందుకు అసహనం పెరిగిందన్న చర్చ మొదలైందట టీడీపీలో. సోషల్ మీడియాలో సొంత కార్యకర్తలే వేస్తున్న ప్రశ్నలు, చేస్తున్న దాడికి సీనియర్ మంత్రులు సైతం బెంబేలెత్తుతున్నట్టు చెప్పుకుంటున్నారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఏ కార్యకర్తలైతే టీడీపీకి అండగా ఉన్నారో… ఇప్పుడు వాళ్ళలోనే అసంతృప్తి పెరుగుతోందని, నాడు ఏ సోషల్ మీడియా అయితే సపోర్ట్ చేసిందో అదే నేడు రివర్స్ అవుతోందన్న అభిప్రాయం పెరుగుతోంది. ఒక పరిధి వరకు ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని ఎత్తి చూపి నిలదీస్తే బాగానే ఉంటుందని, ఇది శృతి మించి బూమరాంగ్ అయితే మాత్రం డ్యామేజ్ గట్టిగానే ఉంటుందన్న చర్చ జరుగుతోంది రాజకీయ వర్గాల్లో. ఇటు సోషల్ మీడియాని కంట్రోల్ చేస్తూనే… అటు కార్యకర్తల్లోని అసంతృప్తిని చల్లార్చాలని, ఈ సవాల్‌ని అధిగమించకుంచే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని టీడీపీ అధిష్టానానికి వార్నింగ్స్ వెళ్తున్నాయట.